దుస్థితిలో శ్రీవారి అఖిలాండం

19 Oct, 2014 04:09 IST|Sakshi
  • పవిత్ర ప్రదేశంలో అభివృద్ధి పనులను పట్టించుకోని అధికారులు
  •  కొబ్బరికాయలు కొట్టే రాతిబండలు విరిగిన వైనం
  •  దుర్గంధం.. ఈగల మోత.. అపరిశుభ్రత..
  • సాక్షి, తిరుమల : కోర్కెలుతీర్చే కొండలరాయునికి  మొక్కులు చెల్లించే పవిత్రస్థలం అఖిలాండం దుస్థితిలో ఉంది. నిర్వహణ  అధ్వానం గా ఉండటంతో సాక్షాత్తూ శ్రీవారి ఆలయం ఎదుటే ఉన్న శ్రీవారి ఆఖిలాండం వద్ద కొబ్బరికాయలు కొట్టే బండరాళ్లు రెండుగా విరిగిపోయాయి. కర్పూరం వెలిగించే దీపస్తంభాలు మసిబారాయి. అఖిలాండం చుట్టూ పరిసరాలు అపరిశుభ్రంగా తయారయ్యా యి. అధికారులు పట్టించుకోవడం లేదు. భక్తిశ్రద్ధల తో మొక్కులు చెల్లించేందుకు వచ్చే భక్తులు దుస్థితి లో ఉన్న అఖిలాండాన్ని చూసి ఆవేదన చెందుతున్నారు.
     
    అపవిత్రంగా అఖిలాండం

    వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్న భక్తుల్లో 75 శాతం మంది అఖిలాండంలో కర్పూరం వెలిగించి, కొబ్బరికాయలు కొట్టి మొక్కులు చెల్లిస్తుంటారు. ఒకప్పుడు వెండివాకిలి వద్ద, తర్వాత ఆలయం వెలుపల, 2003 ముందు వరకు గొల్లమండపం వద్ద అఖిలాండం ఉండేది. వేయికాళ్ల మండపం తొలగించటం, సన్నిధి వీధి దుకాణాలను మార్పు చేయడంతో బేడి ఆంజనేయస్వామి ఆలయం వద్ద పునర్నిర్మించారు. నిత్యం సుమారు 10 వేల నుంచి 20 వేల వరకు భక్తులు కొబ్బరికాయలు కొడుతుంటారు. దీనివల్ల ఇక్కడి రాతి బండలు పగిలిపోయాయి.

    మరికొన్ని బండరాళ్లు విడిభాగాలు ఊడిపోయాయి. గత ఏడాది రాళ్లపై ఇనుప కవచాలు వేసినా అవి విరిగిపోతున్నాయి. రోజూ 200 నుంచి 300 కిలోల వరకు కర్పూరం వెలిగించటం వల్ల దీప స్తంభాలు మసిబారిపోయాయి. ఇక్కడి పరిస్థితులు అధ్వానంగా ఉన్నాయి. సెకన్ల వ్యవధిలో భక్తులు కొబ్బరికాయులు కొడుతూనే ఉంటారు. దీనివల్ల ఇక్కడ పరిసరాలు అపరిశుభ్రంగా మారాయి. కొబ్బరినీళ్లు, పేరుకుపోయిన చెత్తాచెదారం వల్ల ఈగలమోత పెరిగిపోయింది. రోజూ నీటితో శుభ్రం చేయకపోవడంతో భక్తులు కాలిజారి కింద పడి గాయాలపాలవుతున్నారు.
     
    అభివృద్ధికి నోచుకోని అఖిలాండం

    పవిత్రస్థలంగా భావించే అఖిలాండం అభివృద్ధి, విస్తరణ పనులు టీటీడీ ఇంజనీర్లకు పట్టనట్టుంది. పెరిగిన భక్తులకు అనుగుణంగా అఖిలాండాన్ని విస్తరించాలని జేఈవో కేఎస్.శ్రీనివాసరాజు ఆదేశించి ఏడాది అయినా సంబంధిత ఇంజినీర్లు ఏమాత్రం పట్టించుకోలేదు. భక్తుల మనోభావాలతో కూడిన అఖిలాండం బాగు చేయాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.
     

మరిన్ని వార్తలు