తిరుమలలో టైం స్లాట్‌ సర్వదర్శనానికి శ్రీకారం

19 Dec, 2017 01:30 IST|Sakshi

ఆరు రోజులపాటు ప్రయోగాత్మక పరిశీలనమార్చి నుంచి పకడ్బందీగా అమలు

తిరుమల: శ్రీవారి టైంస్లాట్‌ సర్వదర్శనానికి సోమవారం నుంచి టీటీడీ అధికారులు శ్రీకారం చుట్టారు. కేంద్రీయ విచారణ కార్యాలయంలో ఉదయం 6 గంటలకు తిరుమల జేఈవో కేఎస్‌ శ్రీనివాసరాజు కౌంటర్లకు పూజ చేసి టికెట్ల జారీ ప్రక్రియను ప్రారంభించారు. తమిళనాడు తంజావూరుకు చెందిన శకుంతలరామన్‌ ఆధార్‌కార్డు ఆధారంగా తొలి టికెట్టు పొందారు. 24 గంటల వ్యవధిలో ఖాళీగా ఉన్న టైంస్లాట్లలో ఎంపిక చేసుకున్న సమయాన్నిబట్టి భక్తులు టికెట్లను పొందే సౌకర్యాన్ని టీటీడీ కల్పించింది.

టికెట్లు పొందిన భక్తులను దివ్యవదర్శనం కాంప్లెక్స్‌ నుండి అనుమతిస్తారు. టికెట్లను స్కానింగ్‌ చేసిన తర్వాత ఒక్కో భక్తుడికి రూ.10ల లడ్డూలు రెండు, రూ.25ల లడ్డూలు మరో రెండు అందజేస్తారు. కాంప్లెక్స్‌లోకి వెళ్లిన భక్తులకు రెండు గంటల్లోపే శ్రీవారి దర్శనం కల్పించే ఏర్పాట్లు చేశారు. ప్రస్తుతం 14 ప్రాంతాల్లో 117 కౌంటర్లు ఏర్పాటు చేశౠమని, మార్చి నుంచి తిరుపతిలోనూ కౌంటర్లు ఏర్పాటు చేస్తామని జేఈవో వెల్లడించారు. ఆరు రోజులపాటు ప్రయోగాత్మకంగా పరిశీలించి లోటుపాట్లు సవరిస్తామన్నారు. కార్యక్రమంలో టీటీడీ సీవీఎస్‌వో ఎ.రవికృష్ణ, ఎస్‌ఈ రామచంద్రారెడ్డి, ఐటీ అధికారి శేషారెడ్డి, పీఆర్‌వో రవి, డాలర్‌ శేషాద్రి పాల్గొన్నరు. కాగా, సర్వ దర్శనం స్లాట్ విధానం ద్వారా సోమవారం 18 వేలకుగాను 12 వేల టోకెన్లు జారీ చేశారు. మంగళవారం 20 వేలు మంజూరు చేయనున్నారు. 

మరిన్ని వార్తలు