తిరుమలలో 30 గంటలుగా క్యూలైన్‌లోనే..

29 Dec, 2017 10:57 IST|Sakshi

4 గంటలుగా కొనసాగుతున్న వైకుంఠ ద్వార దర్శనం

చలికి తట్టుకోలేక సామాన్య భక్తుల ఇబ్బందులు

పెరిగిన వీఐపీల తాకిడి

సాక్షి, తిరుమల: వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమల శ్రీవారి ఆలయంలో తెల్లవారుజామునుంచే ఉత్తర ద్వార దర్శనం ప్రారంభం అయింది. ఆలయంలో వైకుంఠ ద్వారాలను ఆలయ పెద్ద జీయర్ స్వామి తెరిచారు. ధనుర్మాస కైంకర్యాల అనంతరం విఐపి దర్శనం ప్రారంభం అయింది. స్వామి దర్శనానికి విఐపిలు బారులు తీరారు. సామాన్య భక్తులు 30 గంటలుగా క్యూలైన్‌లో పడిగాపులు పడుతూ చలికి అల్లాడుతున్నారు. నాలుగు కిలోమీటర్ల వరకు భక్తులు క్యూలైన్‌లో వేచివున్నారు. ఉదయం 8 గంటలకు సామాన్య భక్తులకు వైకుంఠ దర్శనం ప్రారంభం అయింది. భక్తులు భారీగా తరలిరావడంతో వసతి దొరక్క రోడ్లపైనే ఉండాల్సి వచ్చింది. వైకుంఠ ఏకాదశికి 3563 విఐపి టికెట్లను టీటీడీ జారీ చేసింది. విఐపిలకు 4 గంటలుగా శ్రీవారి దర్శనం కొనసాగుతున్నది.

శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖుల్లో జస్టిస్‌ ఎన్‌.వి.రమణ, జస్టిస్‌ సంతానగౌడర్‌, హైకోర్టు న్యాయమూర్తులు రామలింగేశ్వర్‌రావు, శంకర్‌నారాయణ, సునీల్‌ చౌదరి,అమర్నాథ్‌గౌడ్‌, నాగార్జునరెడ్డి, మాజీ న్యాయమూర్తులు డి.సుబ్రహ్మణ్యం, నూతి రామ్మోహన్‌, రవీంద్రన్‌ ఉన్నారు. అలాగే ఏపీ మంత్రులు కళా వెంకటరావు, అయ్యన్నపాత్రుడు, కొల్లు రవీంద్ర, అమర్నాథ్‌రెడ్డి, నిమ్మకాయల చినరాజప్ప, పితాని సత్యనారాయణ, శిద్ధా రాఘవరావు, సోమిరెడ్డి, విప్‌లు మేడా మల్లికార్జునరెడ్డి, రామసుబ్బారెడ్డి, కోన రవికుమార్‌, ఎమ్మెల్యేలు చింతమనేని ​ప్రభాకర్‌, మాధవనాయకుడు, సుగుణమ్మ, బొల్లినేని రామారావు, సత్యప్రభ, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, రామరెడ్డి ప్రతాప్‌రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, తలారి ఆదిత్య, అనిల్‌కుమార్‌ యాదవ్‌, మండలి బుద్ద ప్రసాద్‌, నారాయణస్వామి, రవీంద్రరెడ్డి, శ్రీనివాసులు, శ్రీకాంత్‌‌రెడ్డి, ఎంపీలు అవంతి శ్రీనివాస్‌, రాయపాటి సాంబశివరావు, సీఎం రమేష్‌, రామ్మోహన్‌ నాయుడు, తెలంగాణ ఎమ్మెల్యేలు శ్రీనివాస్‌గౌడ్‌, సండ్ర వెంకటవీరయ్య, డి.కె.అరుణ ఉన్నారు. 

టీటీడీ మాజీ చైర్మన్‌లు కనుమూరి బాపిరాజు, చదలవాడ కృష్ణమూర్తి, సినీ నటులు మోహన్‌బాబు, సప్తగిరి, అంబరీష్‌, నిర్మాత బండ్ల గణేష్‌లు శ్రీవారిని దర్శించుకున్నారు. సీఎం చంద్రబాబు సతీమణి భువనేశ్వరి, కేంద్ర సమాచార కమిషనర్‌ శ్రీధర్‌ ఆచార్యులు, మాజీ ప్రధాని దేవెగౌడ, చిత్తూరు కలెక్టర్‌ ప్రద్యుమ్న, ఎస్పీ రాజశేఖర్‌, జెడ్పీ చైర్‌పర్సన్‌ గీర్వాణి, మృదంగ వాద్య కళాకారుడు ఎల్లా వెంకటేశ్వర్లు కూడా శ్రీవారిని దర్శించుకున్నారు.


 

మరిన్ని వార్తలు