నీరిలా వృథాయేనా!

3 Aug, 2013 06:16 IST|Sakshi

బాల్కొండ, న్యూస్‌లైన్ : ఉత్తర తెలంగాణ జిల్లాలను సస్యశ్యామలం చేయాలన్న లక్ష్యంతో యాభై ఏళ్ల క్రితం శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నిర్మాణం చేపట్టారు. 112టీఎంసీల నీటిని నిల్వ చేయొచ్చ ని అంచనా వేశారు. ఎగువ ప్రాంతాల నుంచి వచ్చే వరదల వల్ల ప్రాజెక్టులోకి ఏటా పూడిక వచ్చి 1994 నాటికి నీటి నిల్వ సామర్థ్యం 90 టీఎంసీలకు తగ్గిపోయింది. 2006 లో సర్వేచేసిన ఆంధ్రప్రదేశ్ ఇంజినీరింగ్ రీసెర్చ్ ల్యాబొరెటరీస్(ఏపీఈఆర్‌ఎల్) సంస్థ ఎస్సారెస్పీ సామర్థ్యం 76 టీఎంసీలకు పడిపోయిందని నివేదిక ఇచ్చింది. ప్రస్తుతం ఈ సామర్థ్యం భారీగా తగ్గిపోయి ఉంటుందని భావిస్తున్నారు. పూడిక వల్ల ప్రాజెక్టు సామర్థ్యం ఏటా 0.8 టీఎంసీలు తగ్గుతోందని అధికారులే పేర్కొంటున్నారు. పూడిక మయమవడం వల్ల ప్రాజెక్టు వేగంగా నిండుకుండలా మారుతుండడంతో అదనపు నీటిని గోదావరిలోకి వదలాల్సి వస్తోంది.
 
 గురువారం 26 వరద గేట్ల ద్వారా లక్ష క్యూసెక్కుల నీటిని గోదావరిలోకి వదిలారు. ప్రతి గంటకు 0.376 టీఎంసీ నీరు గోదావరి పాలవుతోంది. ఇలా 24 గంటల నీరు వరద గేట్ల ద్వారా గోదావరిలోకి వదిలడంతో ఒక్క రోజులోనే 8.5 టీఎంసీల నీరు వృథాగా పోయింది. మరో రెండు రోజులు ప్రాజెక్టు నుంచి నీటిని గోదావరిలోకి వదిలే అవకాశం ఉంది. టీఎంసీ నీటితో 10 వేల ఎకరాలకు సాగు నీరందించవచ్చని అధికారులంటున్నారు. ప్రాజెక్టు నిర్మాణ సమయంలోని సామర్థ్యంతో ఉంటే అదనంగా 50 వేల ఎకరాలకు సాగునీరందేదని రైతులు పేర్కొంటున్నారు. ప్రాజెక్టులోని పూడికను తొలిగించాలని కోరుతున్నారు.

>
మరిన్ని వార్తలు