అడవిలో పరీక్ష అని తెలియక..

25 Oct, 2017 13:01 IST|Sakshi

సకాలంలో నగరానికి వచ్చిన ఎస్‌ఎస్‌సీ అభ్యర్థులు

ఊరికి చివర అని తెలుసుకుని ఉరుకులు పరుగులు

ఐదు నిమిషాల ఆలస్యంతో సెక్యూరిటీ అడ్డగింపు

పరీక్షా కేంద్రం ఎంపికను పునరాలోచించాలని విన్నపం

సాక్షి, తూర్పుగోదావరి ,రాజమహేంద్రవరం:  ఐదు నిమిషాల ఆలస్యంగా వెళ్లడంతో స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ పరీక్ష అభ్యర్థులను పరీక్షా కేంద్రంలోకి అనుమతించలేదు. మంగళవారం ఉదయం, మధ్యాహ్నం రెండు విడతల్లో ఈ పరీక్షలు జరిగాయి. రెండో విడత ఆన్‌లైన్‌ పరీక్ష మధ్యాహ్నం 1:30 గంటలకు ప్రారంభమైంది. అభ్యర్థులు 30 నిమిషాల ముందుగా పరీక్ష కేంద్రానికి చేరుకోవాల్సి ఉంది. అయితే రాజానగరం మండలం దివాన్‌చెరువులోని శ్రీప్రకాశ్‌ విద్యానికేతన్‌ స్కూల్‌ గ్రామానికి లోపల మూడు కిలోమీటర్ల దూరంలో ఉంది. గ్రామంలోనే విద్యాసంస్థ ఉందని భావించిన అభ్యర్థులు ఆ మేరకు తమ ప్రాంతాల నుంచి వచ్చారు. తీరా దివాన్‌చెరువు గ్రామానికి వచ్చిన తర్వాత స్కూలు మూడు కిలోమీటర్ల లోపల, అడవిలో ఉందని తెలియడంతో అక్కడకు ఎలా వెళ్లాలో తెలియక కంగారు పడ్డారు. రవాణా సౌకర్యం కూడా లేకపోవడం, ఓ పక్క సమయం మించిపోతుండడంతో పలువురు అభ్యర్థులు పరుగులు పెట్టారు.

మధ్యాహ్నం 1.30 గంటలకు ఆన్‌లైన్‌ పరీక్షకు హాజరయ్యేందుకు ఒంటి గంటకు అభ్యర్థులు పరీక్ష కేంద్రానికి చేరుకోవాల్సి ఉంది. అయితే పలువురు అభ్యర్థులు 1.05 గంటలకు చేరుకోవడంతో గేటు వద్దే వారిని నిలిపివేశారు. జరిగిన విషయం వివరించినా సెక్యూరిటీ సిబ్బంది వారిని అనుమతించలేదు. స్కూలు గ్రామానికి మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న విషయం తెలియక తాము నష్టపోయామని భావించిన కె.సత్యనారాయణ, ప్రసాద్, నవీన్‌కుమార్‌ తదితర పది మంది అభ్యర్థులు మరొకరు తమలా నష్టపోకూడదంటూ ‘సాక్షి’ కార్యాలయానికి వచ్చారు. జరిగిన విషయం చెప్పి వాపోయారు. పరీక్ష కేంద్రం మూడు కిలోమీటర్ల దూరంలో ఉండడం, రవాణా సౌకర్యం కూడా లేకపోవడం ఆ సెంటర్‌ను మరోసారి ఎంపికచేసే సమయంలో అధికారులు పునరాలోచన చేయాలని విజ్జప్తి చేస్తున్నారు. నెలల తరబడి పరీక్షకు సిద్ధమైన తాము తమ తప్పు లేకుండానే నష్టపోయామని వాపోయారు.

మరిన్ని వార్తలు