నిర్వాసితులకు రాళ్ల భూములిచ్చారు : ఎస్టీ కమిషన్‌

3 Jul, 2018 20:30 IST|Sakshi
పోలవరం ప్రాజెక్టు వద్ద సీఎం చంద్రబాబు (పాత ఫొటో)

సాక్షి, న్యూఢిల్లీ : ఇందిరాసాగర్‌ పోలవరం ప్రాజెక్టు వల్ల ప్రభావితమయ్యే గిరిజనులకు కల్పించాల్సిన పునరావాసంపై రాష్ట్రపతికి జాతీయ గిరిజన కమిషన్‌ మంగళవారం నివేదిక అందజేసింది. పోలవరం కమాండ్‌ ఏరియాలో గిరిజనులకు సాగుభూమి ఇవ్వాలని సిఫారసు చేసింది. భూ సేకరణ చట్టం ప్రకారం గిరిజనులకు నష్టపరిహారం చెల్లించాలని సూచించింది. ఈ మేరకు ఆర్టికల్‌ 338 ఎ(5) ప్రకారం ఏపీ ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలను కమిషన్‌ సూచించింది.

రాజ్యాంగ రక్షణలు, సంక్షేమం, సామాజిక ఆర్థికాభివృద్ధి అంశాలను సమర్ధవంతంగా అమలు చేయాలని చెప్పింది. ఈ ఏడాది మార్చి 26 నుంచి 28 వరకూ పోలవరం ప్రాజెక్టు ప్రాంతాలను గిరిజన కమిషన్‌ సభ్యులు సందర్శించిన విషయం తెలిసిందే.
నివేదికలోని ముఖ్యాంశాలు :
- గిరిజ‌నుల వ‌ద్ద భూమి తీసుకుని సాగుకు అనుకూలత లేని, రాళ్లు రప్పలతో కూడిన భూమిని ఇచ్చారు. వీరికి పోల‌వ‌రం క‌మాండ్ ఏరియాలో సాగుభూమిని ఇవ్వాలి. - క‌నీసం 2.5 ఎక‌రాల సాగుభూమిని ప్రాజెక్టు కింద ఇవ్వాలి.
- అటవీ ఉత్పత్తులపై ఆధారపడి గిరిజ‌నుల‌కు ప్రత్యామ్నాయ జీవ‌నోపాధిని కల్పించాలి.
- వ‌ర‌ద‌ల్లో కూలిపోయిన ఇద్దికుల‌కొట్ట గ్రామంలోని ఇళ్లను తిరిగి నిర్మించి ఇవ్వాలి.
- గిరిజ‌నుల‌కు ప‌రిహారం అంశాన్ని సుమొటోగా స్వీకరించి పునఃస‌మీక్షించాలి.
- సుప్రీంకోర్టు తీర్పుకు అనుగుణంగా భూ సేక‌ర‌ణ చ‌ట్టం ప్రకారం త‌గిన ప‌రిహారాన్ని అంద‌జేయాలి.
- పున‌రావాస చర్యల్లో భాగంగా గిరిజనులకు మౌలిక స‌దుపాయాలు కల్పించాలి.
- కాలేజీలు, యూనివ‌ర్సిటీలు, మెడిక‌ల్ కాలేజీలు ఏర్పాటు చేయాలి.
- ప‌రిహార, పున‌రావాస కార్యక్రమాల బాధ్యతలు అన్నీ ఆర్ అండ్ ఆర్ క‌మిష‌న‌ర్‌కే ఇవ్వాలి.
- ప్రాజెక్టుకు పూర్తి కావ‌డానికి నాలుగు నెల‌ల ముందే ఆర్ ఆండ్ ఆర్ ప్యాకేజీ అమలు చేయాలి.
- ప్రాజెక్టు ప్రభావితుల‌కు ప‌రిశ్రమల్లో ఉద్యోగాలు క‌ల్పించాలి.
- వీట‌న్నిటి పర్యవేక్షించే ఆర్ అండ్ ఆర్ అధికారుల‌ను బ‌దిలీ చేయ‌కూడ‌దు.  ప్రాజెక్టు పూర్తైన ఐదేళ్ల వరకూ అక్కడే సేవ‌లందించాలి.

మరిన్ని వార్తలు