గ్యాస్‌ అయిపోయిందని భోజనం వండని సిబ్బంది

17 Jul, 2019 07:57 IST|Sakshi
హాస్టల్‌లోని విద్యార్థులు

ఓజిలి బీసీ బాలుర వసతిగృహంలో ఇదీ పరిస్థితి

యువకులు స్పందించి భోజనం తయారు చేయించిన వైనం

ఓజిలి: వంట గ్యాస్‌ అయిపోయిందని విద్యార్థులకు వసతిగృహ సిబ్బంది భోజనం తయారు చేయలేదు. ఈ సంఘటన మండల కేంద్రమైన ఓజిలి బీసీ బాలుర వసతిగృహంలో మంగళవారం రాత్రి చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. గృహంలో 105 మంది విద్యార్థులున్నారు. అయితే 37 మంది మాత్రమే ఉదయం గృహానికి వచ్చి ఉన్నత పాఠశాలకు వెళ్లారు. సాయంత్రం తిరిగి వచ్చారు. రాత్రి ఏడు గంటలు దాటినా వారికి భోజనం తయారు చేయలేదు. ఈ విషయం ఓజిలిలోని కొందరు యువకులకు తెలిసింది. వారు వసతిగృహానికి వెళ్లి ప్రశ్నించగా గ్యాస్‌ అయిపోందని, దీంతో తాము భోజనం వండలేదని సిబ్బంది తెలిపారు. దీంతో యువత స్వచ్ఛందంగా కట్టెలు తీసుకొచ్చి భోజనం తయారు చేయించి తొమ్మిది గంటలకు విద్యార్థులకు వడ్డించారు. అప్పటి వరకు విద్యార్థులు ఆకలితో అలమటించారు. 37 మంది విద్యార్థులు హాస్టల్‌లో ఉంటే 105 మందికి హాజరు వేసి ఉండడం గమనార్హం. గత నెలలో చిట్టమూరు వసతిగృహం నుంచి వార్డెన్‌ తిరుపాలయ్య ఓజిలికి బదిలీపై వచ్చారు. అప్పటి నుంచి ఇప్పటికి రెండురోజులు మాత్రమే ఆయన హాస్టల్‌కు వచ్చారని చెబుతున్నారు. కానీ రిజిస్టర్‌లో మాత్రం జూన్‌ నెల నుంచి సంతకాలు చేసి ఉన్నారు. కాగా ఈ వ్యవహారంపై జిల్లా బీసీ సంక్షేమాధికారిణి రాజేశ్వరిని వివరణ కోరగా వసతిగృహాన్ని పరిశీలించి వార్డెన్‌పై చర్యలు తీసుకుంటామని చెప్పారు. విద్యార్థులకు భోజనం తయారు చేయని విషయంపై వార్డెన్‌ నుంచి వివరణ తీసుకుంటామన్నారు. చిలమానుచేను వార్డెన్‌ రమణయ్యను హాస్టల్‌కు పంపి విద్యార్థులకు భోజన వసతి ఏర్పాటు చేస్తామన్నారు.     

మరిన్ని వార్తలు