ప్రభుత్వాస్పత్రి తీరు మారలేదయా!

24 Nov, 2018 08:41 IST|Sakshi
ఆపరేషన్‌ చేయించుకున్న సుశీలకు సహాయకురాలుగా వెళ్తున్న బంధువు నొప్పులతో ఆటోలో కుప్పకూలిన సుశీల

విశాఖపట్నం, యలమంచిలి:  ఆపరేషన్‌ ముగిసిన వెంటనే రోగిని వీల్‌చైర్, స్ట్రెచర్‌పై సున్నితంగా బెడ్‌పైకి తీసుకెళ్లే దృశ్యం ప్రైవేటు, కార్పొరేట్‌ ఆస్పత్రుల్లో కనిపిస్తుంటుంది. ప్రభుత్వ వైద్యశాలల్లో మాత్రం ఇందుకు విరుద్ధంగా ఆపరేషన్లు చేయించుకున్న మహిళలను వారి మార్గాన వారిని పొమ్మంటున్నారు వైద్యసిబ్బంది. శుక్రవారం యలమంచిలి సామాజిక ఆస్పత్రిలో బాలింతలకు కు.ని శస్త్రచికిత్సలు చేశారు. ఆపరేషన్లు ముగిసిన వెంటనే బాలింతలను నిర్లక్ష్యంగా వదిలేశారు. వీల్‌చైర్లు, స్ట్రెచ్చర్లు అందుబాటులో ఉన్నప్పటికీ వైద్యసిబ్బంది ఆపరేషన్‌ థియేటర్‌ నుంచి వస్తున్న బాలింతలను పట్టించుకోకుండా వదిలేశారు.

దీంతో చేసేది లేక వారి బంధువుల సహకారంతో నొప్పులతో నడవలేని పరిస్థితిలో నడుచుకుంటూ వెళ్లి నరకయాతన పడ్డారు. యలమంచిలి పట్టణంలోని గాంధీనగరానికి చెందిన సుశీల అనే మహిళ శుక్రవారం మధ్యాహ్నం తమ బంధువు సహకారంతో అతికష్టం మీద నడుచుకుంటూ వెళ్లి ఆటో ఎక్కీ ఎక్కగానే నీరసంతో కుప్పకూలిపోయింది. ఆపరేషన్లు ముగిసిన వెంటనే ఇన్‌పేషెంట్‌ వార్డులో బెడ్లపై ఉంచి చికిత్స చేయాల్సిన వైద్యులు, సిబ్బంది బాలింతలపై నిర్లక్ష్యం చూపారు. ఆపరేషన్లు చేయడంతోనే తమ పని పూర్తయిందనుకుంటున్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు హెచ్చరిస్తున్నా వైద్యసిబ్బంది తీరులో మార్పు రావడంలేదని రోగులు అభిప్రాయపడ్డారు.  

మరిన్ని వార్తలు