స్వీపర్లే.. స్టాఫ్‌నర్సులు

1 Jun, 2019 12:39 IST|Sakshi
గాయపడిన వ్యక్తికి చికిత్స చేస్తున్న స్వీపర్‌

క్షతగాత్రుని చేయి పట్టని స్టాఫ్‌నర్సులు

కోవెలకుంట్ల సీహెచ్‌సీలో సకాలంలో అందని అత్యవసర సేవలు

కోవెలకుంట్ల: స్థానిక కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్‌లో పనిచేస్తున్న స్వీపర్లు స్టాఫ్‌నర్సుల అవతారమెత్తారు. క్షతగాత్రులు, వివిధ సంఘటనల్లో గాయపడిన వ్యక్తుల చేయి కూడా ఇక్కడ పనిచేస్తున్న కొందరు స్టాఫ్‌ నర్సులు పట్టుకోకపోవడంతో అత్యవసర సేవలకు స్వీపర్లే దిక్కయ్యారు. కోవెలకుంట్ల సీహెచ్‌సీ ద్వారా మండలంతోపాటు సంజామల, ఉయ్యాలవాడ, దొర్నిపాడు మండలాలకు చెందిన రోగులకు ఓపీ, అత్యవసర వైద్య సేవలందాల్సి ఉంది. కోవెలకుంట్ల నుంచి నంద్యాల, ఆళ్లగడ్డ, జమ్మలమడుగు, కర్నూలు, అవుకు, తదితర ప్రధాన రహదారులు ఉండటంతో ఈ మార్గాల్లో తరుచుగా ప్రమాదాలు చోటు చేసుకుంటుండటంతో క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సీహెచ్‌సీకి తరలిస్తుంటారు.

విలువైన ప్రాణాలతో చెలగాటం: రెండు రోజుల క్రితం సంజామలకు చెందిన ఓ వ్యక్తికి గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం సీహెచ్‌సీలో అత్యవసర చికిత్స విభాగానికి తరలించారు. ఇక్కడ పని చేస్తున్న నిర్మల జ్యోతి అనే స్టాఫ్‌నర్స్‌ నైట్‌ డ్యూటీ నిర్వహిస్తోంది. తలకు గాయమైన వ్యక్తికి స్టాఫ్‌నర్స్‌ వైద్య సేవలు అందించాల్సి ఉండగా గాయాన్ని పరిశీలించడంతోపాటు కట్టుకట్టే వరకు వైద్య చికిత్సలన్నీ అక్కడే ఉన్న స్వీపర్‌తో చేయించింది. గదిలో కూర్చున్న స్టాఫ్‌ నర్స్‌ చివరకు వచ్చి రెండు ఇంజక్షన్లు వేసి వెళ్లిపోయింది. అత్యవసర వైద్య చికిత్స విభాగం డాక్టర్‌తోపాటు స్టాఫ్‌నర్స్‌ వైద్యసేవలందించాల్సి ఉంది. కాని డాక్టర్‌ అందుబాటులో లేకపోగా ఉన్న స్టాఫ్‌నర్సు వైద్యసేవలందించకపోవడం సర్వత్రా విమర్శలకు తావిస్తోంది. ఈ ఒక్క బాధితుడికే కాదు ప్రతి రోజు ఆసుపత్రికి వచ్చే బాధితులకు ఇలాగే జరుగుతోందని పలువురు ఆరోపిస్తున్నారు. శరీర అవయవాలకు గాయాలై ప్రాణాపాయస్థితిలో కొట్టుమిట్టాడుతున్న వ్యక్తులకు సకాలంలో వైద్య సేవలందించి ప్రాణభిక్ష పెట్టాల్సిన వైద్య సిబ్బంది విధుల పట్ల నిర్లక్ష్యం చేస్తుండటంతో వచ్చిరాని వైద్యంతో స్వీపర్లు రోగుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. సంబంధిత ఉన్నతాధికారులు విధుల పట్ల నిర్లక్ష్యం చేస్తున్న సిబ్బందిపై శాఖపరమైన చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. ఈ విషయంపై సీహెచ్‌సీ ఇన్‌చార్జ్‌ డాక్టర్‌ జఫురుల్లాను వివరణ కోరగా స్వీపర్లు వైద్య సేవలందిస్తున్న సంఘటనపై విచారణ జరిపి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు