స్వీపరే స్టాఫ్ నర్సు!

13 Nov, 2014 03:04 IST|Sakshi
స్వీపరే స్టాఫ్ నర్సు!

చిన్నపిల్లల విభాగంలో నిద్రపోతున్న స్టాఫ్ నర్సులు
 
 అనంతపురం రూరల్: సర్వజనాస్పత్రిలో స్వీపర్లే స్టాఫ్ నర్సుల అవతారం ఎత్తుతున్నారు. రోగులకు సేవలందించాల్సిన స్టాఫ్ నర్సులు నిద్రపోతున్నారు. చిన్నారులకి చేసే వైద్యంలో ఏమాత్రం పొరపాటు జరిగినా వారి ప్రాణాలకే ప్రమాదం. అటువంటి చిన్నపిల్లల విభాగంలో స్వీపర్లు విధులు నిర్వర్తించాల్సి వస్తోంది. బుధవారం చిన్నపిల్లల వార్డులో ఓ స్వీపర్ స్టాఫ్ నర్సుగా పనిచేసింది.

వారు చేసే పనితో పాటు రోగులకు సేవలందించింది. శీతాకాలం కావడంతో శ్వాసకోస సంబంధిత వ్యాధులతో చిన్నారులు అధిక సంఖ్యలో ఆస్పత్రికి వచ్చారు. వారికి ప్రతి రోజూ రెండు పూటల నెబులైజేషన్  అందించాలి. ఎవరూ ఆ వార్డులో లేకపోవడంతో కుటుంబీకులే నెబులైజేషన్‌ను శుభ్రం చేసుకోవాల్సి వచ్చింది. ఎంతసేపటికీ స్టాఫ్ నర్సు గానీ ఇతర సిబ్బంది గానీ రాకపోవడంతో ఓ మహిళ తన కూతురికి నెబులైజేషన్ అందించేందుకు ప్రయత్నించింది.

కానీ ఏవిధంగా ఇవ్వాలో తెలియకపోతే చివరకు ఆ వార్డులో పనిచేస్తున్న స్వీపర్ వచ్చి నెబులైజేన్ అందించింది. నిత్యం ఇదే పరిస్థితి నెలకొంటోందని రోగుల బంధువులు వాపోతున్నారు. విధులు సక్రమంగా నిర్వర్తించాల్సిన సిబ్బంది మీనామేషాలు లెక్కిస్తున్నారు.

 నెబులైజేషన్‌తో ఇన్‌ఫెక్షన్స్: చిన్నపిల్లల వార్డులో అందిస్తున్న నెబులైజేషన్‌ను సరిగా శుభ్రం చేయడం లేదు. ఒకరికి పట్టిన వెంటనే మరొకరికి అందిస్తున్నారు. వాస్తవానికి శుభ్రం చేసిన వెంటనే మరొకరికి ఇవ్వాలి. అలా చేయకపోవడంతో ఎవరికైనా ఇన్‌ఫెక్షన్స్ అధికంగా ఉంటే ఇతరులకు సోకే ప్రమాదం లేకపోలేదు. స్వీపర్లు శుభ్రం చేయకుండా అలాగే అందిస్తున్నారు. అటుగా వెళ్తున్న వైద్యులు సైతం పట్టించుకోవడం లేదు. దీనిని తేలిగ్గా తీసిపారేస్తున్నారు.

మరిన్ని వార్తలు