ఆపదలో అపర సంజీవిని..

20 Mar, 2018 12:00 IST|Sakshi

సమ్మె దిశగా 108 సిబ్బంది!

గాడి తప్పిన వ్యవస్థ

వాహనాలకు సిబ్బంది కొరత

ఆపదలో ఉన్నవారిని ఆదుకొని పునర్జన్మ ప్రసాదించే ‘108’ (అంబులెన్స్‌) వాహనాలు, అందులో పనిచేసే సిబ్బంది సమస్యల కారణంగా ఆపదలో పడ్డారు.కష్టాలు గట్టెక్కుతాయని వారు ఇన్నాళ్లుగా ఎదురు చూశారు. చాలీ చాలని వేతనాలతో  పనిచేశారు.ఇక చేసేది లేక  వారు సమ్మె దిశగా అడుగలు వేస్తున్నారు. 108 వాహనం రావడం కాస్త ఆలస్యమైతేనే అమ్మో..అని అంటాం. ఒకవేళ అవి పూర్తిగా నిలబడిపోతే పరిస్ధితి ఏమిటి...? అనే సందేహం అందరిలో వ్యక్తమవుతోంది.

కడప రూరల్‌:రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల కారణంగా 108 వాహనాలు ప్రమాదంలో పడ్డాయి. ఎంతలా అంటే ప్రభుత్వం ఎప్పడు ఏ నిర్ణయం తీసుకుంటుందో తెలి యని పరిస్థితి నెలకొంది. జిల్లా వ్యాప్తంగా ‘108’ వాహనాలు రెండు బ్యాకప్‌తో కలిపి మొత్తం 31 వాహనాలు ఉన్నాయి.

సంస్థ మారినా వెంటాడుతున్న సమస్యలు..
గడిచిన 2017 డిసెంబర్‌ 13వ తేదీన 108 వ్యవస్ధ జీవీకే నుంచి యూకేఎస్‌ఏఎస్‌ మరియు బీవీజీ సంయుక్త ఆధ్వర్యంలోకి వచ్చింది. అంతకుముందు అరకొరగా ఉన్న సమస్యలు సంస్థ మార్పుతో   మరింత ఎక్కువయ్యాయి.  వాహనాలు తిరగాలంటే  కండీషన్‌లో ఉండాలి. ప్రధానంగా డీజిల్‌ సమస్య ఉండకూడదు. అయితే ఈ రెండు సమస్యలు వీటిని పట్టి పీడిస్తున్నాయి. ఒక వాహనానికి నెలకు డీజల్‌; మరమ్మతులు, సిబ్బంది వేతనాలకు రూ 1.10 లక్షలు రావాలి. అయితే  నిధులు సక్రమంగా అందడంలేదు. దీంతో చాలా వాహనాలకు కొత్త టైర్లను మార్చలేని పరిస్ధితి నెలకొంది. అలాగే వాహనాలు కండీషన్‌లో లేని కారణంగా ఎక్కడ పడితే అక్కడ ఆగిపోతున్నాయి. డీజల్‌ బకాయిలు లక్షల్లో పేరుకుపోయి ఉన్నాయి.  

ఇబ్బందుల్లో సిబ్బంది..
రెండు వాహనాలకు సగటున ఐదుగురు టెక్నీషియన్స్, ఐదుగురు పైలెట్లు ( డ్రైవర్లు) షిప్టుల ప్రకారం విధులు  చేపడతారు. ఆ ప్రకారం ఒక వాహనానికి ఒక రోజుకు (24 గంటల్లో) దాదాపు 15 కేసులు వస్తాయి. రాత్రి పూట వచ్చే కేసులు అధికంగా ఉంటాయి. దీంతో సిబ్బందిపై పనిభారం పడుతోంది. పైలెట్లు, టెక్నీషియన్స్‌ మొత్తం 136 మంది ఉండాలి. అయితే 122 మంది మాత్రమే పనిచేస్తున్నారు.
వీరంతా 12 గంటల పాటు వి«ధులు  చేపడుతున్నారు. సాధారణంగా 8 గంటలు మాత్రమే పనిచేయాలి. అలా అయితే సిబ్బంది సంఖ్యను అందుకు అనుగుణంగా పెంచాలి. యాజ మాన్యాల ఆ దిశగా ఆలోచించడంలేదు. ఉద్యోగ భద్రత లేకపోవడంతో పాటు వేతనాలు సక్రమంగా అందడంలేదు.   గడిచిన నవంబర్‌ నెలకు సంబంధించిన జీతాలు ఇంతవరకు రాలేదు. పొరుగున ఉన్న తెలం గాణా ప్రభుత్వం అక్కడి సిబ్బందికి ఉద్యోగ భద్రత కల్పించడంతో పాటు ఒకరికి రూ.4 వేలకు పైగా వేతనాలను పెంచింది.

2007లో వైఎస్‌ తెచ్చిన ‘108’...
నాటి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి పలు ప్రజా సంక్షేమ పథకాలను చేపట్టారు.  ఆరోగ్య రంగానికి పెద్ద పీట వేశారు. అందులో భాగంగా ఆపదలో ఉన్నవారి ప్రాణాలను కాపాడడానికి నడుం బిగించారు. 2007లో 108 వాహనాలను ప్రవేశపెట్టారు. వీటి రాకతో నాటి నుంచి నేటి వరకు లక్షలాది మంది ప్రాణాలు నిలిచాయి. రాష్ట్రంలో ఈ వ్యవస్ధ విజయవంతం కావడంతో 108 వాహనాలు ఇతర రాష్ట్రాలతో పాటు విదేశాల్లో కూడా నడుస్తున్నాయి. ఇప్పడు ఇవి కష్టాల నుడుమ ప్రయాణం సాగిస్తున్నాయి.

జిల్లా కలెక్టర్‌కు వినతి..
సోమవారం కలెక్టరేట్‌లో జరిగిన గ్రీవెన్స్‌సెల్‌లో కలెక్టర్‌ బాబూరావునాయుడుకు 108 ఈఎంటీ అసోíసియేషన్‌ నాయకులు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు వీరమల్ల సాంబశివయ్య, నాయకులు ఎరుకలయ్య, ఏ గురుస్వామి, రాజేంద్ర, పణితి మాట్లాడుతూ తమకు ఉద్యోగ భద్రత కల్పించాలన్నారు. వాహనాలను కండీషన్‌లో ఉంచాలని తెలి పారు. అత్యవసర మందులకు కొరత ఉందన్నారు. ఏళ్ల తరబడి పనిచేస్తున్న తమ సమçస్యలను పరిష్కరించాలని కోరారు. అనంతరం వారు ‘సాక్షి’తో మాట్లాడారు. సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర అసోషియేషన్‌ పిలుపు మేరకు ఈ రోజు అన్ని జిల్లాలో జల్లా కలెక్టర్‌లకు వినతి పత్రం సమర్పించామని తెలిపారు. ఒక వారం రోజులలోపు సమస్యలు పరిష్కారం కాకపోతే సమ్మెలోకి వెళ్లాల్సి ఉంటుందన్నారు.

మరిన్ని వార్తలు