మరో‘సారి’ మొండిచేయి

21 Feb, 2019 07:56 IST|Sakshi
భీమవరం ఏరియా ప్రభుత్వాసుపత్రిలో గర్భిణులకు సేవలందిస్తున్న సూపరింటెండెంట్‌

అప్‌గ్రేడ్‌ చేయరు.. వైద్యులను నియమించరు

అరకొర వైద్య సేవలు.. రోగుల ఇక్కట్లు

నిపుణులు లేక మూలనపడుతున్న యంత్రాలు

ప్రసూతి డాక్టర్ల కొరతతో గర్భిణులకు అవస్థలు

భీమవరం ప్రభుత్వాస్పత్రి దుస్థితి

పశ్చిమగోదావరి  , భీమవరం (ప్రకాశం చౌక్‌): భీమవరం ప్రభుత్వాసుపత్రి.. జిల్లాలోని డెల్టా ప్రాంతంతో పాటు సరిహద్దు కృష్ణా జిల్లా నుంచి వందలాది మంది రోగులు ఇక్కడకు వస్తుంటారు. అయితే ఆస్పత్రిలో వైద్యుల కొరత, సౌకర్యాల లేమితో అవస్థలు తప్పడం లేదు. 100 పడకలకు మించిన స్థాయి ఇవ్వాల్సిన ఆస్పత్రిని అప్‌గ్రేడ్‌ చేసే విషయంలో ప్రభుత్వం చిన్నచూపు చూస్తోంది. అయినా ఆస్పత్రిపై వివక్ష ఆగడం లేదు. ఇటీవల జిల్లాలోని ఆస్పత్రులకు ప్రభుత్వం 15 మంది వైద్యులను నియమించింది. ఈ విషయంలోనూ భీమవరం ఆస్పత్రిపై వివక్ష కొనసాగింది. ఒక్క డాక్టర్‌ను కూడా భీమవరం ఆస్పత్రికి కేటాయించకపోవడం ప్రభుత్వ చిత్తశుద్ధిని తెలియజేస్తోంది. ఆస్పత్రి స్థాయిని 50 నుంచి 100 పడకలకు పెంచాలనే డిమాండ్‌ ఏళ్ల తరబడి ఉన్నా పట్టించుకోవడం లేదు.

వైద్యులు లేరు
భీమవరం ప్రభుత్వాస్పత్రికి రోజూ పెద్ద సంఖ్యలో రోగులు వస్తుంటారు. గర్భిణులతో పాటు ఎముకులు, కంటి, చెవి, ముక్కు సమస్యలతో వస్తున్న రోగులకు సరైన వైద్యం అందడం లేదు. కనీసం ఎముకలు, నేత్ర, చెవి, ముక్కు వైద్యులు లేకపోవడమే ఇందుకు కారణం. దీంతో ఆయా సమస్యలతో వస్తున్న వారు ప్రైవేట్‌ ఆస్పత్రులను ఆశ్రయిం చాల్సి వస్తోంది. ప్రధానంగా కీళ్లు, కంటి సమస్యలతో వస్తున్న వృద్ధులు చాలా అవస్థలు పడుతున్నారు. దీంతో జనరల్‌ వైద్యులు వీరికి సేవలందించాల్సి వస్తోంది. 

రెండేళ్లుగా మూలనపడిన యంత్రాలు
ఆస్పత్రిలో కంటి వైద్యులు, టెక్నీషియన్లు లేకపోవడంతో రెండేళ్లుగా కంటి ఆపరేషన్‌ చేసే ఆపరేటింగ్‌ మైక్రోస్కోప్‌ మెషీన్‌ మూలన పడి ఉంది. కంటి ఆపరేషన్లు అవసరమైన రోగులను ఏలూరు రిఫర్‌ చేస్తున్నారు. యంత్రాలు ఉన్నా వైద్యులు లేకపోవడంతో సేవలు అందడం లేదు. 

ఒకరే గైనకాలజిస్ట్‌
భీమవరం ఆసుపత్రిలో నెలకు సుమారు 100 వరకు ప్రసూతి ఆపరేషన్లు జరుగుతున్నాయి. రోజుకు 70 మంది వరకు గర్భిణులు వైద్య సేవలు పొందుతున్నారు. అయితే ఆస్పత్రిలో ఒకరే గైనకాలజిస్ట్‌ ఉండటంతో పూర్తిస్థాయిలో సేవలు అందడం లేదు. మరో గైనకాలజిస్ట్‌ అవసరం ఉన్నా అధికారులు, ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. దీంతో అత్యవసర సమయాల్లో గర్భిణులు ప్రైవేట్‌ ఆస్పత్రులను ఆశ్రయించాల్సి వస్తోంది. 

100 పడకలు అయితే తప్ప..
భీమవరం ప్రభుత్వాసుపత్రి స్థాయి 50 పడకలు. దీనిని 100 పడకలు చేస్తే తప్ప వైద్యులను  పూర్తిస్థాయిలో కేటాయించరని వైద్యారోగ్యశాఖ అధికారులు చెబుతున్నారు. వైద్యులు లేక ఇబ్బందులు పడుతున్నా 100 పడకలు అయిన తర్వాత మాత్రమే వైద్యులు పూర్తిస్థాయిలో నియమిస్తారని అనడం విమర్శలకు తావిస్తోంది. 100 పడకలు చేయడానికి భీమవరం ఎమ్మెల్యే రామాంజనేయులు ప్రయత్నించినా ఫలితం లేదు. కనీసం వైద్యులు కొరత తీర్చేందుకైనా చర్యలు తీసుకోవాలని రోగులు కోరుతున్నారు.

100 పడకలకు ప్రయత్నిస్తున్నాం
భీమవరం ఆసుపత్రిని 50 నుంచి 100 పడకల స్థాయికి చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. 100 పడకలుగా అప్‌గ్రేడ్‌ చేస్తే పూర్తిస్థాయిలో వైద్యులు వస్తారు.– డాక్టర్‌ శంకరరావు, డీసీహెచ్‌ఎస్, ఏలూరు

మరిన్ని వార్తలు