సీహెచ్‌సీలకు వైద్యులు కావలెను..!

21 Mar, 2018 13:03 IST|Sakshi
ఘోష ఆస్పత్రికి చికిత్స కోసం వచ్చిన గర్భిణులు

వైద్యుల కొరతతో మాతా శిశువులకు అందని సేవలు

రోగులకు తప్పని కష్టాలు

పోస్టుల భర్తీలో ప్రభుత్వ అలక్ష్యం

విజయనగరం ఫోర్ట్‌: జిల్లాలోని సామాజిక ఆరోగ్య కేంద్రాల్లో వైద్యుల కొరత నెలకొంది. మాత, శిశువులకు పూర్తిస్థాయిలో వైద్య సేవలు అందడం లేదు. పేదలు సైతం ప్రైవేటు ఆస్పత్రులను ఆశ్రయించాల్సి వస్తోంది. జిల్లాలో 12 సీహెచ్‌సీలు, జిల్లా ఆస్పత్రి, పార్వతీపురం ఏరియా ఆస్పత్రి ఉన్నాయి. 12 సీహెచ్‌సీలకు ఐదు సీహెచ్‌సీల్లో వైద్యులు కొరత వెంటాడుతోంది.

ఇదీ పరిస్థితి...
జిల్లాలోని ఎస్‌.కోట, నెల్లిమర్ల, చీపురపల్లి, భోగాపురం, బాడంగి, సాలురు, భద్రగిరి, కురుపాం, చినమేరంగి, ఘోష ఆస్పత్రి, గజపతినగరం, బొబ్బిలిలో సీహెచ్‌సీలు ఉన్నాయి. వీటిల్లో మాత శిశువులకు వైద్యసేవలు అందించేకు ప్రభుత్వం ఎంసీహెచ్‌ (మదర్‌ చైల్డ్‌ హెల్త్‌) టీమ్‌లను నియమించింది. ఇందులో ఒక మత్తు వైద్యుడు, ఒక గైనకాలజిస్టు, ఒక పిల్లలు వైద్యుడు ఉండాలి. మాతా శిశువులకు పూర్తి స్థాయిలో ప్రసవాలు, సిజేరియన్లు, శిశువులకు చికిత్స అందించడం కోసం ఎంసీహెచ్‌ బృందాలను నియమించారు. వీటితో మాత, శిశు మరణాలు తగ్గించాలన్నది వైద్య ఆరోగ్యశాఖ లక్ష్యం. అయితే, ఎంసీహెచ్‌ బృందాల్లో  వైద్యులు పూర్తి  స్థాయిలో లేకపోవడంతో సకాలంలో వైద్యం అందడం లేదు. ఫలితం.. సీహెచ్‌సీలకు వచ్చేవారిని మెరుగైన వైద్యం కోసం జిల్లా కేంద్రాస్పత్రికి రిఫర్‌ చేస్తున్నారు.

ఐదు సీహెచ్‌సీల్లో వైద్యుల కొరత..
భద్రగిరి సీహెచ్‌సీలో మత్తువైద్యుడు, గైనకాలజిస్టు, పిల్లల వైద్యుడు ఉండాల్సి ఉండగా ఏ ఒక్కరు లేరు. చినమేరంగిలో పిల్లల వైద్యుడు, మత్తు వైద్యుడు లేరు. సాలురు, బోగాపురంలో మత్తు వైద్యులు లేరు. బాడంగిలో మత్తు వైద్యుడు లేరు. పిల్లల వైద్యుడు కూడా డిప్యుటేషన్‌పై  పనిచేస్తున్నారు. గిరిజన ప్రాంతాల్లో  వైద్యులు లేకపోవడంతో గర్భిణులను ఘోష ఆస్పత్రికి, కేజీహెచ్‌కు రిఫర్‌ చేస్తున్నారు.  

ఏళ్ల తరబడి భర్తీ చేయని ప్రభుత్వం..
సీహెచ్‌సీల్లో మత్తువైద్యుడు, గైనికాల జిస్టు, పిల్లల వైద్యుల పోస్టులు ఏళ్ల తరబడి ఖాళీగా ఉన్నా భర్తీ చేయడం లేదు. మాతా, శిశు సంక్షేమానికి కృషి చేస్తున్నామని ప్రభుత్వం  గొప్పలు చెబుతున్నా... మాటలకు, చేతలకు పొంతన ఉండడం లేదు.

 వైద్యుల కొరత ఉంది...  
సీహెచ్‌సీల్లో మత్తు, గైనిక్, పిల్లల వైద్యుల పోస్టుల కొరత ఉన్న మాట వాస్తవమే. ప్రభుత్వం స్పెషలిస్టు పోస్టులకు నోటిఫికేషన్‌ ఇచ్చి భర్తీ చేస్తుంది. ఈ పక్రియ పూర్తయితే పోస్టులు భర్తీ అయ్యే అవకాశం ఉంది.– జి.ఉషశ్రీ,జిల్లా ఆస్పత్రుల సేవల సమన్వయ అధికారి

మరిన్ని వార్తలు