ఈఎస్‌ఐ ఆస్పత్రిలో వసతులు మృగ్యం

27 Oct, 2018 13:53 IST|Sakshi
కొండపల్లిలో ఈఎస్‌ఐ వైద్యశాల

వేధిస్తోన్న సిబ్బంది కొరత

ఇబ్బందులు పడుతున్న కార్మికులు

పట్టించుకోని అధికారులు

కృష్ణాజిల్లా, ఇబ్రహీంపట్నం: అసంఘటిత రంగ కార్మికులకు ఆరోగ్య భరోసా కల్పించాల్సిన ఈఎస్‌ఐ వైద్యశాలలో కనీస సౌకర్యాలు కరువయ్యాయి. పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతున్న ఇబ్రహీంపట్నం మండలంలో అనేక ప్రభుత్వ, ప్రైవేట్‌ రంగ సంస్థల్లో కార్మికులు పనిచేస్తున్నారు. సుమారు 6వేల మంది కార్మికుల కుటుంబాలకు విస్తృతమైన ఆరోగ్యసేవలు అందిచాల్సిన వైద్యశాలలో పర్మినెంట్‌గా వైద్యుడు లేక రోగులు ఇబ్బందులు పడుతున్నారు. ఇన్‌చార్జి డాక్టర్లతో కాలం నెట్టుకొస్తున్నారు. మందులు, సదుపాయాలు సక్రమంగా లేక రోగులు ఇబ్బందులు పడుతున్నారు.

అరకొర వసతులు..
పరిసర గ్రామాల నుంచి ఈఎస్‌ఐ వైద్యశాలకు రోజుకు 200 మంది రోగులు ఆరోగ్య పరీక్షలు చేయించుకుంటారు. సోమవారం రోగుల సంఖ్య అధికంగా ఉంటుంది. రోగులకు వైద్యసేవలు అందించేందుకు అందుబాటులో వైద్యులు లేరు. మధుమేహ పరీక్షలు, జ్వరం, జలుబు, వంటి వ్యాధులకు వైద్యపరీక్షలు సిబ్బందే నిర్వహిస్తారు. ఎక్స్‌రే సదుపాయం ఇక్కడలేదు. రోగి నిల్చోలేని పరిస్థితిలో కూర్చునేందుకు కనీసం బెడ్లు లేవు. ఉన్న ఒక్క బెడ్డుపై ఇద్దరు ముగ్గురిని ఉండాల్సిందే. పరిశ్రమల్లో జరిగే ప్రమాద సంఘటనల్లో కార్మికులు గాయపడితే సకాలంలో వైద్యులు అందుబాటులో లేక ప్రాణాప్రాయ స్థితిలోకి చేరుకుంటున్నారు.

అధికసంఖ్యలో కార్మికులు..
ఎన్టీటీపీఎస్‌ కాంట్రాక్ట్‌ కార్మికులు సుమారు 2,500, కొండపల్లి ఐడీఏలో మరో 2వేల మంది, కార్వీలో 1,800మంది, ఆప్మెల్‌ సంస్థలో సుమారు 500 మంది చిన్న, మధ్య తరహా పరిశ్రమల్లో మరో 300మంది కార్మికులు ఉంటారు. వీరందరికి కార్మికశాఖ ఈఎస్‌ఐ కార్డులు మంజూరు చేసింది. కుటుంబానికి ఇద్దరు చొప్పున వేసినా 15వేల మంది వైద్య సహాయానికి ఆధారపడి ఉన్నారు. కార్మికులకు అనుగుణంగా సదుపాయాలు పెంచాలని కోరుతున్నారు.

ఇన్‌చార్జి వైద్యులే దిక్కు..
ఇక్కడ విధులు నిర్వహిస్తున్న డాక్టర్‌ ఉన్నత విద్యనభ్యసించేందుకు దీర్ఘకాలిక సెలవుపెట్టి నాలుగునెలల క్రితం వెళ్లారు. ఈ నేపథ్యంలో విజయవాడ, విశాఖపట్నం, గుంటూరు, భీమవరం, ప్రాంతాలకు చెందిన వైద్యులను  రోజుకొకరిని ఇన్‌చార్జులుగా నియమించారు. ఇతర ప్రాంతాల నుంచి వైద్యులు వచ్చేందుకు ఇబ్బందులు పడుతున్నారు. సకాలంలో అందుకోలేక సెలవులు పెడుతున్నారు. కార్మికులకు వైద్యపరీక్షలు నిర్వహించాల్సిన సమయానికి రాలేకపోతున్నారు. వైద్యసిబ్బంది రోగులకు పరీక్షలు నిర్వహించి సాధారణ మందులు ఇచ్చి పంపుతున్నారు. కొన్ని కేసులను గుణదలలోని ఈఎస్‌ఐ వైద్యశాలకు పంపుతున్నారు.

కార్మికుల డిమాండ్లు..
కార్మికవాడగా అభివృద్ధి చెందిన ఇబ్రహీంపట్నం, కొండపల్లిలో కనీసం 50పడకల ఆస్పత్రిని ఏర్పాటు చేయాలని కార్మికులు డిమాండ్‌ చేస్తున్నారు. అన్ని రకాల రక్త పరీక్షలతో పాటు ఎక్స్‌రే, ఈసీజీ, అత్యవసర విభాగం నెలకొల్పాలని కోరుతున్నారు. నిబంధనల ప్రకారం ప్రతి నాలుగు వేల మందికి ఒకరు చొప్పున మరో ఇద్దరు వైద్యులను నియమించాలని అంటున్నారు. షిప్టుల ప్రకారం 24గంటలు అత్యవసర వైద్య సేవలు అందించేలా చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.

డాక్టర్లు అందుబాటులో లేరు
మండలంలో సుమారు 6వేల మందికి పైగా అసంఘటిత రంగ కార్మికులు ఉన్నారు. వీరితో పాటు కుటుంబ సభ్యులు ఎటువంటి ఆరోగ్య సమస్యలు ఎదురైనా ఈఎస్‌ఐ ఆస్పత్రికి పరిగెత్తాల్సిందే. అయితే సమయానికి వైద్యులు అందుబాటులో ఉండటం లేదు. ఇన్‌చార్జి డాక్టర్లతో రోగులు ఇబ్బందులు పడుతున్నారు.          – కొండపల్లి అప్పారావు, కార్మిక సంఘం నాయకుడు

మరిన్ని వార్తలు