వెతుక్కుంటూ వచ్చిన ఎన్టీఆర్‌ పాత్ర

7 Feb, 2020 08:26 IST|Sakshi

సాక్షి, ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): రంగస్థలంపై ఆయనను ఎవరైనా చూస్తే అరే ఎన్టీఆర్‌ గానీ వచ్చాడా అనుకునేవారు. ఎన్టీఆర్‌ పోలికలతో పాటు నటనా చాతుర్యం కూడా ఆయన సొంతం. సరదాగా నాటకాల రిహార్సల్స్‌ చూడటానికి వెళ్లిన యువకుడు వాటిపై ఆసక్తితో తానూ నాటక రంగంలోకి అడుగుపెడతానని అనుకోలేదు. వెళ్లినా నటునిగా 45 ఏళ్ల సుదీర్ఘ ప్రస్థానం కొనసాగిస్తానని ఊహించలేదు. 1975లో తొలిసారి ముఖానికి రంగు వేసుకున్న ఆ యువకుడు ఇప్పటివరకూ రంగస్థలంపై తన సత్తా చాటుతూనే ఉన్నారు. పౌరాణికం, జానపదం, సాంఘికం అనే తేడా లేకుండా వందలాది పాత్రలు, వేలాది నాటకాలు ఆడుతూ రంగస్థలంపై అలుపెరుగని ప్రస్థానం కొనసాగిస్తున్నారు నగరానికి చెందిన పస్తుల విజయ్‌కుమార్‌. 

కుస్తీ, శరీర సౌష్టవాల్లోనూ సత్తా 
విజయ్‌కుమార్‌ 1951లో ఏలూరులో జన్మించారు. ఆయన విద్యాభ్యాసమంతా దాదాపు ఏలూరులోనే కొనసాగింది. యువకునిగా ఉండగా నగరంలోని కోరాడ నాగన్న తాలింఖానాలో శరీర సౌష్టవంపై మరాఠీ మల్లేశ్వరరావు వద్ద శిక్షణ తీసుకున్నారు. ఈక్రమంలో 1969లో సరదాగా కుస్తీ పోటీలు చూసేందుకు వెళ్లిన ఆయన ప్రత్యేక కారణాలతో పోటీల్లో పాల్గొనాల్సి వచ్చింది. కుస్తీలో ఎటువంటి మెలకువలు తెలియకపోయినా పోటీల్లో గెలిచి జిల్లా విజేత కిరీటాన్ని సొంతం చేసుకున్నారు. అదేస్ఫూర్తితో శరీర సౌష్టవ అంశంలో మరింత శిక్షణ పొంది 1971లో మిస్టర్‌ సీఆర్‌ఆర్‌ కళాశాల, 1971 నుంచి 1973 వరకూ వరుసగా నాలుగేళ్ల పాటు మిస్టర్‌ పశ్చిమగోదావరిగా ఆయన నిలిచారు. అనంతరం ఆయన వ్యాపారావకాశం రావడంతో ఏలూరు విడిచి కొయ్యలగూడెం వెళ్లి స్థిరపడ్డారు.
 
1975లో రంగస్థల ప్రవేశం 
1975లో తొలిసారి సాంఘిక నాటకంతో రంగస్థల అరంగేట్రం చేసిన విజయ్‌కుమార్‌ అక్కడి నుంచి వెనుతిరిగి చూడలేదు. 45 ఏళ్లుగా వందలాది ప్రదర్శనలు ఇచ్చారు. మొదట్లో ఏడాదికి 150 నాటక ప్రదర్శనలు ఇచ్చేవారు. ఇప్పటివరకూ ఆయన దాదాపు 4,500 నాటకాలు ఆడి రికార్డు సృష్టించారు. రాముడు, కృష్ణుడు, దుర్యోధనుడు, హరిశ్చంద్రుడు, నారదుడు, దుష్యంతుడు, నహుష చక్రవర్తి వంటి పౌరాణిక పాత్రలు, వేలాది చారిత్రక, సాంఘిక పాత్రలు చేస్తూ, పలు జానపద పాత్రలు చేస్తూ తనలోని నటుడిని సంతృప్తి పరుస్తూ వస్తున్నారు. 1977లో విజయభారతి నాట్య మండలి సంస్థను ప్రారంభించి దాని ద్వారా అనేక ప్రదర్శనలు ఇవ్వడమే కాక తోటి కళాకారులను ప్రోత్సహిస్తున్నారు. 

3 నందులు.. 8 గరుడలు.. 
రంగస్థల యాత్రలో ఆయన కీర్తి కిరీటంలోకి నాటకరంగానికి సంబంధించి అత్యున్నత పురస్కారంగా భావించే ప్రభుత్వ పురస్కారం నంది బహుమతులు మూడు వచ్చి చేరాయి. దీంతో పాటు తిరుపతికి చెందిన మరో ప్రతిష్టాత్మక సంస్థ గరుడ ఆధ్వర్యంలో నిర్వహించిన అనేక పోటీల్లో పాల్గొన్న విజయ్‌కుమార్‌ వాటిలో ఎనిమిది సార్లు ఉత్తమ నటునిగా నిలిచి ఎనిమిది గరుడ అవార్డులు అందుకున్నారు. దీంతో పాటు నాటక రంగానికి చేసిన విశేష కృషికి గాను రాష్ట్ర ప్రభుత్వం ఆయనను కందుకూరి పురస్కారంతో గౌరవించింది. ఇవికాకుండా రాష్ట్రవ్యాప్తంగా అనేక పరిషత్‌ల్లో ఆయన ఉత్తమ నటుడు అవార్డులు అందుకున్నారు.

వెతుక్కుంటూ వచ్చిన ఎన్టీఆర్‌ పాత్ర 
విజయ్‌కుమార్‌ నట చరిత్రలో మైలురాయిగా నిలిచే పాత్ర ‘లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌’ చలన చిత్రంలో నందమూరి తారక రామారావు పాత్ర. దర్శకుడు రాంగోపాల్‌వర్మ దర్శకత్వంలో లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌ చిత్రం నిర్మించడానికి సిద్ధమైన తరుణంలో ఎన్‌టీ రామారావు పాత్ర కోసం దాదాపు 300 మందికి మేకప్‌లు వేయించి చూసినా ఆయనకు సంతృప్తి కలగలేదు. ఈ క్రమంలో విజయ్‌కుమార్‌ గురించి తెలిసిన వర్మ ఆయన్ను తన వద్దకు రప్పించుకుని ఆడిషన్లు పూర్తి చేసి ఎన్టీఆర్‌ పాత్రకు ఎంపిక చేశారు. షూటింగ్‌ ప్రారంభమైన 20 రోజుల్లో ఎన్టీఆర్‌ పాత్ర చిత్రీకరణ పూర్తిచేయడంలో విజయ్‌కుమార్‌ నటనా పటిమను గుర్తించిన వర్మ ఆయనను ప్రత్యేకంగా అభినందించారు. ఆ పాత్రకన్నా ముందే విజయ్‌కుమార్‌ సుమారు పది సినిమాల్లో వివిధ పాత్రలు పోషించి వెండితెరపై కూడా తన ప్రస్థానాన్ని కొనసాగిస్తున్నారు. (చదవండి: ‘లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌’ మూవీ రివ్యూ)

కళాకారుని కారణంగానే ప్రజాదరణ దూరం  
ప్రస్తుతం నాటకరంగానికి ప్రజాదరణ దూరం కావడానికి కళాకారుడే కారణం. పాత్ర ఔచిత్యం, పాత్ర గాంభీర్యం, ఆహార్యం, రంగాలంకరణ వంటి అంశాల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో ప్రజలు ఆకర్షితులు కాలేకపోతున్నారు. ఇటీవల నాటక రంగంలోకి దళారులు కూడా ప్రవేశించడంతో అసలైన కళాకారుడు నష్టపోతున్నాడు. ఆయా అంశాలపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరిస్తే నాటకరంగానికి తిరిగి జవసత్వాలు వస్తాయి.
– పస్తుల విజయ్‌కుమార్‌, రంగస్థల నటుడు   

మరిన్ని వార్తలు