మెట్టలో కరువు

11 Jun, 2014 03:19 IST|Sakshi
మెట్టలో కరువు

మెట్ట ప్రాంతంలో కరువు విలయతాండవం చేస్తోంది. జలవనరులు పూర్తిగా నిండుకున్నాయి. జనంతో పాటు పశువులు కూడా గుక్కెడు నీటికి అల్లాడుతున్నాయి. వరి పంట నిలువునా ఎండిపోయింది. బత్తాయి, నిమ్మ తోటలు కూడా ఎండడంతో రైతులు ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకుపోయారు. ఇప్పటికే పలువురు బతుకుదెరువు కోసం వలసబాట పట్టారు. ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు సక్రమంగా కురవవని వాతావరణ శాఖ హెచ్చరిస్తున్న నేపథ్యంలో పరిస్థితులు మరింత దయనీయంగా  మారేలా కనిపిస్తున్నాయి.   ఉదయగిరి: జిల్లాలోని మెట్ట ప్రాంతంలో కరువు ఛాయలు అలుముకున్నాయి. తీవ్ర వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో దుర్భిక్షం నెలకొంది. జిల్లాలో సాధారణ సాగు విస్తీర్ణం 12 లక్షల ఎకరాలు. ఈ ఏడాది కరువు నేపథ్యంలో మూడు లక్షల ఎకరాల్లో  కూడా పంటల సాగు చేపట్టలేదు. సోమశిల పరిధిలోని కాలువ కింద రబీలో సాగుచేసిన సుమారు 70 వేల ఎకరాల వరి పూర్తిగా ఎండిపోవడంతో రూ.100 కోట్లకు పైగా రైతులు నష్టపోయారు. మూడేళ్ల నుంచి మినుము సాగులో లాభాలు లేకపోవడంతో ఆ భూముల్లో జామాయిల్ సాగు చేశారు. ఉదయగిరి, ఆత్మకూరు, రాపూరు, గూడూరు, వెంకటగిరి ప్రాంతాల్లోని 25 వేల హెక్టార్లలో నిమ్మ, 8 వేల హెక్టార్లలో బత్తాయి, మరో 35 వేల హెక్టార్లలో మామిడి తోటలు సాగులోఉన్నాయి. వరికుంటపాడు, కలిగిరి, దుత్తలూరు,వింజమూరు, ఉదయగిరి మండలాల్లో ఐదు వేల ఎకరాల్లో బత్తాయి తోటలు సాగు చేస్తున్నారు. మూడేళ్ల నుంచి వర్షాభావంతో భూగర్బజలాలు పూర్తిగా అడుగంటాయి. బోర్లలో నీరు అగిపోవడంతో పంటలను రక్షించుకునేందుకు లక్షలు ఖర్చుచేసి ట్యాంకర్ల ద్వారా చెట్లను బతికించుకునే ప్రయత్నం చేశారు. అయినా చాలా తోటలు నిలువునా ఎండిపోయాయి. జూన్ మొదటి వారంలోనైనా వర్షాలు పడకపోతాయని ఆశించిన ఉద్యాన పంటల రైతులకు నిరాశే ఎదురైంది. ఈ ఏడాది రాష్ట్రంలోనే మిగతా జిల్లాలకు భిన్నంగా ఉదయగిరి,ఆత్మకూరు నియోజకవర్గాలలో వర్షం పడలేదు. రెండ్రోజుల నుంచి వాతావరణం చల్లబడివున్నా మేఘాలు కనిపిస్తున్నాయే తప్ప నీటి బొట్టు నేలను తాకలేదు.

ఎండిన జలాశయాలు, చెరువులు:

 గత ఏడాది జిల్లాలో వర్షాలు సరిగా కురవకపోవడంతో స్థానిక జలాశయాలకు నీరు చేరుకోలేదు. జిల్లా వ్యాప్తంగా 1,716 చెరువులుండగా 70 శాతం చెరువుల్లో నీరు చేరలేదు. మెట్ట ప్రాంత చెరువులు నీరు లేక వెలవెలబోయాయి. ఉదయగిరి ప్రాంతంలోని నక్కలగండి, గండిపాళెం, రాళ్లపాడు, మోపాడు జలాశయాలకు చుక్క నీరు రాకపోవడంతో వీటి పరిధిలోని ఆయకట్టు బీడుబారింది.
 జలదంకి, వింజమూరు, ఉదయగిరి, వరికుంటపాడు మండలాల పరిధిలో బోర్లు, వాగుల కింద సాగుచేసిన వరి పైరును చిరుపొట్టదశలో నీరు లేక కోసి పశువులకు మేతగా వేశారు. పదేళ్ల నుంచి ఇలాంటి పరిస్థితి మెట్టప్రాంతంలో కనిపించలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. గండిపాలెం ఆయకట్టు పరిధిలో 16 వేల ఎకరాలు, నక్కలగండి పరిధిలో ఐదు వేల ఎకరాలు, మోపాడు పరిధిలో పది వేల ఎకరాలుండగా కనీసం 50ఎకరాల్లో కూడా పంట పండకపోవడం కరువు తీవ్రతకు నిదర్శనం. మరోవైపు అనేక గ్రామాల్లో తాగునీటి సమస్య తీవ్రమైంది.

ఒట్టిబోయిన పాడి:

వర్షాకాలంలోనే సక్రమంగా వర్షాలు పడక పశుగ్రాసం కొరత ఏర్పడింది. జనవరి, ఫిబ్రవరి నుంచి ఈ పరిస్థితి మరింత విషమించింది. పచ్చిక బయళ్లుపూర్తిగా ఎండిపోవడం, పంటలు పండక గడ్డి దొరక్కపోవడంతో పాల దిగుబడి గణనీయంగా తగ్గింది. మేత దొరక్క పశువులను తక్కువ ధరకు కబేళాలకు తరలించారు. ఇక మేకలు, గొర్రెల యజమానుల బాధలు వర్ణణాతీతం.

 వలస బాట:

 ఆత్మకూరు, ఉదయగిరి ప్రాంతాలకు చెందిన వారు మొదటి నుంచి పనులు దొరక్క ఉపాధి కోసం వలస వెళ్లేవారు. సోమశిల జలాశయం నిర్మాణం తర్వాత ఆ ప్రాంతంలో కొంత వలసలు తగ్గాయి. ఉదయగిరి ప్రాంతంలో కూడానాలుగైదేళ్ల నుంచి ఈ పరిస్థితి తగ్గుముఖం పట్టింది.అయితే మూడేళ్ల నుంచి వర్షాలు పడక పంటలు లేక పరిస్థితి మరింత విషమించడంతో పొట్ట కూటి కోసం ఈ ఏడాది మళ్లీ అనేక కుటుంబాలు వలసబాట పట్టాయి. తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడుకు వలస వెళుతున్నారు. వెంటనే ప్రభుత్వం స్పందించి తగిన చర్యలు లేకపోతే పల్లె బతుకులు మరింత చితికిపోయే ప్రమాదం పొంచివుంది.
 

మరిన్ని వార్తలు