తొక్కిసలాటపై కమిషన్ గడువు మళ్లీ పెంపు

7 Aug, 2016 04:28 IST|Sakshi
తొక్కిసలాటపై కమిషన్ గడువు మళ్లీ పెంపు

విచారణను నాన్చుతున్న ప్రభుత్వం
సాక్షి, రాజమహేంద్రవరం: గతేడాది జూలై 14వ తేదీన గోదావరి పుష్కరాల మొదటి రోజు తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని పుష్కరఘాట్‌లో జరిగిన తొక్కిసలాట ఘటన నుంచి తప్పించుకునేందుకు ప్రభుత్వం మరో ఎత్తుగడకు దిగుతోంది. ఘటనపై విచారణ కోసం నియమించిన జస్టిస్ సీవై సోమయాజులు నేతృత్వంలోని ఏకసభ్య కమిషన్ గడువును గురువారం రెండోసారి పొడిగించింది. నాటి ఘటనలో 29 మంది మరణించిన సంగతి తెలిసిందే. ఘటనకు సీఎం చంద్రబాబే కారణమని ఆరోపణలు వెల్లువెత్తడంతో  ఏక సభ్యకమిషన్‌ను నియమించింది.

2016 మార్చి 29న నివేదిక ఇవ్వాలని గడువు విధిస్తూ.. కమిషన్‌కు ప్రభుత్వ శాఖలు ఆధారాలు సమర్పించకుండా జాప్యం చేయించింది. దీంతో కలెక్టర్ విజ్ఞప్తి మేరకు జూన్ 29 వరకు 3 నెలలు గడువు పెంచుతూ నెల తర్వాత ఉత్తర్వులు జారీ చేసింది. కమిషన్ పలుమార్లు  విచారణ చేపట్టింది. అఫిడవిట్ దాఖలు చేసిన వారు సాక్ష్యాలు కమిషన్‌కు సమర్పించారు. ప్రభుత్వ శాఖలు  సమర్పించ లేదు. విచారణలో ఏఏ శాఖలు ఆధారాలు సమర్పిస్తాయో తెలపాలని కమిషన్ ఆదేశించడంతో కలెక్టర్ తొమ్మిది శాఖల పేర్లు ఇచ్చారు. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 29 వరకు గడువు పొడిగించారు.

మరిన్ని వార్తలు