జోరుగా క్రయ విక్రయాలు

12 Nov, 2014 03:38 IST|Sakshi
జోరుగా క్రయ విక్రయాలు

* ఆంధ్రప్రదేశ్‌లో భారీగా పెరిగిన స్థిరాస్తి రిజిస్ట్రేషన్లు
* విభజన తర్వాత 93 శాతం వృద్ధి నమోదు
* ఆరు నెలల్లో ప్రభుత్వానికి రూ.1,316 కోట్ల ఆదాయం
* ‘రాజధాని’ జిల్లాల్లో రికార్డు స్థాయిలో డాక్యుమెంట్ల నమోదు

సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో రియల్ ఎస్టేట్ రంగం ఊపందుకుంది. ఈ ఏడాది జూన్ - అక్టోబర్ నెలల మధ్య స్థిరాస్తి క్రయ విక్రయాలు భారీగా పెరిగాయి. గత ఏడాది ఈ మధ్యకాలంలో జరిగిన రిజిస్ట్రేషన్ల కంటే దాదాపు రెట్టింపు (93.35 శాతం అధికం) రిజిస్ట్రేషన్లు జరగడం గమనార్హం. గత ఏడాదితో పోల్చితే ఇదే కాలంలో స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ఆదాయం కూడా భారీగా పెరిగింది. ఇక రాష్ట్ర రాజధాని ఏర్పాటవుతుందని గత కొన్ని నెలలుగా ప్రచారం సాగిన కృష్ణా, గుంటూరు జిల్లాల్లో రిజిస్ట్రేషన్ల సంఖ్య రెట్టింపుకంటే అధికంగా ఉండటం విశేషం.

మొత్తం 13 జిల్లాలకు గాను ఆరు జిల్లాల్లో గత ఏడాదితో పోల్చితే ఈ ఏడాది దాదాపు రెట్టింపు సంఖ్యలో రిజిస్ట్రేషన్లు జరిగాయి. విజయనగరం, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, అనంతపురం, కర్నూలు జిల్లాల్లో గత ఏడాదికంటే రెట్టింపు సంఖ్యలో డాక్యుమెంట్లు రిజిస్టర్ అయ్యాయి. రిజిస్ట్రేషన్ల వృద్ధిలో ప్రకాశం, కృష్ణా, గుంటూరు జిల్లాలు వరుసగా ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో ఉన్నాయి. గత ఏడాది జూన్ - అక్టోబర్ నెలల మధ్య మొత్తం 3,08,445 డాక్యుమెంట్లు రిజిష్టర్ కాగా ఈ ఏడాది ఇదే కాలంలో 5,96,385 రిజిస్ట్రేషన్లు (93.35 శాతం అధికంగా) జరగడం గమనార్హం.

ఇబ్బడిముబ్బడిగా పెరిగిన రాబడి
రాష్ట్రం ఉమ్మడిగా ఉన్నప్పటితో పోల్చితే విభజన తర్వాత రిజిస్ట్రేషన్ల ద్వారా ఆదాయం ఇబ్బడిముబ్బడిగా పెరిగింది. రాష్ట్రం ఉమ్మడిగా ఉన్నప్పుడు 2013 -14 ఆర్థిక సంవత్సరం మొదటి ఆరు నెలల్లో (ఏప్రిల్ - సెప్టెంబర్) ఆంధ్రప్రదేశ్‌లోని 13 జిల్లాల్లో వచ్చిన దానికంటే ఈ ఏడాది ఇదే కాలంలో దాదాపు రెట్టింపు ఆదాయం వచ్చింది. గత ఆర్థిక సంవత్సరం మొదటి ఆరు నెలల్లో రూ.624.83 కోట్లు రాగా ఈ ఏడాది ఇదే కాలంలో రూ. 1,316 కోట్లు వచ్చింది. అయితే ఈ ఏడాది అక్టోబర్‌లో మాత్రం రాబడి తగ్గిపోయింది.

రిజిస్ట్రేషన్ల శాఖ ద్వారా ఈ ఏడాది అక్టోబర్ నెలాఖరు వరకు రూ.1,469.95 కోట్ల రాబడి వచ్చింది. రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారం చేపట్టినప్పటి నుంచి నూతన రాజధాని ఏర్పాటుపై, వివిధ జిల్లాల్లో విద్యాసంస్థలు, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల ఏర్పాటుపై అనేకరకాల ప్రకటనలు చేస్తూ వచ్చింది. ఈ కారణంగానే అన్ని జిల్లాల్లో స్థిరాస్తి రంగం పుంజుకుంది. అయితే అదే అక్టోబర్‌కు వచ్చేసరికి రాజధాని ప్రాంతం మినహా మిగిలిన జిల్లాల్లో పెద్దగా ఏ సంస్థగానీ, పరిశ్రమలు గానీ వచ్చే అవకాశం కనిపించడంలేదనే భావానికి ప్రజలు వచ్చారు.

మరిన్ని వార్తలు