ఎడ్ల పోటీలు ప్రారంభం

30 Mar, 2016 03:00 IST|Sakshi
ఎడ్ల పోటీలు ప్రారంభం

తెనాలిరూరల్ : తెనాలి, వేమూరు నియోజకవర్గాల తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో తెనాలి మార్కెట్ యార్డులో ఆలపాటి శివరామకృష్ణయ్య స్మారక రాష్ట్రస్థాయి ఎడ్ల బల ప్రదర్శన పోటీలు మంగళవారం సాయంత్రం ప్రారంభమయ్యాయి. ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్రప్రసాద్ సారథ్యంలో ఆహ్వాన కమిటీ కన్వీనర్, వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనంద్‌బాబు పర్యవేక్షణలో ఈ పోటీలు నిర్వహిస్తున్నారు. హిందూపురం ఎమ్మెల్యే, సినీ నటుడు నందమూరి బాలకృష్ణ ముఖ్య అతిథిగా పోటీలను ప్రారంభించారు. పోటీల ప్రారంభానికి సూచికగా బాలకృష్ణ కాగడాతో జ్యోతిని వెలిగించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మమ్మీ, డాడీ తెలుగు పదాలని భవిష్యత్తు తరాలు పొరబడే ప్రమాదం ఉందని, దేశ భాషల్లో లెస్స అయిన తెలుగు భాషను కాపాడు కోవాల్సిన అవసరం ఉందన్నారు.

బమ్మెర పోతన పద్యాలు, పలు సంస్కృత శ్లోకాలు, తన సినిమాలోని కులాలకు సంబంధించిన డైలాగులు చెప్పారు. పోటీల ప్రాంగణంలో గొర్రె పొట్టేళ్ల బండిపై తిరిగి, గుర్రపు స్వారీ చేసి అభిమానులను హుషారెత్తించారు. అంతకుముందు తెనాలి మారీసుపేటలోని తన బంధువు డాక్టర్ గవిని వెంకటేశ్వరరావు కుటుంబసభ్యులను వారి స్వగృహానికి వెళ్లి పలుకరించారు. రావి అమ్మయ్య చౌక్‌లో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్ నన్నపనేని రాజకుమారి, మాజీ మంత్రి గల్లా అరుణకుమారి తదితరులు మాట్లాడారు. తొలుత రెండు పాలపళ్లలోపు విభాగం పోటీలను ప్రారంభించారు. 

కార్యక్రమంలో జీడీసీసీ బ్యాంకు చైర్మన్ ముమ్మనేని వెంకటసుబ్బయ్య, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేశన శంకరరావు, మున్సిపల్ చైర్మన్ కొత్తమాసు తులసీదాసు, ఎంపీపీ సూర్యదేవర వెంకట్రావు, జెడ్పీటీసీ అన్నాబత్తుని జయలక్ష్మి, ఆర్డీవో జి.నరసింహులు, పట్టణ టీడీపీ అధ్యక్షుడు మహమ్మద్ ఖుద్దూస్, మండల పార్టీ అధ్యక్షుడు కావూరు చంద్రమోహన్, కొత్త హరికుమార్, కొత్త శేషుకుమార్, వీరమాచనేని వెంకటేశ్వరరావు, సుంకర హరికృష్ణ, దాసరి జగన్ తదితరులు పాల్గొన్నారు. రెండు పళ్లలోపు విభాగంలో చేపట్టిన పోటీలు రాత్రిపొద్దుపోయే వరకు కొనసాగాయి.
 
 జీడీసీసీబీ చైర్మన్ ముమ్మనేనికి గాయాలు
తెనాలిరూరల్ : ఎడ్ల పోటీల్లో గుంటూరు జిల్లా కేంద్ర సహకార బ్యాంకు చైర్మన్, మాజీ ఎమ్మెల్యే ముమ్మనేని వెంకట సుబ్బయ్య గాయాలపాలయ్యారు. తెనాలి మార్కెట్ యార్డు ఆవరణలో మంగళవారం ప్రారంభమైన రాష్ట్ర స్థాయి ఒంగోలు జాతి ఎడ్ల బలప్రదర్శన పోటీల్లో రెండు పళ్లలోపు విభాగం పోటీల్లో పాల్గొన్న తొలి జత యజమానికి జ్ఞాపికను బహూకరించేందుకు నిర్వాహకులు ఆయన్ను కోర్టులోకి ఆహ్వానించారు.  జ్ఞాపికను బహూకరించిన వెంటనే గిత్తలు కాడి నుంచి తప్పించుకుని కోర్టులో ఉన్న జనం మీదకు దూకాయి. దీంతో తోపులాట జరిగి వెంకట సుబ్బయ్య కిందపడిపోవడంతో గిత్త కాలు ఆయన ముఖానికి తగిలింది. గాయాలపాలైన సుబ్బయ్యను వెంటనే తెనాలి ప్రకాశం రోడ్డులోని ప్రైవేటు వైద్యశాలకు తరలించి చికిత్స అందిస్తున్నారు.
 

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా