ఆర్టీసీ విలీన ప్రక్రియ ప్రారంభించండి

27 Jun, 2019 04:58 IST|Sakshi
సీఎం వైఎస్‌ జగన్‌ను కలిసిన ఆర్టీసీ విలీన కమిటీ

మూడు నెలల్లో పూర్తి చేయాలని కమిటీకి సీఎం వైఎస్‌ జగన్‌ ఆదేశం

విద్యుత్తు బస్సులపై దృష్టి సారించాలని సూచన

ఆర్థిక, రవాణాశాఖ మంత్రులతో ఆర్టీసీ విలీన కమిటీ చర్చలు

నేడు ఆర్టీసీ కార్మికులతో కమిటీ చైర్మన్‌ ఆంజనేయరెడ్డి సమావేశం

సాక్షి, అమరావతి: ఏపీఎస్‌ ఆర్టీసీని దేశంలోనే మెరుగైన ప్రజా రవాణా వ్యవస్ధగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని, అందుకు అనుగుణంగా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే ప్రక్రియను ఆరంభించాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి విలీన కమిటీకి దిశానిర్దేశం చేశారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసేందుకు నియమించిన కమిటీ బుధవారం క్యాంపు కార్యాలయంలో సీఎం వైఎస్‌ జగన్‌ను కలిసింది. ఆర్థిక, రవాణా శాఖల మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, పేర్ని వెంకట్రామయ్య (నాని)తో పాటు కమిటీ చైర్మన్‌ ఆంజనేయరెడ్డి, ఆర్టీసీ ఉన్నతాధికారులు వీరిలో ఉన్నారు. ఆర్టీసీ ఎండీగా పనిచేసిన రిటైర్డ్‌ ఐపీఎస్‌ అధికారి ఆంజనేయరెడ్డి నేతృత్వంలో ఈనెల 14వతేదీన విలీన కమిటీని నియమించిన సంగతి తెలిసిందే.

ఆర్టీసీకి సంబంధించి పరిపాలనా అంశాలైన పే అండ్‌ అలవెన్సులు, పింఛన్, ప్రావిడెంట్‌ ఫండ్, కార్మికులకు అందుతున్న సంక్షేమ కార్యక్రమాలు, వైద్య సదుపాయాలన్నింటిపై కమిటీ సమగ్రంగా అధ్యయనం చేయాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి సూచించారు. బస్సుల నిర్వహణ, సంస్ధ ఆర్థిక పరిస్థితిపై విశ్లేషించాలన్నారు. విద్యుత్తు బస్సులు నడిపేందుకు అధ్యయన నివేదిక సమర్పించాలని కమిటీని ఆదేశించారు. ఆర్టీసీ కార్మికుల హక్కులు, ప్రయోజనాలకు ఎలాంటి భంగం వాటిల్లకుండా విలీన ప్రక్రియను మూడు నెలల్లో పూర్తి చేయాలని సూచించారు. ఆర్టీసీని లాభాలబాటలో నడిపించి ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించేలా చూడాలని ఆర్టీసీ అధికారులను కోరారు.

సచివాలయంలో కమిటీ సుదీర్ఘ భేటీ
వెలగపూడిలోని సచివాలయంలో రెండో బ్లాకులో ఆర్టీసీ విలీన కమిటీ ఆర్థిక, రవాణా శాఖ మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, పేర్ని నానిలతో సుదీర్ఘంగా భేటీ అయింది. కమిటీ తొలిసారిగా భేటీ అయిన నేపథ్యంలో సంస్ధ ఆర్థిక పరిస్థితి, అప్పులు, రుణాలు, బస్సులపై ఆర్టీసీ ఎండీ సురేంద్రబాబు నివేదిక అందించారు. సంస్థ రుణాలు, అప్పులు, ఆదాయంపై మంత్రులు, కమిటీ సుదీర్ఘంగా చర్చించారు. కమిటీ ఛైర్మన్‌ ఆంజనేయరెడ్డి గురువారం కార్మిక సంఘాలతో భేటీ కానున్నారు. అన్ని అంశాలపై క్షుణ్నంగా అధ్యయనం చేస్తామని విలీనం కమిటీ చైర్మన్‌ ఆంజనేయరెడ్డి తెలిపారు.

>
మరిన్ని వార్తలు