వివాదాస్పదమవుతున్న అంగాకర యాత్ర!

5 Nov, 2013 14:02 IST|Sakshi
వివాదాస్పదమవుతున్న అంగాకర యాత్ర!

హైదరాబాద్ : భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ప్రతిష్టాత్మకంగా జరపనున్న అంగారక యాత్ర వివాదాస్పదం అవుతోంది. కోట్లు ఖర్చు పెట్టి చేస్తున్న పనికి నిర్ణయించిన  ముహూర్తంపై జ్యోతిష్యులు పెదవి విరుస్తున్నారు. జ్యోతిషశాస్త్రంలో అమంగళానికి చిహ్నమైన మంగళవారం ప్రయోగం జరపడం అంత సమంజసం కాదని ప్రముఖ జ్యోతిష, వాస్తు సిద్ధాంతి పుల్లెల సత్యనారాయణ వాదిస్తున్నారు. అనుకూలమైన శుభ ముహుర్తంలో ప్రయోగం జరిపితే మరిన్ని ఫలితాలు వస్తాయని ఆయన చెబుతున్నారు.

మరోవైపు  అంగారక యాత్రకు సర్వం సిద్ధమైంది. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో అత్యంత ప్రతిష్టాత్మంగా చేపడుతున్న మార్స్‌ మిషన్‌ కౌంట్‌డౌన్‌ నిర్విఘ్నంగా కొనసాగుతోంది. 44.5 మీటర్ల ఎత్తున్న  పీఎస్ఎల్వీ 25 ఉపగ్రహ వాహకనౌక, 1337 కిలోల బరువున్న మార్స్‌ ఆర్బిటర్‌ మిషన్‌ను మోసుకుంటూ ఈ మధ్యాహ్నం 2 గంటల 38 నిమిషాలకు నింగిలోకి దూసుకెళ్లనుంది.

ఈ ప్రయోగంతో గ్రహాంతర ప్రయోగాలకు భారత్‌ శ్రీకారం చుట్టనుంది. ఇస్రో ఛైర్మన్‌ రాధాకృష్ణన్‌ మాటల్లో చెప్పాలంటే మన సాంకేతిక పరిజ్ఞాన సమార్ధ్యాన్ని ప్రపంచడానికి చాటడమే ప్రధాన లక్ష్యం. అమెరికా, రష్యా, చైనా, యూరప్‌ తదితరాలు ఇప్పటికే అంగారకుడిపై పరిశోధనలు చేపట్టిన నేపధ్యంలో మనకూ ఆ సామర్ధ్యముందని నిరూపించేందుకు ఈ అంగారకయాత్ర. చేపడుతున్నారు.

సుమారు 445కోట్ల వ్యయంతో ఈ  అంగారకయాత్ర కోసం చేపట్టారు. ఈ యాత్రను అక్టోబర్‌ 28నే నిర్వహించాలని ముందుగా నిర్ణయించినా రాడార్‌ ట్రాకింగ్‌ వ్యవస్థ ఇబ్బందికరంగా మారడంతో నవంబర్‌ 5కు వాయిదావేశారు.  అంగారకుడిపైకి వెళ్లాలంటే 30 కోట్ల నుంచి 35 కోట్ల కిలోమీటర్ల ప్రయాణం చేయాల్సి ఉంది.

దాంతో రాకెట్‌ గమనాన్ని నిర్ధేశించే రాడార్‌ ట్రాకింగ్‌ వ్యవస్థ కోసం బెంగళూరు ఇస్‌ట్రాక్‌ సెంటర్‌లో 32 డీప్‌ స్పేష్‌ నెట్‌వర్క్‌, అండమాన్‌ దీవుల్లోని మరో నెట్‌వర్క్‌,  స్పెయిన్‌, ఆస్ట్రేలియా, అమెరికాల్లోని మూడు డీప్‌ స్పేస్‌ నెట్‌వర్క్‌లతో పాటు మరో నాలుగు నెట్‌వర్క్‌ల సాయం తీసుకున్నారు. నాలుగో దశలో రాకెట్‌ గమనాన్ని తెలిపేందుకు దక్షిణ ఫసిపిక్‌ మహాసముద్రంలో రెండు నౌకలపై తాత్కాలి రాడార్‌ ట్రాకింగ్‌ వ్యవస్థలను ఏర్పాటు చేశారు.

మరిన్ని వార్తలు