కదనపథం

23 Sep, 2013 03:01 IST|Sakshi

సాక్షి, కడప : సమైక్యాంధ్ర రాష్ర్టమే ఆశయంగా జిల్లా వాసులు పోరాట పటిమ ప్రదర్శిస్తున్నారు. వాడవాడలా శిబిరాలు, రహదారులపై ర్యాలీలు, అడుగడుగునా నినాదాలు, ప్రధాన కూడళ్లలో మానవహారాలు, వినూత్న రీతిలో నిరసనలతో హోరెత్తిస్తున్నారు. విభజన ప్రకటనను వెనక్కి తీసుకునే వరకు పోరాటం ఆగదని స్పష్టం చేస్తున్నారు.
 
 కడప నగరంలో ప్రైవేటు వృత్తి విద్య కళాశాలల సమాఖ్య ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. మహిళా ఉద్యోగులు రోడ్డుపైనే కబడ్డీ ఆడి నిరసన తెలిపారు. సమైక్య రాష్ట్ర పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో రిలే దీక్షలు జరిగాయి.   నీటిపారుదల, పంచాయతీరాజ్, మున్సిపల్ ఉద్యోగులు, న్యాయవాదులు, న్యాయశాఖ ఉద్యోగులు, వాణిజ్యపన్నులశాఖ ఉద్యోగుల రిలే దీక్షలు కొనసాగాయి.
 
  జమ్మలమడుగులో ప్రైవేటు పాఠశాలల విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించి గాంధీ మహాత్ముని విగ్రహం చుట్టూ చేరి నిరసన తెలిపారు. వీరికి ఎమ్మెల్సీ దేవగుడి నారాయణరెడ్డి సంఘీభావం తెలిపారు. హౌసింగ్ అధికారుల రిలే దీక్షలు కొనసాగాయి. ఎర్రగుంట్ల, ఆర్టీపీపీలలో నిర్వహించిన రిలే దీక్షల్లో పలువురు పాల్గొన్నారు.
 
  రాజంపేటలో ఉద్యోగ జేఏసీ కన్వీనర్ జేవీ రమణ నేతృత్వంలో గ్రామీణ ప్రాంతాల్లో సమైక్య ఉద్యమం ఉధృతం చేయాలని సమావేశాలను నిర్వహించారు. వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే ఆకేపాటి అమర్‌నాథరెడ్డి సోదరుడు అనిల్‌కుమార్‌రెడ్డి నేతృత్వంలో బగ్గిడిపల్లెకు చెందిన 80 మంది రిలే దీక్షల్లో పాల్గొన్నారు.
 
  ప్రొద్దుటూరులో వైఎస్సార్ సీపీ నియోజకవర్గ సమన్వయకర్త రాచమల్లు ప్రసాద్‌రెడ్డి నేతృత్వంలో రెండు వేల మందికి పైగా మహిళలు విజయకుమార్ థియేటర్ నుంచి పుట్టపర్తి సర్కిల్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. విభజన జరిగితే నీటి కరువేనని నినదించారు. బలిజ సంఘం ఆధ్వర్యంలో పట్టణంలో ర్యాలీ నిర్వహించి వంటా వార్పు చేపట్టారు. బ్రాహ్మణ  సంఘం, ఉపాధ్యాయ జేఏసీ, విద్యార్థి జేఏసీ, న్యాయవాదులు, వైద్యుల ఆధ్వర్యంలో రిలే దీక్షలు కొనసాగాయి.
 
  బద్వేలు, గోపవరం మండలాలకు చెందిన వేలాది మంది ఐకేపీ మహిళలు బద్వేలు పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించి రిలే దీక్షల్లో పాల్గొన్నారు. 54 ఆకారంలో రోడ్డుపైనే కూర్చొని నిరసన తెలిపారు. రోడ్డుపైనే రింగ్‌బాల్ ఆడారు. పోరుమామిళ్లలో వైఎస్సార్ సీపీ నేతలు చిత్తా విజయప్రతాప్‌రెడ్డి, ఒ.ప్రభాకర్‌రెడ్డి, కరెంటు రమణారెడ్డి నేతృత్వంలో జగన్ మాస్క్‌లు ధరించి నిరసన తెలియజేశారు. అక్కల్‌రెడ్డిపల్లె కృపానగర్‌కు చెందిన  12 మంది  యువకులు  రిలే దీక్షల్లో పాల్గొన్నారు.  ఉపాధ్యాయ జేఏసీ ఆధ్వర్యంలో యోగాసనాలు చేశారు.
 
  రాయచోటిలో న్యాయవాదులు, జేఏసీ సభ్యుల రిలే దీక్షలు కొనసాగాయి. ఈనెల 26వ తేదీన జరగనున్న సమైక్య సభ ఏర్పాట్ల గురించి ఆర్డీఓ వీరబ్రహ్మం జేఏసీ నాయకులతో సమావేశమై కార్యచరణను రూపొందించారు.
 
  పులివెందులలో జేఏసీ ఆధ్వర్యంలో శివకళానికేతన్ కళాకారులు పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. దీక్షా శిబిరం వద్ద సత్యహరిశ్చంద నాటకాన్ని ప్రదర్శించారు. ఉపాధ్యాయులు రిలే దీక్షల్లో పాల్గొన్నారు.
 
  రైల్వేకోడూరులో ఎన్జీఓలు కళ్లకు రిబ్బన్లు కట్టుకుని రోడ్డుపైన నిరసన తెలిపారు. ఉపాధ్యాయ జేఏసీ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు రోడ్డుపై బైఠాయించి సమైక్యాంధ్ర కోసం  కలిసికట్టుగా పోరాడుతామని ప్రమాణాలు చేశారు. నల్లగొడుగులు చేతబట్టి పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. రోడ్డుపైనే యోగసనాలు వేశారు.
 
  కమలాపురం నియోజకవర్గంలోని  చదిపిరాళ్ల గ్రామం వద్ద జేఏసీ ఆధ్వర్యంలో రాస్తారోకో చేపట్టారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు కబడ్డీ ఆడి నిరసన తెలిపారు. మానవహారంగా ఏర్పడి నిరసన తెలియజేశారు.
 
  మైదుకూరులో జేఏసీ ఆధ్వర్యంలో ఉద్యోగులు రోడ్లు ఊడ్చి ఆందోళన చేపట్టారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేవరకు తమ ఆందోళనలు కొనసాగుతాయని హెచ్చరించారు.
 

>
మరిన్ని వార్తలు