రాష్ర్టమే ఓ స్టార్టప్ కంపెనీ :సీఎం చంద్రబాబు

29 Apr, 2016 03:45 IST|Sakshi
రాష్ర్టమే ఓ స్టార్టప్ కంపెనీ :సీఎం చంద్రబాబు

రాష్ర్టంలో మెరుగైన ఉపాధి అవకాశాలు వస్తాయి
జాబ్స్‌డైలాగ్ ఉద్యోగరథం ప్రారంభం

 విజయవాడ (గుణదల): ఆంధ్రప్రదేశే ఓ స్టార్టప్ కంపెనీ అని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. రానున్న రోజుల్లో దేశంలోనే ఉపాధి అవకాశాల కల్పనలో రాష్ర్టం ముందువరుసలో ఉంటుందన్నారు. గురువారం విజయవాడలోని సిద్ధార్థ కళాపీఠంలో టీఎంఐ గ్రూప్, ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన జాబ్స్‌డైలాగ్ ఉద్యోగరథాన్ని సీఎం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ర్టంలో ఎంస్‌ఎంఈ (మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్‌ప్రెన్యూర్స్) రంగంలో మెరుగైన ఉపాధి అవకాశాలు వస్తాయన్నారు. 

దేశంలోనే తొలిసారిగా చౌకగా ఇంటర్నెట్ అందిస్తున్న రాష్ర్టం ఏపీ అని, దీనిపై పేటెంట్ రైట్స్‌కి దరఖాస్తు చేశామని తెలిపారు. టీఎంఐ గ్రూప్స్ సంస్థ చైర్మన్ టి.మురళీధరన్ ఉద్యోగరథం గురించి వివరించారు. క్యాండిడేట్ మేనేజ్‌మెంట్ టీం, క్లైంట్ మేనేజ్‌మెంట్ టీం ఉంటాయని, అభ్యర్థి ఇంటి ముంగిటకు వెళ్లి వివరాలను రిజిస్ట్రేషన్ చేసుకుని వారికి సరిపోయే ఉద్యోగాల వివరాలను,  కావాల్సిన నైపుణ్యాలను అందింస్తుందన్నారు. క్లైంట్ మేనేజ్‌మెంట్ టీం ద్వారా వివిధ సంస్థల్లో ఉన్న ఉపాధి అవకాశాలు, వారికి ఎలాంటి

నైపుణ్యం కలిగిన అభ్యర్థులు కావాలో వంటి వివరాలను సేకరిస్తుందని చెప్పారు. కాగా మరో రెండు నిమిషాల్లో సీఎం  వస్తారనగా వేదిక వద్ద విద్యుత్ షార్ట్ సర్క్యూట్ అయింది.  పోలీస్ సిబ్బంది వైర్లు తప్పించబోతుండగా స్వల్పంగా మంటలంటుకున్నాయి. ఫైర్ సిబ్బంది వచ్చి మంటలను ఆర్పారు.

 విభజన చట్టంలో ఉన్నవన్నీ ఇవ్వలేదు
కేంద్ర ప్రభుత్వం విభజన చట్టంలో ఉన్నవన్నీ ఇవ్వలేదని సీఎం చంద్రబాబు చెప్పారు. అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, పెందుర్తి మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జి విజయవాడలోను, కర్నూలు జిల్లా శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్‌రెడ్డి గుంటూరు జిల్లా తాడేపల్లిలోను గురువారం టీడీపీలో చేరారు. ఈ కార్యక్రమాల్లో ఆయన మాట్లాడారు. కాగా కిడారి చేరికను వ్యతిరేకిస్తూ అరకులో వైఎస్సార్‌సీపీ శ్రేణులు నిరసన ప్రదర్శన చేపట్టాయి.

 రిటైర్డ్ టీచర్లకు ఇళ్లు :  పదవీ విరమణ చేసిన ప్రభుత్వ టీచర్లకు వారు కోరుకున్నచోట సొంతిళ్లు నిర్మించి ఇస్తామని ముఖ్యమంత్రి  ప్రకటించారు.దీనిపై  పథకాన్ని రూపొందిస్తామన్నారు. విజయవాడలో గురువారం జరిగిన పీఆర్‌టీయూ రాష్ట్ర ద్వితీయ కౌన్సిల్ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా ప్రసంగించారు.

>
మరిన్ని వార్తలు