బ్యాంకు ఉద్యోగి నిర్వాకం.. ఖాతాదారుల సొమ్ము స్వాహా 

7 Sep, 2019 07:11 IST|Sakshi

సాక్షి, పుట్టపర్తి : నగర పంచాయతీలోని బ్రాహ్మణపల్లి స్టేట్‌ బాంక్‌లో ఖాతాదారుల సొమ్ము రూ.3 లక్షలను తాత్కాలిక ఉద్యోగి రమేష్‌ స్వాహా చేశారు. మేనేజర్‌ శివనాగ లింగాచారి వివరాల మేరకు.. బ్యాంక్‌లో సిబ్బంది తక్కువ ఖాతాదారులెక్కువగా ఉండడంతో తాత్కాలిక ఉద్యోగికి కొన్ని బాధ్యతలు అప్పజెప్పారు. బడేనాయక్‌ తండాకు చెందిన మంజులాబాయి రమేష్‌ సహకారంతో  2015లో రూ.1.2 లక్షలు, రూ.80 వేల చొప్పున రెండు ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు(ఎఫ్‌డీ) చేసింది. అయితే గతేడాది అక్టోబర్‌లో డబ్బు అవసరం ఉండటంతో ఎఫ్‌డీలపై రూ.1.5 లక్షలు రుణం తీసుకుంది. డబ్బు సరిపోవడంతో 15 రోజుల తర్వాత రుణం చెల్లించాలంటూ రమేష్‌కు నగదు అందజేసింది. రమేష్‌ బ్యాంకు సిబ్బందికి తెలియకుండా ఆమెకు నకిలీ ఎఫ్‌డీ రసీదు ఇచ్చాడు.

ఆమెకు ఉన్న పరిచయంతో కొద్ది రోజులకు ఆమె  ఇంటికి వెళ్లి ఒర్జినల్‌ ఎఫ్‌డీ రసీదు తీసుకొచ్చి బ్యాంక్‌ సిబ్బందితో ఉన్న నమ్మకాన్ని ఆయుధంగా చేసుకొని ఫోర్జరీ సంతకాలతో రెండు లక్షలు స్వాహా చేశాడు. ఆమె తిరిగి ఈనెల 5న నకిలీ ఎఫ్‌డీ రసీదు తీసుకుని బ్యాంకుకు వచ్చి డబ్బు అడగడంతో రమేష్‌ బాగోతం బయటపడింది. ఇదే తరహాలో సుబ్బరాయునిపల్లికి చెందిన సత్యమ్మకు రూ.1 లక్ష టోకరా వేసినట్లు బాధితురాలు వాపోయింది. విషయం తెలుసుకున్న సదరు ఉద్యోగి పరారుకావడంతో బాధితులను పోలీసులను ఆశ్రయించినట్లు తెలుస్తోంది. బ్యాంకు అధికారులు విచారిస్తే మరిన్ని అక్రమాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉన్నట్లు బాధితులు చెబుతున్నారు. ఇది చదవండి : సాక్స్‌లో మొబైల్‌ ఫోన్‌ పెట్టుకొని సచివాలయం పరీక్షకు..

మరిన్ని వార్తలు