రాష్ట్రం రోల్ మోడల్ కావాలి

18 May, 2015 02:29 IST|Sakshi
రాష్ట్రం రోల్ మోడల్ కావాలి

సాక్షి,హైదరాబాద్: ఘన, ద్రవ వ్యర్థాల నిర్వహణ.. వాటి నుంచి ఇంధన ఉత్పత్తి, పర్యావరణ పరిరక్షణలో ఆంధ్రప్రదేశ్ ఇతర రాష్ట్రాలకు రోల్ మోడల్ కావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పారు. ఆదివారం తన నివాసంలో అధికారులు, వివిధ సంస్థల ప్రతినిధులతో ఆయన సమావేశమయ్యారు. ఘన వ్యర్థాలను సేకరించి శుద్ధి చేసి సేద్యానికి వినియోగించే పద్ధతులపై సీఎం చర్చించారు. స్వచ్ఛ భారత్‌పై ముఖ్యమంత్రుల కమిటీ కన్వీనర్‌గా ఇతర రాష్ట్రాలకు చెప్పే ముందు వాటిని ఏపీలో విజయవంతంగా నిర్వహించటంపై దృష్టి పెట్టానన్నారు. ఏపీకి సరిపోయే శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించాలని ప్రతినిధులను కోరారు. ఢిల్లీలోని వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ తరహాలో ఏపీలో కూడా జిల్లాకు ఒకటి చొప్పున 18 నెలల్లో ప్లాంట్లను నెలకొల్పాలని నిర్ణయించినట్లు తెలిపారు.

గ్రామాల్లో పశువ్యర్థాల నుంచి వర్మి కల్చర్ అభివృద్ధి ప్లాంట్లు స్థాపిస్తామని చెప్పారు. ఏపీలోని 13 జిల్లాలలో రోజుకు 9 వేల టన్నుల ఘన, ద్రవ వ్యర్థాలు పేరుకుంటున్నాయని, పునర్వినియోగం ద్వారా ఇంధన ఉత్పత్తికి రంగం సిద్ధం చేస్తున్నట్లు చెప్పారు. ఈ సందర్భంగా వివిధ కంపెనీల ప్రతినిధులు సీఎంకి తమ విధానాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ సమీక్షలో టాటా, ఏఈసీఓఎం, ఐఎల్ అండ్ ఎస్ ఎస్ ఇతర కంపెనీల ప్రతినిధులతో పాటు మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్యకార్యదర్శి ఎ.గిరిధర్, కార్యదర్శి జయలక్ష్మి, సీఎంవో ముఖ్య కార్యదర్శి సతీష్ చంద్ర, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఎండీ మురళీధర్ రెడ్డి, ముఖ్య కార్యదర్శి జవహర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
 

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు