హస్తినలో వేడెక్కుతున్నవిభజన రాజకీయాలు

1 Feb, 2014 01:12 IST|Sakshi
హస్తినలో వేడెక్కుతున్నవిభజన రాజకీయాలు
  •  కాంగ్రెస్:కమలం కలిసొస్తుందా? క్రెడిట్ మనకు రానిస్తుందా?
  •  బీజేపీ: తర్వాత మనమే ఇద్దామా? ఇప్పుడు మద్దతిద్దామా?
  •  హస్తినలో వేడెక్కుతున్నవిభజన రాజకీయాలు
  •  పార్లమెంటులో బిల్లు ఆమోదానికి బీజేపీ మద్దతే కీలకం.. 
  •  దీనిపై వ్యూహ ప్రతివ్యూహాలను రూపొందిస్తున్న అధికార, ప్రతిపక్షాలు
  •  వ్యాఖ్యలు, ప్రతి వ్యాఖ్యలతో ఒకరిపై మరొకరు ఒత్తిడి పెంచుతున్న వైనం
  •  ‘ప్రతిపక్షాలు సహకరిస్తేనే’ తెలంగాణ బిల్లు ఆమోదం అంటున్న కాంగ్రెస్ నేతలు
  •  టీ బిల్లుకు సవరణలు తేవాలని బీజేపీ యోచన
  •  
     సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్ర విభజనకు సంబంధించిన సీన్ ఇప్పుడు హస్తినకు మారింది. ఇక కేంద్రంలో ప్రధాన రాజకీయ పక్షాల్లో వేడి రేగుతోంది. ఢిల్లీ స్థాయిలో అధికార - ప్రధాన ప్రతిపక్షాల మధ్య వ్యూహప్రతివ్యూహాల యుద్ధం ముదురుతోంది. మరో ఐదు రోజుల్లో మొదలుకానున్న పార్లమెంటు శీతాకాల సమావేశాల ముందుకు రానున్న ‘ఆంధ్రప్రదేశ్ పునర్‌వ్యవస్థీకరణ బిల్లు’ విషయంలో కాంగ్రెస్ - బీజేపీలు ఎత్తుగడలకు పదునుపెడుతున్నాయి. పార్లమెంటులో ప్రస్తుత బలాబలాలను బట్టి చూస్తే.. తెలంగాణ బిల్లు ఆమోదం పొందాలంటే ఈ రెండు పార్టీలూ దానిపై ఒక్క మాట మీద నిలబడితేనే సాధ్యమవుతుందని విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు. అయితే.. రాష్ట్ర విభజనపై ఇరు పార్టీలకు చెందిన రాష్ట్ర శాఖల్లో ఏకాభిప్రాయం సాధించలేకపోవడం.. అతి త్వరలో రానున్న సార్వత్రిక ఎన్నికల్లో విభజన ప్రభావం ఎలా ఉంటుందన్న అంచనాల నేపధ్యంలో.. బిల్లు వ్యవహారంలో స్వీయ ప్రయోజనం పొందటంతో పాటు.. ప్రత్యర్థి పక్షాన్ని ఇరుకున పెట్టటం ఎలా? అనే ఆలోచనలతో రెండు పార్టీలూ అడుగులు వేస్తున్నట్లు వారు విశ్లేషిస్తున్నారు. 
     
    ఇటీవల పలు సందర్భాల్లో రెండు పార్టీల సీనియర్ నేతలు చేసిన వ్యాఖ్యలను ఇందుకు ఉదాహరణగా ఉటంకిస్తున్నారు. విభజన బిల్లు కాంగ్రెస్ కోర్టులోనే ఉందని ఇటీవలి కాలంలో బీజేపీ సీనియర్ నేత వెంకయ్యనాయుడు చేసిన వ్యాఖ్యలు, బీజేపీ మద్దతు ఇస్తేనే బిల్లు నెగ్గుతుందని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్‌సింగ్ మాటలు.. బాధ్యతను ప్రత్యర్థి పక్షంపై పెట్టి ఒత్తిడి పెంచే ప్రయత్నాల్లో భాగమేనని పరిశీలకులు అంచనా వేస్తున్నారు. విభజన బిల్లును ఆంధ్రప్రదేశ్ శాసనసభ అభిప్రాయం కోసం పంపినప్పటి నుంచి సీమాంధ్ర ప్రాంత సమస్యలను లేవనెత్తుతున్న బీజేపీ.. పార్లమెంటులో మద్దతు ఇస్తుందా? తెలంగాణ ఇచ్చిన క్రెడిట్‌ను తమకు దక్కనిస్తుందా? అన్న అనుమానాలు కాంగ్రెస్‌లో బలపడుతున్నాయని చెప్తున్నారు. మరోవైపు.. చిన్న రాష్ట్రాలకు అనుకూలమని ప్రకటించినందున పార్లమెంటులో విభజన బిల్లుకు మద్దతిద్దామా? లేక.. ఇప్పుడు సీమాంధ్ర సమస్యల పరిష్కారం పేరుతో బిల్లును అడ్డుకుని.. తాము అధికారంలోకి వచ్చాక తెలంగాణ బిల్లును తెద్దామా? అన్న మీమాంశలో బీజేపీ ఉందని అంచనా వేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ఇక పార్లమెంటు వేదిక పైకి రానున్న తెలంగాణ బిల్లు ఏ మలుపు తిరుగుతుందనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది. 
     
     బీజేపీ ‘కొత్త ఆలోచన’లో ఉందా?
     తెలంగాణకు కట్టుబడి ఉన్నామని.. అయితే సీమాంధ్ర సమస్యలనూ పరిష్కరించటం ముఖ్యమని చెప్తూ ఆచితూచి స్పందిస్తున్న బీజేపీ పైనే ఇప్పుడు అందరి దృష్టీ ప్రధానంగా కేంద్రీకృతమైంది. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్) సూచనల మేరకు బీజేపీ పార్లమెంటరీ బోర్డు తెలంగాణకు సంపూర్ణ మద్దతుగా నిలవాలన్నది నిర్ణయమే అయినప్పటికీ.. బిల్లుకు పలు సవరణలు ప్రతిపాదించాలన్న వ్యూహంలో ‘కొత్త ఆలోచన’ ఏమైనా ఉందా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. యూపీఏ కూటమి నుంచి కొన్ని భాగస్వామ్య పక్షాలు ఇప్పటికే దూరం కావడం, బయటి నుంచి మద్దతునిస్తున్న సమాజ్‌వాది పార్టీ రాష్ట్రాల విభజనను వ్యతిరేకిస్తుండటం వంటి పరిణామాల్లో.. పార్లమెంటులో బిల్లు గట్టెక్కాలంటే బీజేపీ సహకారం అనివార్యంగా కాంగ్రెస్ భావిస్తోందా? లేక బంతి బీజేపీ కోర్టులోనూ ఉందని చెప్పటానికి వ్యూహాత్మకంగానే కాంగ్రెస్ వ్యవహరిస్తోందా? అన్న అంశంపై బీజేపీ నేతలు లోతుగా విశ్లేషిస్తున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ బిల్లును తాము అడ్డుకోవటమంటూ ఏమీ ఉండదని, బిల్లును సాఫీగా ముందుకు తీసుకెళ్లటంలో కాంగ్రెస్‌లోనే అడ్డంకులు ఉన్నాయని బీజేపీ సీనియర్ నేత ఒకరు పేర్కొన్నారు. ‘తెలంగాణపై మా చిత్తశుద్ధి శంకించజాలనిది. అవసరమైన సవరణలను ప్రతిపాదిస్తాం...’ అని మరో నేత చెప్పారు. 
     
     బీజేపీని బాధ్యురాలిని చేసే ఎత్తుగడా..?
     విభజన బిల్లుకు పార్లమెంటులో ప్రధాన ప్రతిపక్షం బీజేపీ నుంచి లభించే సహకారమే కీలకమని కాంగ్రెస్ నాయకత్వం గత రెండు రోజుల నుంచి ఒకింత నొక్కి చెప్పడం ప్రారంభించింది. ‘ప్రతిపక్షాలు సహకరిస్తేనే తెలంగాణ బిల్లు ఆమోదం పొందుతుంద’ని కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ దిగ్విజయ్‌సింగ్ ఓ చానల్ ఇంటర్వ్యూలో చెప్పడం.. ‘ఏం జరుగుతుందో మీరే చూస్తారు, నిజం పార్లమెంటులో వెల్లడవుతుంద’ని కాంగ్రెస్ అధికార ప్రతినిధి సింఘ్వీ తాజాగా మీడియాతో వ్యాఖ్యానించడం.. వెనక అంతరార్థం కాంగ్రెస్‌పై విమర్శలు రాకుండా బీజేపీనే బాధ్యురాలిగా చేయాలన్న వ్యూహంలో భాగమని విశ్లేషకులు చెప్తున్నారు. ‘మేం చెప్పినట్టుగా బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టడం ఖాయం.. మేం చేయగలిగింది అంతవరకే.. ఆ తర్వాత ఏం జరుగుతుందన్నది చూడాల్సిందే...’ అని ఏఐసీసీ నేత ఒకరు వ్యాఖ్యానించారు.
     
     ‘సవరణల’పై బీజేపీ కసరత్తు
     తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటుచేయడంతో పాటు సీమాంధ్రుల సమస్యలను పరిష్కరించాలనే డిమాండ్‌తో విభజన బిల్లులో సవరణలకు బీజేపీ పట్టుపట్టనుంది. ప్రతిపాదిత సవరణలపై కాంగ్రెస్ నుంచి స్పష్టమైన హామీ లభించకపోతే అవసరమైతే పార్లమెంటులో ఓటింగ్‌కు పట్టుపట్టాలని బీజేపీ సీమాంధ్ర నేతలు పార్టీ అగ్రనాయకత్వంపై ఒత్తిడి తెస్తున్నారు. ప్రధానంగా భద్రాచలం డివిజన్ సహా పోలవరం ముంపుకు లోనయ్యే 134 గ్రామాలను సీమాంధ్రలో కలపడం, సాగునీటి ప్రాజెక్టులన్నింటిని పూర్తి చేయడం, కరువు ప్రాంతం రాయలసీమకు 200 టీఎంసీల నీటికి హామీ, ఉమ్మడి రాజధాని, హైదరాబాద్‌లోని సీమాంధ్రులకు భద్రత కల్పించడానికి రాజ్యాంగ సవరణ చేయడం, భవిష్యత్‌లో వివాదాలు తలెత్తకుండా సీమాంధ్రలో కొత్త రాజధాని ఎక్కడ నిర్మించాలనేది స్పష్టంగా చెప్పడం, విభజన తర్వాత బదిలీలకు సంబంధించి ఉద్యోగులకు ఆప్షన్లు ఇవ్వడం, ఆస్తులు, ఆదాయాల రెవెన్యూ షేరింగ్‌పై ష్పష్టత ఇవ్వడం, వైజాగ్-చెన్నై పారిశ్రామిక కాారిడార్ నిర్మాణం, వైజాగ్, తిరుపతి, విజయవాడ విమానాశ్రయాల అభివృద్ధి, కొత్త రైల్వే జోన్, కేంద్ర విశ్వవిద్యాలయాలు, ఐఐటీలు, వ్యవసాయ విశ్వవిద్యాలయాలు ఏర్పాటు చేయడం వంటి అంశాలపై కసరత్తు చేసినట్టు సమాచారం.
మరిన్ని వార్తలు