నేడు బీజేపీ రాష్ట్ర కోర్‌కమిటీ సమావేశం

14 Feb, 2016 00:41 IST|Sakshi

 సాక్షి ప్రతినిధి, కాకినాడ : బీజేపీ రాష్ర్ట కోర్ కమిటీ సమావేశం ఆదివారం రాజమహేంద్రవరంలో జరగనుంది. దీనికి పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ సిద్ధార్థనాథ్ సింగ్, ఎంపీలు గోకరాజు గంగరాజు, కంభంపాటి హరి బాబు, రాష్ట్ర మంత్రులు పైడికొండల మాణిక్యాలరావు, కామినేని శ్రీనివాస్, ఎమ్మెల్సీలు సోము వీర్రాజు, కంతేటి సత్యనారాయణరాజు, ఎమ్మెల్యేలు ఆకుల సత్యనారాయణ, విష్ణుకుమార్‌రాజు, కేంద్ర మాజీ మంత్రులు పురంధేశ్వరి, కావూరి సాంబశివరావు, మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ తదితరులు హాజరుకానున్నారు.
 
  పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా రాష్ట్ర పర్యటనను ఖరారుపై ఈ సమావేశంలో చర్చ ఉంటుందని పార్టీ నాయకులు చెబుతున్నారు. అయితే, ప్రస్తుత పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కంభంపాటి హరిబాబు పదవీకాలం త్వరలో పూర్తికానున్నందున.. ఆయన వారసుడి ఎంపికపై చర్చించవచ్చని తెలుస్తోంది. తన కుమార్తె దీపా వెంకట్ కుటుంబంలో జరిగే ఓ శుభకార్యానికి కేంద్ర మంత్రి ఎం.వెంకయ్యనాయుడు ఈ నెల 17న రాజమహేంద్రవరం రానున్నారని సమాచారం. ఈలోగా ఈ అంశాన్ని ఓ కొలిక్కి తీసుకురావడంపై కోర్‌కమిటీలో చర్చించనున్నట్టు తెలిసింది.
 
  రాష్ట్రంలో కాపులకు అన్ని పార్టీలూ ప్రాధాన్యం ఇస్తున్నందున.. బీజేపీ కూడా అదేబాటలో పయనించాలనే వాదన కొద్దికాలంగా వినిపిస్తోంది. దీంతో ఎమ్మెల్సీ సోము వీర్రాజుకే రాష్ర్ట అధ్యక్ష పదవి దక్కుతుందనే ప్రచారం జరిగింది. ఇప్పటికే చంద్రబాబు వ్యతిరేకిగా ముద్రపడినా, ఇటీవల టీడీపీ అక్రమాలపై ఆయన నోరు మెదపడంలేదు. టీడీపీ నుంచి వ్యతిరేకతా రాకుండా ఉండేందుకే ఆయన వ్యూహాత్మక మౌనం పాటిస్తున్నారన్న వాదన ఉంది.
 
 ముద్రగడ పద్మనాభం చేపట్టిన కాపుగర్జన సభకు వీర్రాజు హాజరు కాకపోవడం, సభకు హాజరైన మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణపై ప్రభుత్వం కేసు నమోదు చేసినా స్పందించకపోవడం, చివరకు ముద్రగడ నిరాహార దీక్షకు సంఘీభావం ప్రకటించక పోవడంతో పార్టీలోని కాపు సామాజికవర్గం ఆయనపై గుర్రుగా ఉంది. దీంతో పార్టీలోని రెండు ప్రధాన సామాజికవర్గాల నుంచి వ్యతిరేకత వస్తుందనే సాకుతో కంభంపాటినే మరోసారి కొనసాగించవచ్చని చెబుతున్నారు.
 

మరిన్ని వార్తలు