నేడు ఏపీ కేబినెట్‌ భేటీ

11 Jun, 2020 04:36 IST|Sakshi

అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాల నిర్వహణపై చర్చ

పలు ముసాయిదా బిల్లులకు మంత్రివర్గం ఆమోదం

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటెలిజెన్స్‌ ఏర్పాటు 

వైద్య పోస్టుల భర్తీ, తెలుగు అకాడమీపై నిర్ణయాలు

చిరు వ్యాపారులకు వడ్డీ లేని రుణాలు, గండికోట నిర్వాసితులకు పరిహారంపై చర్చించే అవకాశం 

సాక్షి, అమరావతి: రాష్ట్ర మంత్రివర్గ సమావేశం సీఎం వైఎస్‌ జగన్‌ అధ్యక్షతన గురువారం ఉదయం 11 గంటలకు సచివాలయంలో జరగనుంది. కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా వీడియో కాన్ఫరెన్స్‌ హాల్లో భౌతిక దూరం పాటించేలా సీట్లను ఏర్పాటు చేశారు. అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాల నిర్వహణతో పాటు పలు ముసాయిదా బిల్లు లపై ఇందులో చర్చించనున్నారు. మరికొన్ని ఎన్నికల హామీలకు కేబినెట్‌లో ఆమోదం తెలపనున్నట్లు సమాచారం.
 
► 45 నుంచి 60 ఏళ్ల మధ్య వయసు కలిగిన బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ మహిళలకు ఆర్ధిక సాయం అందించే వైఎస్సార్‌ చేయూత పథకం నేడు కేబినెట్‌లో చర్చించి ఆమోదం తెలిపే అవకాశం ఉంది.
► చిరు వ్యాపారులకు వడ్డీలేని రుణాలు ఇచ్చే విషయమై  కేబినెట్‌లో చర్చించే అవకాశం ఉంది.
► జీఎస్‌టీ ఎగవేతను నివారించడం, మరింత సమర్ధంగా జీఎస్‌టీ వసూళ్ల కోసం ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటెలిజెన్స్‌ను ఏర్పాటు చేయనున్నారు. ఇందుకు సంబంధించి కేబినెట్‌ ఆమోదం తెలపనుంది.  
► అక్రమ మద్యం, ఇసుక రవాణా నిరోధించేందుకు ఏర్పాటు చేసిన స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరోకు మంత్రివర్గం ఆమోదం తెలపనుంది.  
► పోలీసు శాఖలో 40 అసిస్టెంట్‌ అడ్మినిస్ట్రేషన్‌ ఆఫీసర్‌ పోస్టులను మంజూరు చేయనున్నారు.  
► కాలుష్య నివారణ, పర్యావరణ పరిరక్షణ ముసాయిదా బిల్లును కేబినెట్‌లో ఆమోదించనున్నారు.  
► జీఎస్‌టీ చట్టంలో సవరణలు, ఉన్నత విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్‌ చట్టంలో సవరణలకు సంబంధించిన ముసాయిదా బిల్లులకు కేబినెట్‌ ఆమోదం తెలపనుంది.  
► గండికోట నిర్వాసితులకు పరిహారం చెల్లింపుపై కేబినెట్‌లో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు.  
► రాష్ట్రంలో తెలుగు భాషకు మరింత ప్రాచుర్యం కల్పించేందుకు తెలుగు అకాడమీ ఏర్పాటుపై కేబినెట్‌లో నిర్ణయం తీసుకోనున్నారు.  
► ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఖాళీగా ఉన్న డాక్టర్లు, నర్సులు, ఇతర పారా మెడికల్‌ సిబ్బంది పోస్టుల నియామకంపై కేబినెట్‌ నిర్ణయం తీసుకోనుంది.  
► విజయనగరం జిల్లా కురుపాంలో గిరిజన ఇంజనీరింగ్‌ కాలేజీ ఏర్పాటుతోపాటు రాష్ట్రంలో మూడు కొత్త నర్సింగ్‌ కాలేజీల ఏర్పాటుపై కేబినెట్‌లో నిర్ణయం తీసుకోనున్నారు. 

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా