నేడు రాష్ట్ర మంత్రివర్గ భేటీ

30 Oct, 2019 05:29 IST|Sakshi

మరిన్ని ఎన్నికల హామీలను అమల్లోకి తేవడంపై కీలక నిర్ణయాలకు ఆస్కారం

సాక్షి, అమరావతి: మరిన్ని ఎన్నికల హామీలను అమల్లోకి తేవడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన బుధవారం సచివాలయంలో మంత్రివర్గ సమావేశం జరగనుంది. ప్రధానంగా వచ్చే జనవరి 26వ తేదీ నుంచి అమల్లోకి తీసుకురానున్న ప్రతిష్టాత్మకమైన ‘జగనన్న అమ్మ ఒడి’ పథకం మార్గదర్శకాలను ఈ సమావేశంలో మంత్రివర్గం ఖరారు చేయనుంది. అలాగే మహిళలు, పిల్లలు తీవ్ర రక్తహీనత, పౌష్టికాహార లోపంతో బాధపడుతున్న 77 గిరిజన మండలాల్లోని 1,642 గ్రామ పంచాయతీల్లో అదనపు పౌష్టికాహారం అందించేందుకు చేపట్టనున్న పైలెట్‌ ప్రాజెక్టుకు కూడా కేబినెట్‌ ఆమోదం తెలపనుంది.

ఈ పైలెట్‌ ప్రాజెక్టు ద్వారా 66 వేల మంది గర్భవతులు, బాలింతలకు, 3.18 లక్షల మంది పిల్లలకు అదనపు పౌష్టికాహారం అందిస్తారు. అలాగే హజ్‌ యాత్రికులకు, జెరూసలేం యాత్రికులకు అందజేసే ఆర్థిక సాయాన్ని రూ.మూడు లక్షలలోపు వార్షికాదాయమున్న వారికి రూ.40 వేల నుంచి రూ.60 వేలకు, మూడు లక్షలపైన వార్షికాదాయమున్న వారికి రూ.20 వేల నుంచి రూ.30 వేలకు పెంచుతూ కేబినెట్‌ నిర్ణయం తీసుకోనున్నట్టు సమాచారం. రోబో ఇసుకను ప్రోత్సహించేందుకు ప్రస్తుతమున్న క్రషర్స్‌కు పావలా వడ్డీకే రుణాలను ఏపీఎస్‌ఎఫ్‌సీ ద్వారా అందించేందుకు మంత్రివర్గంలో చర్చించి నిర్ణయం తీసుకోనున్నట్టు తెలుస్తోంది. ఏపీ అడ్వొకేట్స్‌ సంక్షేమ నిధి చట్టంలో సవరణలు, అలాగే దేవదాయ చట్టంలో సవరణలకు సంబంధించిన ముసాయిదా బిల్లులకు కేబినెట్‌లో ఆమోదం తెలిపే అవకాశముంది. 

మీ అభిప్రాయాలను కింద తెలపండి

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments

మరిన్ని వార్తలు