ఖమ్మం జిల్లా బంద్ సంపూర్ణం

5 Nov, 2013 06:28 IST|Sakshi

భద్రాచలం, న్యూస్‌లైన్:  భద్రాచలాన్ని తెలంగాణలోనే కొనసాగించాలంటూ సోమవారం టీజేఏసీ నాయకులు చేపట్టిన  డివిజన్ బంద్ విజయవంతం అయింది. ఈసందర్భంగా భద్రాచలంతో పాటు, డివిజన్ వ్యాప్తంగా అన్ని మండలాల్లో  మోటార్‌సైకిళ్ల ర్యాలీలను నిర్వహించారు.  భద్రాచలాన్ని కలుపుకొని తెలంగాణ వనరులను దోచుకోవాలని సీమాంధ్ర నాయకులు పన్నుతున్న కుట్రలను అడ్డుకుంటామనిటీజేఏసీ నాయకులు హెచ్చరించారు.
 
  భద్రాచలంలో తెల్లవారుజామునుంచే ఆర్‌టీసి బస్సులను డిపో నుంచి బయటికి రాకుండా నాయకులు అడ్డుకున్నారు. భద్రాచలానికి వచ్చే అన్ని రహదారులను నాయకులు మూసివేసి ఆటోలను, బస్సులను అడ్డుకున్నారు.  పట్టణంలోని అన్ని దుకాణాలు, పెట్రోల్‌బంక్‌లు, హోటళ్లు స్వచ్ఛందంగా మూసివేశారు. బ్యాంకులు, తహశీల్దార్ కార్యాలయం,  పాఠశాలలను నాయకులు బంద్ చేయించారు.   దీంతో పట్టణంలో  కార్యకలాపాలన్నీ నిలిచిపోయాయి. బస్సులను పూర్తిగా ఆపివేయటంతో  ప్రయాణికులు పలు ఇబ్బందులు పడ్డారు. ప్రయాణికులు సారపాక వరకు వెళ్లి అక్కడి నుంచి ఇతర ప్రాంతాలకు తరలివెళ్లారు.  బంద్‌ను విజయవంతం చేసేందుకు టీజేఏసీ ఆధ్వర్యంలో వివిధ పార్టీల నాయకులు, ఉద్యోగులు ర్యాలీ నిర్వహించారు. బ్రిడ్జి సెంటర్‌లో రాస్తారోకో చేపట్టారు. బంద్‌కు ఆదివాసీ గిరిజన సంఘా లు మద్దతు ప్రకటించాయి.
 
  చర్ల మండలంలో బంద్ సంపూర్ణంగా సాగింది. జేఏసీ నాయకులు  పెద్దఎత్తున ర్యాలీలు నిర్వహించారు. రాజకీయ జేఏసీ, నాయీ బ్రాహ్మణ సేవా సంఘం, ఆటో వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీలు తీశారు.
 
     వెంకటాపురం  మండలంలో బంద్ విజయవంతమైంది. వ్యాపారస్తులు దుకాణాలను స్వచ్ఛందంగా మూసివేశారు. పాఠశాలలు, కళాశాలలు బంద్ చేయించారు. మండల కేంద్రానికి వచ్చిన బస్సులను తెలంగాణ  వాదులు నిలిపివేశారు.
 
  వాజేడు మండలంలో బంద్ సంపూర్ణంగా జరిగింది. దుకాణాలు, హోటళ్లు స్వచ్ఛందంగా మూసివేసి బంద్‌కు సంఘీభావం తెలిపారు. పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాలను తెలంగాణ  వాదులు మూయించారు. తహశీల్దార్, ఎంపీడీఓ కార్యాలయాలకు తెలంగాణ వాదులు తాళాలు వేశారు.
  చింతూరు మండలంలోలో బంద్‌ను పురస్కరించుకొని  విద్యాలయాలతో పాటు వ్యాపార సముదాయాలు మూతపడ్డాయి. జేఏసీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించి, మెయిన్‌రోడ్ సెంటర్‌లో మానవహారం నిర్వహించారు.
 
     దుమ్ముగూడెం మండలంలో బంద్ విజయవంతంగా ముగిసింది. దుకాణాలు, హోటళ్లు మూసివేశారు. ప్రభుత్వ, ప్రయివేటు విద్యాలయాలను మూసివేశారు.
 
  వీఆర్‌పురం మండలంలో ప్రభుత్వ కార్యాలయాలను బంద్ చేయించారు.
 
     కూనవరం మండల కేంద్రంలో బంద్ విజయవంతం అయింది. వివిధ రాజకీయ పార్టీల నాయకులు, ఉద్యోగ జేఏసీ నాయకులు, విద్యార్థులు, ఎమ్మార్పీఎస్ నాయకులు పెద్దఎత్తున బంద్‌లో పాల్గొన్నారు. దుకాణాలు స్వచ్ఛందంగా మూసివేశారు. కూనవరం నుంచి కోతులగుట్ట వరకు మోటారుసైకిళ్లపై ర్యాలీ నిర్వహించారు.

మరిన్ని వార్తలు