తక్షణమే అమలులోకి ఎన్నికల కోడ్‌

8 Mar, 2020 06:05 IST|Sakshi

ప్రవర్తన నియమావళిని విధిగా పాటించాలి

ప్రభుత్వ సదుపాయాల వినియోగంపై నిషేధం 

కేంద్ర ఎన్నికల సంఘం నియమాలకు అనుగుణంగానే కోడ్‌ అమలు

ఎన్నికల నిర్వహణలో కలెక్టర్లు, ఎస్పీలకు పూర్తి అధికారాలు

రాజధాని గ్రామాల్లో ఎన్నికల నిర్వహణకు సాంకేతిక ఇబ్బందులు 

ఎన్నికలు ఏకగ్రీవమైతే ప్రోత్సాహకాలు

మీడియాతో రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ ఎన్‌. రమేష్‌కుమార్‌

సాక్షి, అమరావతి : స్థానిక ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించిన నేపథ్యంలో రాష్ట్రమంతటా తక్షణమే ఎన్నికల కోడ్‌ అమలులోకి వచ్చిందని రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ ఎన్‌. రమేష్‌కుమార్‌ తెలిపారు. మంత్రులు, పదవుల్లో ఉన్న ఇతర ప్రముఖులు ఎన్నికల నియమావళిని విధిగా పాటించాలన్నారు. కోడ్‌ కారణంగా వారు ప్రభుత్వ సదుపాయాలు, వసతులను వినియోగించుకునే వీల్లేదన్నారు. ఎన్నికల షెడ్యూల్‌ విడుదల సందర్భంగా శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎన్నికలు జరిగే ప్రతీసారి కోడ్‌ అమలు సాధారణ ప్రక్రియేనని.. కేంద్ర ఎన్నికల సంఘం ఏ మార్గదర్శకాలను పాటిస్తుందో తామూ వాటినే పాటిస్తున్నామన్నారు. ఓటర్లను ప్రభావితం చేసే ప్రభుత్వ పథకాలు నిలిచిపోతాయన్నారు. ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలపై నిషేధం అమలులోకి వచ్చిందని.. కోడ్‌ ముగిసేవరకు కొత్త బదిలీలు జరగవని ఆయన చెప్పారు. ఇదివరకే బదిలీలు జరిగి, శనివారం 11 గంటల వరకు అమలులోకి రాకపోతే ఆ బదిలీలు నిలిచిపోతాయని రమేష్‌కుమార్‌ చెప్పారు. సమావేశంలో ఆయన ఇంకా ఏమన్నారంటే..
- ఎన్నికల నిర్వహణకు సంబంధించి జిల్లా కలెక్టర్లు, ఎస్పీలకు పూర్తి అధికారాలు సంక్రమించాయి. అధికార యంత్రాంగం కలెక్టర్లకు పూర్తిస్థాయిలో తోడ్పాటునందించాలి. 
- ఎన్నికల కోసం 15 మంది సీనియర్‌ ఐఏఎస్‌ అధికారులను సాధారణ పరిశీలకులుగా నియమిస్తున్నాం. సోమవారం వారితో సమావేశం నిర్వహించిన అనంతరం వారు జిల్లాలకు వెళ్లి జిల్లా అధికారులు, రాష్ట్రస్థాయి అధికారులకు వారధిగా పనిచేస్తారు. మరో 15 మంది అధికారులను వ్యయ పరిశీలకులుగా నియమిస్తాం. 
- స్వేచ్ఛగా ఎన్నికల నిర్వహణకు రాజకీయ పార్టీలు సహకరించాలి. ప్రజలందరూ ఈ ఎన్నికల్లో భాగస్వాములు కావాలి. 
కొత్తగా ఏర్పడిన గ్రామ పంచాయతీలలో ఇప్పుడు ఎన్నికలు జరపడం సాధ్యంకాదు. అలాంటివి 140 దాకా ఉండొచ్చు. 
రాజధాని ప్రాంతంలోని గ్రామాలను కొత్తగా అర్బన్‌ పరిధిలోకి తీసుకొచ్చారు. సాంకేతికంగా అక్కడా ఎన్నికల నిర్వహణకు ఇబ్బందులున్నాయి. 
కొన్ని ప్రభుత్వ భవనాలపై అభ్యంతరకర రంగులున్న అంశం ఓటర్లను పెద్దగా ప్రభావితం చేయదని నా భావన. ఇకపై అలాంటివి జరగకుండా చర్యలు తీసుకుంటాం. 
ఎన్నికల కోడ్‌ అమలులో ప్రత్యేకంగా ఒక పథకం గురించి స్పందించను. ఓటర్లను ప్రభావితం చేసే ఏ స్కీం అయినా.. పాతవి లేదా కొత్తవి అమలు తాత్కాలికంగా నిలిచిపోతాయి. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టదలచిన ఇళ్ల పట్టాల పంపిణీ ఆ పరిధిలో వస్తే నిలిచిపోతుంది. దానిపై కలెక్టర్లు అదనపు సమాచారం కోసం సంప్రదిస్తే చర్యలు తీసుకుంటాం.
బీసీ రిజర్వేషన్లపై కొన్ని రాజకీయ పార్టీలు వేసిన కేసును సుప్రీంకోర్టు స్వీకరించిందో లేదో అనే దానిపై సమాచారంలేదు. ఏదైనా కోర్టు తీర్పునకు అనుగుణంగా పనిచేస్తాం. 
ఎన్నికలు ఏకగ్రీవమైన చోట ఈసారీ ప్రోత్సాహకాలు ఉంటాయి. ప్రభుత్వం కూడా ప్రోత్సాహక మొత్తాన్ని పెంచింది. అయితే, బలవంతపు ఏకగ్రీవాల విషయంలో అప్రమత్తంగా ఉండాలని అధికారులకు సూచించాను.
ఎన్నికలలో మద్యం, డబ్బు పంపిణీని నియంత్రించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చట్టం తీసుకురావడం ప్రభుత్వ ధృఢమైన నిర్ణయాన్ని తెలియజేస్తోంది.
- సొంత మండలంలో పనిచేసే ప్రభుత్వ సిబ్బందిని ఆ మండలంలోని ఎన్నికల విధులకు ఉపయోగించం.  

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా