'ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఉల్లంఘిస్తే సహించం'

10 Mar, 2020 13:05 IST|Sakshi

సాక్షి, విజయవాడ : విజయవాడలోని ఈసీ కార్యాలయంలో 13 జిల్లాల ఎన్నికల వ్యయ పరిశీలకులతో రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ రమేశ్‌ కుమార్‌ మంగళవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతిరోజు క్షేత్రస్థాయిలో ఎన్ని కేసులు నమోదయ్యాయే వాటి వివరాలు తెలియజేయాలన్నారు. అనుమతి లేని ర్యాలీలు, బైక్ ర్యాలీలపై ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపారు.ఎన్నికల పరిశీలకులు తమ విధిని నిర్వర్తించడంలో నిష్పాక్షికంగా వ్యవహరించాలన్నారు.వెంటనే జిల్లాలలో ఎన్నికల ప్రవర్తనా నియమావళిపై ఫిర్యాదులను పరిష్కరించడానికి పరిశీలకులు చురుకుగా వ్యవహరించాలన్నారు. ఎన్నికల నిబంధనలను కఠినంగా అమలు చేసేలా చూడాలని పేర్కొన్నారు. ఎన్నికల్లో అభ్యర్థులు చేసే ఖర్చులతో పాటు, సున్నితమైన ప్రదేశాలను గుర్తించి వాటిపై నిశితంగా దృష్టి సారించాలని వెల్లడించారు. 

ఎన్నికల్లో డబ్బును అరికట్టడానికి ఎన్నికల వ్యయ ఖాతాలను తరచూగా తనిఖీ చేయడానికి జిల్లా కలెక్టర్లతో కలిసి సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు.వివాహం, కుటుంబ వేడుకలు, వైద్య చికిత్స, ఫీజు చెల్లింపు మొదలైన ఏవైనా వ్యక్తి గత కారణాల వల్ల నిర్దేశించిన పరిమితి రూ. 50వేల కంటే ఎక్కువ ఉండకూడదన్నారు.ఎన్నికల్లో అభ్యర్థులు చేసే ఖర్చులను  గతంలో ఉన్న వ్యయ పరిధి కంటే రెండింతలు పెంచడం జరిగిందని అధికారులకు వెల్లడించారు. వ్యయ పరిశీలకులు  వీలైనన్ని ఎక్కువ శిక్షణా కేంద్రాలకు హాజరు కావాలని, క్షేత్రస్థాయిలో విధుల్లో పాల్గొనే సిబ్బందికి, అధికారులకు తగిన సూచనలు చెయ్యాలన్నారు. ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఉల్లంఘిస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ ఎన్నికల పరిశీలకులు సహించరనే నమ్మకం క్షేత్రస్థాయిలో తీసుకురావాలని రమేశ్‌ కుమార్‌ పేర్కొన్నారు.
 

మరిన్ని వార్తలు