రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది: వైఎస్‌ జగన్‌

26 May, 2020 13:08 IST|Sakshi

సాక్షి, అమరావతి : ‘మన పాలన–మీ సూచన’ పేరుతో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న మేధోమథన సదస్సుల్లో భాగంగా మంగళవారం వ్యవసాయం, అనుబంధ రంగాలపై సమీక్ష జరిగింది. రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి అన్నారు. రైతు, రైతు కూలీల్లో చిరునవ్వు చూడటమే మనలక్ష్యం. 3,648 కిలోమీటర్ల పాదయాత్రలో రైతుల కష్టాలను చూశా. రైతుల కష్టాలను తొలగించేలా మేనిఫెస్టో రూపొందించాం. ('సీఎం జగన్‌ మంచి విజన్‌ ఉన్న నాయకుడు')

రూ.13500 పంటసాయం
పంటల సాగు ఖర్చు తగ్గించగలిగితే రైతులు లాభపడతారు. ప్రకృతి వైపరిత్యాలు వచ్చినప్పుడు రైతులను ఎలా కాపాడుకోవాలో కూడా ఆలోచించాం. పండించిన పంటకు గిట్టుబాటు ధర లభించినప్పుడే వ్యవసాయం లాభసాటిగా ఉంటుంది. ఈ మూడు ప్రధాన అంశాలుగా మన ప్రభుత్వం ముందుకెళ్తోంది. రైతు భరోసా - పీఎం కిసాన్‌ ద్వారా రూ.13500 పంటసాయం అందిస్తున్నాం. రూ.12500 ఇస్తామని మాట ఇచ్చినా.. రూ.13500లకు పెంచాం. నాలుగేళ్లకు బదులు ఐదేళ్లు రైతు భరోసా అందిస్తాం. (అభివృద్ధిని అడ్డుకోవడమే చంద్రబాబు పని)

తొలి ఏడాదిలోనే రూ.10,209 కోట్లను రైతులకు ఇచ్చాం. గత ప్రభుత్వం రూ.87 వేల కోట్ల రుణాలు మాఫీ చేస్తామని చెప్పి, ఐదేళ్లలో కేవలం రూ.15వేల కోట్లు మాత్రమే ఇచ్చింది. రైతులకు ఉచితంగా పంటల బీమా అమలు చేస్తున్నాం. రూ.1270 కోట్లు బీమా ప్రీమియం కూడా చెల్లించాం. పంట నష్టం జరిగితే వెంటనే రైతుకు సహాయం అందాలి. గతప్రభుత్వం సున్నావడ్డీ పథకాన్ని పట్టించుకోలేదు. రైతులకు వైఎస్‌ఆర్‌ సున్నావడ్డీ పథకాన్ని అమల్లోకి తెచ్చాం. రైతులకు ఉచితంగా బోర్లు వేయిస్తాం. ఉచిత కరెంట్‌ ద్వారా ప్రతి రైతుకు రూ.49వేలు లబ్ధి చేకూరుతోంది. ప్రతి ఏడాది రాష్ట్రప్రభుత్వంపై రూ.8,800 కోట్లు భారం పడుతుంది. పగటిపూట కరెంట్‌ ఇచ్చేందుకు రూ.1700 కోట్లతో ఫీడర్లను ఆధునీకరించాం. ఈ ఖరీఫ్‌ నాటికి 82శాతం ఫీడర్లలో 9గంటల ఉచిత విద్యుత్‌ అందుబాటులో ఉంటుంది. మిగిలిన 18శాతం రబీనాటికి అందుబాటులోకి వస్తుంది. ఆక్వా రైతులకు రూపాయిన్నరకే కరెంట్‌ ఇస్తున్నాం. (ఏపీలో ప్రారంభమైన దేశీయ విమాన సర్వీసులు)

ఆ పంటలను కొనుగోలు చేసిన చరిత్ర ఎప్పుడూ లేదు
80,522 క్వింటాళ్ల ఉల్లిని కొనుగోలు చేసి రైతుబజార్లలో విక్రయించాం. కోవిడ్‌ సమయంలో రైతులు నష్టపోకుండా రూ.1100 కోట్లతో పంటలను కొనుగోలు చేశాం. మొక్కజొన్న, టమాట, అరటి పంటలను కొనుగోలు చేసిన చరిత్ర గతంలో ఎప్పుడూ లేదు. వారం రోజుల్లోనే రైతులకు డబ్బులు చెల్లించాం. 8నెలల కాలంలో 5లక్షల 60వేల మెట్రిక్‌ టన్నుల వ్యవసాయ ఉత్పత్తులను కొనుగోలు చేశాం. ధరల స్థిరీకరణ నిధి ద్వారా రూ.2,200 కోట్లు చెల్లించాం. రూ.12,672 కోట్లు ఖర్చు చేసి ధాన్యం కొనుగోలు చేశాం. గత ప్రభుత్వం చెల్లించని రూ.384 కోట్ల విత్తన బకాయిలను కూడా చెల్లించాం. ఆయిల్‌ఫాం రైతులను కూడా ఆదుకున్నాం. ఈ ఏడాది రైతులకు భరోసాగా నిలిచాం.

పంటలు వేయడానికి ముందే గిట్టుబాటు ధర
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 50శాతం రిజర్వేషన్లు కల్పించాం. నామినేటెడ్‌ పదవుల్లో 50శాతం మహిళలకు రిజర్వేషన్లు కల్పించాం. గతప్రభుత్వ హయాంలో ఆత్మహత్యలు చేసుకున్న 400మంది రైతు కుటుంబాలకు.. రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇచ్చి ఆదుకున్నాం. ఈనెల 30న 10,642 వైఎస్‌ఆర్‌ రైతుభరోసా కేంద్రాలు ప్రారంభించనున్నాం. ఆర్‌బీకేల ద్వారా నాణ్యమైన విత్తనాలు, పురుగుమందులు, ఎరువులు అందిస్తాం. వ్యవసాయానికి అవసరమైన సూచనలు, సలహాలు కూడా ఆర్‌బీకేలు అందిస్తాయి. ఆర్‌బీకేల ద్వారా ఈక్రాపింగ్‌ విధానాన్ని అమలు చేస్తాం. పంటలు వేయడానికి ముందే గిట్టుబాటు ధరలను ప్రకటిస్తాం. ప్రతిరోజూ సీఎంయాప్‌ ద్వారా వ్యవసాయ పరిస్థితులను అప్‌డేట్‌ చేస్తారు. ఆర్‌బీకేల పర్యవేక్షణకు ప్రతి జిల్లాకు జాయింట్‌ కలెక్టర్ నియమించాం‌. 

వచ్చేఏడాది చివరికల్లా జనతా బజార్లు
వచ్చేఏడాది చివరికల్లా గ్రామాల్లో జనతా బజార్లు ఏర్పాటు చేస్తాం. రైతులు పండించే 30శాతం పంటలను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది. ఆ పంటలను ప్రభుత్వం జనతా బజార్లలో విక్రయిస్తుంది. ఆర్‌బీకేలలో ల్యాబ్‌లు, కియోస్క్‌లు అందుబాటులో ఉంటాయి. రాష్ట్ర, జిల్లా, మండలస్థాయిలో వ్యవసాయ బోర్డులు ఏర్పాటు చేస్తాం. దళారీ వ్యవస్థను తొలగించేందుకు ఆర్‌బీకేల ద్వారా విప్లవాత్మక మార్పులుతీసుకువచ్చాం.

అప్పుడే 2రాష్ట్రాలకు సమన్యాయం
రివర్స్‌ టెండరింగ్‌ ద్వారా జలవనరుల శాఖలో రూ.1,095 కోట్లు ఆదా చేశాం. ప్రాధాన్యతక్రమంలో సాగునీటి ప్రాజెక్ట్‌లను పూర్తి చేస్తాం. 2021 చివరికల్లా పోలవరం ప్రాజెక్ట్‌ను పూర్తి చేస్తాం. రాయలసీమ కరువు నివారణ కోసం తెస్తున్న ప్రాజెక్ట్‌లపై వివాదాలు సృష్టిస్తున్నారు. చంద్రబాబుతోనే కాదు.. ఈనాడు, ఏబీఎన్‌, టీవీ-5 వంటి, చెడిపోయిన వ్యవస్థలపై కూడా యుద్ధం చేస్తున్నాం. 881 అడుగులు ఉన్నప్పుడే 44 వేల క్యూసెక్కులు తీసుకోగలం. 854 అడుగుల్లో ఉంటే కేవలం 7వేల క్యూసెక్కులు మాత్రమే తీసుకోగలం. ఇలాంటి పరిస్థితుల్లో రాయలసీమ కరువు ఎలా తీర్చాలి? 800 అడుగుల నీటిమట్టం ఉన్నప్పుడు తెలంగాణ నీళ్లు తీసుకెళ్తోంది. అదే 800 అడుగుల వద్ద మాకు కేటాయించిన నీళ్లను తీసుకుంటాం. ఇలా తీసుకోవడం ఎవరికీ నష్టం కాదు. అప్పుడే రెండు రాష్ట్రాలకు సమన్యాయం జరుగుతుంది. దశాబ్ధకాలంలో ఎన్నడూ లేనంతగా ఈ ఏడాది ఆహారధాన్యాల దిగుబడి పెరిగింది. ఏడాదికాలంలో ఆహారధాన్యాల దిగుబడి 150 లక్షల నుంచి మెట్రిక్‌ టన్నుల నుంచి 172 లక్షల మెట్రిక్‌ టన్నులకు పెరిగింది అని వైఎస్‌ జగన్‌ పేర్కొన్నారు. ఈ సదస్సుకు వ్యవసాయ, సహకార శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి పూనం మాలకొండయ్య సమన్వయ కార్యదర్శిగా వ్యవహరించారు.

మరిన్ని వార్తలు