టీచర్ల పై ఉక్కుపాదం

19 Sep, 2018 04:09 IST|Sakshi
మహిళా ఉద్యోగులను వ్యాన్‌లో తరలిస్తున్న పోలీసులు, విజయవాడ లెనిన్‌ సెంటర్‌ వద్ద ఉద్యోగులను బలవంతంగా ఎత్తుకెళ్తున్న పోలీసులు

ఉపాధ్యాయుల ‘చలో అసెంబ్లీ’ని భగ్నం చేసేందుకు సర్కారు కుట్ర

ఎక్కడికక్కడ టీచర్లను అదుపులోకి తీసుకున్న పోలీసులు 

ఒక్క రోజులోనే 25 వేల మందికి పైగా టీచర్ల నిర్బంధం 

రాజధానికి తరలివచ్చిన వేలాది మంది ఉపాధ్యాయులు 

మహిళా టీచర్లను ఈడ్చిపారేసిన పోలీసులు.. స్టేషన్‌కు తరలింపు 

నిరసనలో పాల్గొనడానికి వచ్చిన పీడీఎఫ్‌ ఎమ్మెల్సీల అరెస్ట్‌

ప్రభుత్వానికి రోజులు దగ్గరపడ్డాయని ఉపాధ్యాయుల హెచ్చరిక 

సీపీఎస్‌ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్‌ 

టీచర్ల అరెస్ట్‌ను తీవ్రంగా ఖండించిన విపక్ష నేత వైఎస్‌ జగన్‌

నిరసనకారులకు సంఘీభావం తెలిపిన వైఎస్సార్‌సీపీ నేతలు

సాక్షి, అమరావతి బ్యూరో/గుంటూరు ఎడ్యుకేషన్‌: న్యాయం కోసం గొంతెత్తితే.. హక్కుల కోసం నినదిస్తే రాష్ట్ర ప్రభుత్వం అత్యంత పాశవికంగా వ్యవహరిస్తోంది. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రభుత్వ విధానాలు నచ్చకపోతే ప్రజలు శాంతియుతంగా నిరసన తెలపొచ్చంటూ సాక్షాత్తూ రాజ్యాంగం కల్పించిన అవకాశాన్ని తెలుగుదేశం సర్కారు కర్కశంగా కాలరాస్తోంది. తమకు తీరిన నష్టం కలిగిస్తున్న కాంట్రిబ్యూటరీ పెన్షన్‌ స్కీమ్‌(సీపీఎస్‌)ను రద్దు చేయాలని కోరుతూ ఉపాధ్యాయులు మంగళవారం తలపెట్టిన ‘చలో అసెంబ్లీ’ని భగ్నం చేసేందుకు ప్రభుత్వం పోలీసు బలగా లను ప్రయోగించింది. ఈ కార్యక్రమానికి తరలి వస్తున్న వేలాది మంది టీచర్లపై ఉక్కుపాదం మోపింది. ఎక్కడికక్కడ అదుపులోకి తీసుకుని సమీపంలోని పోలీసు స్టేషన్లలో నిర్బంధించింది. విజయవాడలో శాంతియుతంగా నిరసన తెలుపుతున్న మహిళా ఉపాధ్యాయులపై సర్కారు రాక్షసత్వం ప్రదర్శించడం గమనార్హం. టీడీపీ సర్కారు అప్రజాస్వామిక వైఖరిపై ఉపాధ్యాయులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయని హెచ్చరించారు. 

10,000 మంది టీచర్ల నిర్బంధం 
ఉద్యోగ విరమణ తరువాత జీవితానికి ఎలాంటి భరోసా కల్పించని సీపీఎస్‌ను రద్దు చేయాలన్న ఏకైక డిమాండ్‌తో ఉద్యోగులు, ఉపాధ్యాయులు గతంలో పలుమార్లు ఆందోళనలు, ధర్నాలు, రాష్ట్రవ్యాప్తంగా ప్రచార జాతాలు నిర్వహించారు. సీపీఎస్‌ రద్దు కోసం ఇప్పటికే ఎన్నో రూపాల్లో ఉద్యమించారు. అయినా ప్రభుత్వం దిగిరాకపో వడంతో మంగళవారం ‘చలో అసెంబ్లీ’కి ఐక్య ఉపాధ్యాయ సంఘం ఫ్యాప్టో పిలుపునిచ్చింది. ఈ కార్యక్రమాన్ని ఎలాగైనా విఫలం చేయాలని ప్రభుత్వం వ్యూహం పన్నింది. అసెంబ్లీకి తరలివస్తున్న టీచర్లను సర్కారు ఆదేశాల మేరకు పోలీసులు ముందుగానే అదుపులోకి తీసుకున్నారు. బస్‌స్టేషన్లు, రైల్వేస్టేషన్లలో మోహరించి, ఎక్కడికక్కడ ఉపాధ్యాయులను అరెస్టు చేశారు.

రాష్ట్రవ్యాప్తంగా రెండు రోజుల్లో అనధికారికంగా 10,000 మందిని నిర్బంధించినట్లు సమాచారం. కొన్నిచోట్ల పోలీసు వలయాలను ఛేదించుకుని వేలాది మంది విజయవాడకు చేరుకున్నారు. వీరంతా అసెంబ్లీ వైపు వెళ్లకుండా ప్రకాశం బ్యారేజీ, కృష్ణా కరకట్ట వద్ద పోలీసులు అడ్డుకున్నారు. అనంతరం టీచర్లు విజయవాడలోని లెనిన్‌ సెంటర్‌కు చేరుకున్నారు. అక్కడ వందలాది మంది పోలీసులు మోహరించి భయానక వాతావరణం సృష్టించారు. నిరసన తెలుపుతున్న టీచర్లను లాక్కెళ్లి వ్యాన్‌లో పడేశారు. మహిళా ఉపాధ్యాయులను బలవంతంగా ఈడ్చిపారేశారు. నిరసనకారులను నగరంలోని పలు పోలీసు స్టేషన్లకు తరలించారు. దీంతో ఉపాధ్యాయులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వారికి ప్రతిపక్ష వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ, వామపక్షాలు, జనసేన, కాంగ్రెస్, ఆమ్‌ఆద్మీపార్టీల నేతలు మద్దతు ప్రకటించారు. ఉపాధ్యాయులను రాజధాని వరకు ఎలా రానిచ్చారంటూ పోలీస్‌ ఉన్నతాధికారులపై ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. 

పీడీఎఫ్‌ ఎమ్మెల్సీల అరెస్ట్‌ 
ఉపాధ్యాయులను అక్రమంగా అరెస్ట్‌ చేస్తున్నారని తెలియడంతో పీడీఎఫ్‌ ఎమ్మెల్సీలు విఠపు బాలసుబ్రహ్మణ్యం, కత్తి నరసింహారెడ్డి, బొడ్డు నాగేశ్వరరావు లెనిన్‌ సెంటర్‌కు చేరుకున్నారు. ఉపాధ్యాయులతో మాట్లాడేందుకు ప్రయత్నించిన ఎమ్మెల్సీలను సైతం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న టీచర్లను అరెస్ట్‌ చేయడం ఏమిటని ఎమ్మెల్సీలు మండిపడ్డారు. ఉపాధ్యాయులను ఉగ్రవాదుల్లా చూస్తున్నారని ధ్వజమెత్తారు. సీపీఎస్‌ రద్దుపై శాసన మండలిలో తాము ఎంతగా నిలదీసినప్పటికి ప్రభుత్వం తన వైఖరి ప్రకటించడం లేదని ఆరోపించారు. 

వైఎస్సార్‌సీపీ నేతల సంఘీభావం  
వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ట్రేడ్‌ యూనియన్‌ రాష్ట్ర అధ్యక్షుడు పి.గౌతంరెడ్డి గవర్నర్‌పేట పోలీస్‌ స్టేషన్‌లో అరెస్టయిన టీచర్లకు సంఘీభావం తెలిపారు. ఉద్యోగ, ఉపాధ్యాయుల పట్ల ప్రభుత్వ దమనకాండ సాగిస్తోందని ఆరోపించారు. పింఛన్‌ అడిగిన టీచర్లపై అక్రమ కేసులు బనాయించడం దురదృష్టకరమని అన్నారు. అధికారంలోకి రాగానే సీపీఎస్‌ను రద్దు చేస్తూ ఫైల్‌పై సంతకం చేస్తానని ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఇప్పటికే హామీ ఇచ్చారని గౌతంరెడ్డి గుర్తుచేశారు. టీచర్ల అక్రమ అరెస్ట్‌లను విజయవాడ సెంట్రల్‌ నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త మల్లాది విష్ణు ఖండించారు. ప్రజాస్వామ్యయుతంగా నిరసన తెలుపుతున్న వారిని నిర్బంధించడం దారుణమని విమర్శించారు. 

కమిటీల పేరుతో సర్కారు కాలయాపన  
‘‘చలో అసెంబ్లీ కార్యక్రమానికి తరలివస్తున్న ఉపాధ్యాయులను అరెస్ట్‌ చేయడం టీడీపీ ప్రభుత్వ దమన నీతికి నిదర్శనం. విజయవాడలో మహిళా టీచర్లను పోలీసులు ఈడ్చుకెళ్లడం దారుణం. ప్రజాస్వామ్య వ్యవస్థలో చర్చలతోనే సమస్యలు పరిష్కారమవుతాయి. ప్రభుత్వం ఆ దిశగా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. సీపీఎస్‌ రద్దుపై టీడీపీ ప్రభుత్వం లేఖలు, కమిటీల పేరుతో కాలయాపన చేయాలని చూస్తోంది. అసెంబ్లీ ఆఖరి రోజున చర్చిస్తామంటోంది. కేవలం ఒక్క రోజులో ఏం చర్చిస్తారు? సీపీఎస్‌ రద్దుపై అసెంబ్లీ, శాసన మండలిలో తీర్మానం చేసి, కేంద్ర ప్రభుత్వానికి పంపించాలి. సీపీఎస్‌కు సంబంధించిన జీవోలను వెంటనే రద్దు చేయాలి. సీపీఎస్‌ రద్దు కోసం ఎంతవరకైనా పోరాడుతాం’’ 
– బాబురెడ్డి, చైర్మన్, ఏపీ ఫ్యాప్టో 

పింఛన్‌ భిక్ష కాదు.. మా హక్కు 
‘‘అధికారంలోకి రాగానే సీపీఎస్‌ను రద్దు చేస్తామని ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేసిన ప్రకటనను స్వాగతిస్తున్నాం. ప్రస్తుతం అధికారంలో ఉన్న టీడీపీ మాత్రం తన వైఖరి ఏమిటో వెల్లడించలేదు. సీపీఎస్‌ను రద్దు చేస్తూ అసెంబ్లీలో వెంటనే తీర్మానం చేయాలి. ఐదేళ్లు ఎమ్మెల్యేగా పనిచేసిన వారికే పింఛన్‌ ఇస్తుంటే, 30 ఏళ్లపాటు పిల్లలకు పాఠాలు చెప్పే టీచర్లు పింఛన్‌ కోరడం తప్పా? పింఛన్‌ భిక్ష కాదు.. అది మా హక్కు. సుప్రీంకోర్టు మొట్టికాయలు వేసినా టీడీపీ ప్రభుత్వాలకు బుద్ధి రాకపోవడం శోచనీయం’’ 
– ఎన్‌.రఘురామిరెడ్డి, ఏపీటీఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షులు 

అరెస్ట్‌లు అప్రజాస్వామికం 
‘‘ఉపాధ్యాయులను అరెస్ట్‌ చేయడం అప్రజాస్వామికం. పింఛన్‌ ఇవ్వాలని కోరడం నేరమా? వచ్చే ఎన్నికల్లో టీడీపీ ప్రభుత్వం ప్రజాగ్రహానికి గురికాక తప్పదు. సీపీఎస్‌ను రద్దు చేసేవారికే మా మద్దతు ఉంటుంది. సీపీఎస్‌ రద్దుపై ప్రభుత్వం వెంటనే తన నిర్ణయాన్ని ప్రకటించాలి’’ 
– షేక్‌ సాబ్జీ, యూటీఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షులు 

మాట తప్పిన ముఖ్యమంత్రి 
‘‘సీపీఎస్‌ రద్దుపై గతంలో హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పుడు మాట తప్పారు. గతంలో కేబినెట్‌ సమావేశంలో అజెండాగా పెట్టి, చర్చించకుండా దాట వేశారు. అసెంబ్లీలో తీర్మానం చేయకుండా ప్రభుత్వం వెనుకడుగు వేస్తోంది. సీపీఎస్‌ రద్దుపై తక్షణమే నిర్ణయం తీసుకోకపోతే సర్కారు తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది’’
– సీహెచ్‌ జోసఫ్‌ సుధీర్‌బాబు, రాష్ట్ర సెక్రటరీ జనరల్, ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక వర్గాల జేఏసీ  

అసెంబ్లీ చుట్టూ పోలీసు కవచం  
ఉపాధ్యాయ సంఘాలు తలపెట్టిన ‘చలో అసెంబ్లీ’ నేపథ్యంలో పోలీసులు అసెంబ్లీ వద్ద, పరిసర ప్రాంతాల్లో భారీగా మోహరించారు. శాసనసభకు వచ్చే అన్ని మార్గాలను తమ గుప్పెట్లోకి తీసుకున్నారు. ప్రతి వంద మీటర్లకు ఒక కానిస్టేబుల్‌తో పహారా నిర్వహించారు. ప్రకాశం బ్యారేజీ నుంచి వెలగపూడిలోని తాత్కాలిక సచివాలయం వరకూ చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు. స్కూల్‌ బస్సులు, ఆటోలు, ప్రైవేట్‌ వాహనాలు, ఆర్టీసీ బస్సులు, కార్లు... ఇలా ప్రతి ఒక్క వాహనాన్ని జల్లెడ పట్టారు.

అనుమానం వచ్చిన వారిని వెంటనే అదుపులోకి తీసుకుని సమీప పోలీస్‌ స్టేషన్లకు తరలించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపాధ్యాయులు అసెంబ్లీ దాకా చేరుకోకుండా చక్రబంధాన్ని ఏర్పాటు చేశారు. అసెంబ్లీ చుట్టుపక్కల పోలీసులు పికెటింగ్‌ ఏర్పాటు చేశారు. ప్రకాశం బ్యారేజీ, కృష్ణా కరకట్ట, రాజధాని గ్రామం మందడం, ఉండవల్లి సెంటర్, ఉండవల్లి గుహల వద్ద భారీ సంఖ్యలో పోలీసులు బందోబస్తుగా ఉన్నారు. ప్రకాశం బ్యారేజీ నుంచి తాత్కాలిక సచివాలయానికి వెళ్లే మార్గంలో వాహనాల రాకపోకలకు అనుమతి ఇవ్వకపోవడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. విజయవాడ, గుంటూరు నగరాల నుంచి అసెంబ్లీ మీదుగా అమరావతి గుడికి వెళ్లే ఆర్టీసీ బస్సులపై డేగ కళ్లతో నిఘా ఉంచారు. 

>
మరిన్ని వార్తలు