సింగపూర్‌కే సర్వ హక్కులు

8 Jun, 2018 04:12 IST|Sakshi

రాజధానిలో రైతుల భూములు తనఖా పెట్టి రుణం తీసుకోవచ్చు

అభివృద్ధి చేసిన భూమిని విక్రయించుకోవచ్చు

15 ఏళ్ల కాలపరిమితి కలిగిన ప్రాజెక్టుకు 20 ఏళ్ల దాకా రాయితీలు

సింగపూర్‌ కంపెనీలతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందాలు

సీఎం చంద్రబాబు, సింగపూర్‌ మంత్రి ఈశ్వరన్‌ సమక్షంలో సంతకాలు

సాక్షి, అమరావతి: రాజధాని స్టార్టప్‌ ఏరియా ప్రాజెక్టుపై సర్వ హక్కులను రాష్ట్ర ప్రభుత్వం సింగపూర్‌ సంస్థలకు కట్టబెట్టింది. రైతుల నుంచి ఉచితంగా సేకరించిన భూమిని బ్యాంకుల్లో తనఖా పెట్టి రుణాలు తీసుకునే అవకాశంతో పాటు నచ్చినవారికి వేలం లేదా సంప్రదింపుల ద్వారా విక్రయించుకునే హక్కులను సింగపూర్‌ కంపెనీలకు కల్పించింది.

ఈమేరకు సీఎం చంద్రబాబు, సింగపూర్‌ వాణిజ్యశాఖ మంత్రి ఎస్‌.ఈశ్వరన్‌ సమక్షంలో ఇరుపక్షాలు గురువారం సంతకాలు చేశాయి.స్టార్టప్‌ ఏరియా కింద అభివృద్ధి చేసే 1,691 ఎకరాలను ఎలాంటి ఆక్రమణలు లేకుండా చదును చేసి ఒప్పందం చేసుకున్న 12 నెలల్లోగా రాష్ట్ర ప్రభుత్వం అమరావతి డెవలప్‌మెంట్‌ పార్టనర్స్‌ (ఏడీపీ)కి అప్పగించాల్సి ఉంటుందని సెంబ్‌కార్ప్, అసెండాస్‌–సింగ్‌బ్రిడ్జ్‌లు సంయుక్తంగా విడుదల చేసిన ప్రకటనలో స్పష్టం చేశాయి.

ఇలా అప్పచెప్పిన భూమిని అభివృద్ధి చేసి, ప్లాట్లుగా విభజించి ఇతరులకు విక్రయించనున్నట్లు ఆ కంపెనీలు పేర్కొన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఖాళీ స్థలం ఇవ్వాలంటే ఆ 1,691 ఎకరాల్లో ఉన్న మసీదులు, గుడులు, చర్చిలు, శ్మశానాలు కూల్చి, చదును చేసి  భూములను ఏడీపీకి దఖలు చేయాల్సి ఉంటుందని అధికారులు స్పష్టం చేస్తున్నారు.

రైతులు ఉచితంగా ఇచ్చిన భూములను తనఖా పెట్టుకోండి
రాజధాని కోర్‌ క్యాపిటల్‌ను అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సింగపూర్‌ కంపెనీలతో భాగస్వామ్య ఒప్పందంతోపాటు రాయితీలు, అభివృద్ధి ఒప్పందాన్ని కుదుర్చుకుంది.  సింగపూర్‌కు చెందిన కంపెనీలు అసెండాస్, సెంబ్‌కార్ప్‌లు సంయుక్తంగా ఏర్పాటు చేసిన సింగపూర్‌ అమరావతి ఇన్వెస్ట్‌మెంట్‌ హోల్డింగ్స్‌కు 58 శాతం వాటా, రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన అమరావతి డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ (ఏడీసీ)కు 42 శాతం వాటా ఉండేలా అమరావతి డెవలప్‌మెంట్‌ పార్టనర్స్‌ పేరుతో భాగస్వామ్య సంస్థను ఏర్పాటు చేస్తూ ఒప్పందం కుదుర్చుకున్నారు.

ఇందులో భాగంగా సింగపూర్‌ కంపెనీలు రూ. 306 కోట్లు, ఏడీసీ రూ. 222 కోట్లు ఈక్విటీని సమకూర్చనున్నాయి. ఏడీపీ కంపెనీ బోర్డులో సింగపూర్‌కు చెందిన నలుగురు, రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇద్దరు బోర్డు  సభ్యులుగా ఉంటారు. ఇక రాయితీలు, అభివృద్ధి ఒప్పందం విషయానికి వస్తే 15 ఏళ్లలో మూడు దశల్లో 1,691 ఎకరాలను అభివృద్ధి చేయాల్సి ఉంటుంది. మొదటి దశలో 656 ఎకరాలను అభివృద్ధి చేస్తారు. ప్రాజెక్టు అభివృద్ధికి కావాల్సిన నిధుల కోసం ఈ భూములను తనఖా పెట్టుకొని మరీ రుణాలు తీసుకునే హక్కును కూడా కల్పించారు.

అంతేకాదు అభివృద్ధి చేసిన భూములను వేలం లేదా సంప్రదింపులు ద్వారా విక్రయించుకోవచ్చు. ఇలా అభివృద్ధి చేసిన భూమిలో కనీసం 70 శాతం అమ్మిన తర్వాతనే రెండో దశ మొదలు పెట్టాల్సి ఉంటుంది. ఈ ప్రాజెక్టును పూర్తి చేయడానికి 15 ఏళ్ల కాలపరిమితిని నిర్ణయిస్తే రాయితీలు మాత్రం 20 ఏళ్లు కల్పించడం గమనార్హం. ఏడీపీకి ఇచ్చే వివిధ రాయితీ వివరాలను మాత్రం ప్రభుత్వం బయటపెట్టలేదు.

2020 నాటికి అసెంబ్లీ, హైకోర్టు: సీఎం చంద్రబాబు
ఈ ఒప్పందం వివరాలను తెలియచేయడానికి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ అంతర్జాతీయ ప్రమాణాలతో రాజధాని నగరాన్ని నిర్మించడం ద్వారా భారీ పెట్టుబడులను ఆకర్షించడమే కాకుండా సంపద సృష్టించాలన్నది తమ లక్ష్యమన్నారు. 2020 కల్లా హైకోర్టు, అసెంబ్లీ భవనాలు పూర్తవుతాయన్న నమ్మకాన్ని ఆయన వ్యక్తం చేశారు.

అమరావతికి విమాన సర్వీసులు నడపడానికి సింగపూర్‌ ఎయిర్‌లైన్స్‌ సంసిద్ధత వ్యక్తం చేసిందని, నెల రోజుల్లో ఈ సర్వీసులు ప్రారంభం కావచ్చన్నారు. త్వరలో సింగపూర్‌లో జరిగే వరల్డ్‌ సిటీ సమ్మిట్‌లో అమరావతి గురించి వివరించనున్నట్లు ఈశ్వరన్‌ తెలిపారు. అంతకుముందు జరిగిన మూడో సంయుక్త అమలు పర్యవేక్షణ కమిటీ సమావేశంలో రాజధాని నిర్మాణం, ప్రణాళికలపై సుదీర్ఘంగా చర్చించారు.

>
మరిన్ని వార్తలు