కాపులకు రిక్త హస్తమే!

11 Mar, 2019 05:06 IST|Sakshi

వేల మందికి సబ్సిడీ రుణాలు ఇవ్వని వైనం

ఎన్నికల వేళ సబ్సిడీ రిలీజ్‌ చేశామంటున్న కార్పొరేషన్‌

పైసా కూడా ఫైనాన్స్‌ నుంచి విడుదల కాని సబ్సిడీ 

సాక్షి, అమరావతి: కాపులను రాష్ట్ర ప్రభుత్వం మరోమారు మోసం చేసింది. సబ్సిడీ రుణాలు అంటూ వారాల తరబడి తిప్పుకుని ఇప్పుడు అయోమయంలో పడేసింది. 2018–19 సంవత్సరానికి గాను ఇప్పటి వరకు ప్రకటించిన లక్ష్యంలో 10 శాతం మందికి (6,630) మాత్రమే రుణాలు ఇచ్చింది. గత ఐదు నెలల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా రుణాల కోసం దరఖాస్తులు చేసుకోవాలని అధికారులు పదేపదే చెప్పడంతో ఆన్‌లైన్‌ ద్వారా పెద్ద సంఖ్యలో దరఖాస్తులు చేసుకున్నారు. ఎంపీడీవో కార్యాలయాల వద్ద రెండు దఫాలుగా ఇంటర్వ్యూలు నిర్వహించారు. దరఖాస్తులు చేసుకునేందుకు వారం రోజులు పని మానుకోవాల్సి వచ్చింది. దరఖాస్తుకు కావాల్సిన సర్టిఫికెట్లు తెచ్చుకునేందుకు మరో వారం తిరగాల్సి వచ్చిందని లబ్ధిదారులు వాపోతున్నారు. ఇంత చేస్తే ఎంపిక చేసిన ఎంపీడీవోలు ఇప్పుడు పట్టించుకోవడం లేదని వారు వాపోతున్నారు. ఎన్నిసార్లు వెళ్లి అడిగినా నిధులు మంజూరు కాలేదు కాబట్టి తామేమీ చేయలేమని చేతులెత్తేస్తున్నారు.  

కాపుల జీవనోపాధి మెరుగుకు ఈ రుణాలు కార్పొరేషన్‌ ద్వారా ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. 2018–19 సంవత్సరానికి 68,787 మందికి రుణాలు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందుకోసం బడ్జెట్‌లో రూ.687.87 కోట్లు కేటాయించారు. అయితే మండల స్థాయిలో ఇంటర్వ్యూల అనంతరం కలెక్టర్లు రాష్ట్రంలో లక్ష్యానికి మించి 73,401 మందిని ఎంపిక చేశారు. వీరి కోసం రూ. 515.38 కోట్లు రుణాలు ఇచ్చేందుకు నిర్ణయించారు. ఈ మేరకు కాపు కార్పొరేషన్‌ 73,109 మందికి సబ్సిడీ విడుదల చేసింది. అయితే రుణాలు ఇచ్చింది మాత్రం కేవలం 6,636 మందికి రూ.49.27 కోట్లు మాత్రమే. అంటే ఇంకా 66,973 మందికి రుణాలు ఇవ్వలేదు. వీరందరు ఆశతో ఎదురు చూస్తున్నారు. అయితే వీరికి ఈ సంవత్సరం రుణాలు వచ్చే అవకాశాలు కనిపించడం లేదు. ఈరోజు నుంచి ఎన్నికల హడావుడి మొదలైంది. రుణాలు పంపిణీ చేసే పనిలో ఏ అధికారి కూడా ఉండే అవకాశాలు లేవు. ఎన్నికల కోసం శిక్షణ, డ్యూటీ అలాట్‌మెంట్‌ వంటి పనుల్లో బిజీగా ఉంటారు. అందువల్ల ఈ సంవత్సరం రుణాలు ఎగ్గొట్టినట్లేనని చెప్పవచ్చు.  

నిధులు విడుదల కావాల్సి ఉంది 
సబ్సిడీ రిలీజ్‌ చేశాం. త్వరలోనే నిధులు విడుదలయ్యే అవకాశం ఉంది. ఎంపికైన వారందరికీ రుణాలు పంపిణీ చేస్తాం. ఈనెల 15 నుంచి రుణాలు అందించే కార్యక్రమాన్ని ఆయా బ్యాంకులు చేపడతాయి. సబ్సిడీ నగదు నేరుగా బ్యాంకుల్లో జమవుతుంది. అందువల్ల బ్యాంకుల నుంచి రుణాలు పొందవచ్చు.  
– కోట్ల శివశంకర్‌రావు, ఎండీ, కాపు కార్పొరేషన్‌.  

మరిన్ని వార్తలు