రాబింగ్ హుడ్.. రాష్ట్ర ప్రభుత్వం!

27 Mar, 2015 01:10 IST|Sakshi
రాబింగ్ హుడ్.. రాష్ట్ర ప్రభుత్వం!

పేదలను దోచి పెద్దలకు పంచుతున్నారు
సామాన్యులపై వ్యాట్ భారం మోపడం అన్యాయం
అసెంబ్లీలో వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే అఖిలప్రియ ఆవేదన

 
హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం రాబింగ్ హుడ్‌లా వ్యవహరిస్తోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అఖిలప్రియ అసెంబ్లీలో ధ్వజమెత్తారు. ‘రాబిన్ హుడ్.. ధనవంతులను దోచుకుని, ఆ సంపదను పేదలకు పంచితే, ఏపీలో టీడీపీ సర్కారు మాత్రం రాబింగ్ హుడ్‌లా.. పేదలను దోచి పెద్దలకు పంచిపెడుతోంది’ అని ఆమె విమర్శించారు. వ్యాట్ సవరణ బిల్లు సందర్భంగా గురువారం సభలో ఆమె మాట్లాడారు. ప్రపంచ వ్యాప్తంగా క్రూడాయిల్ ధరలు తగ్గాయని, కానీ రాష్ట్ర ప్రజలకు మాత్రం ఈ తగ్గుదల ఫలితం దక్కడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వ్యాట్ రూపంలో ప్రభుత్వం పన్నులు పెంచడమే ఇందుకు కారణమన్నారు. నిత్యావసరాల ధరలు పెరిగి ప్రజల జీవన ప్రమాణాలు ఇప్పటికే అడుగంటాయని, దీనికితోడు విద్యుత్ చార్జీల పెంపు, వ్యాట్ భారం ప్రజలపై వేశారని ఆందోళన వ్యక్తం చేశారు.డీజిల్ ఇంజన్లపై ఆధారపడి వ్యవసాయం చేసే రైతులకు ఈ భారం మోయలేదన్నారు. ఇతర రాష్ట్రాల్లో ఎక్కడా ఈ మాదిరిగా పెంచలేదని సభ దృష్టికి తెచ్చారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం కేంద్రంపై ఒత్తిడి తేవాలని, ఈ విషయంలో అధికార పక్షంతో  తాము కూడా ఢిల్లీకి వస్తామని తెలిపారు. అఖిల ప్రియ ప్రసంగం కొనసాగుతుండగానే సభా వ్యవహారాల మంత్రి యనమల రామకృష్ణుడు అడ్డుపడ్డారు. వ్యాట్ సవరణ బిల్లు ఆమోదం పొందిన తర్వాత తిరిగి దీనిపై మాట్లాడడం సరికాదని పాయింట్ ఆఫ్ ఆర్డర్ లేవనెత్తడంతో స్పీకర్ మైకు నిలిపివేశారు.
 
చర్చ లేకుండానే బిల్లులకు పచ్చజెండా

వ్యాట్, కార్మికచట్ట సవరణ బిల్లులపై విపక్షం మాట్లాడేందుకు స్పీకర్ అంగీకరించినా, ప్రభుత్వం అడ్డుచెప్పింది. దీనిపై విపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అభ్యంతరం తెలిపారు. మధ్యాహ్నం 12.30 గంటలకు తిరిగి సమావేశమైన సభలో పలు సవరణ బిల్లులను ప్రభుత్వం ప్రవేశ పెట్టింది. ఒకదాని వెంట ఒకటి మెరుపు వేగంతో అనుమతించారు. ఈ క్రమంలో వ్యాట్, కార్మిక చట్ట సవరణ బిల్లులపై తమ వాదన వినిపించాల్సి ఉందని అనుమతించాలని విపక్ష నేత కోరారు. దీనికి స్పీకర్ అనుమతించారు. కార్మిక సవరణ చట్ట బిల్లుపై బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి మాట్లాడారు. ఆ తర్వాత వ్యాట్‌పై అఖిలప్రియ మాట్లాడుతున్నప్పుడు యనమల అభ్యంతరం లేవనెత్తారు. స్పీకర్ అనుమతితోనే తమ పార్టీ సభ్యులు మాట్లాడుతున్నారని జగన్ తెలిపారు. అయినప్పటికీ దీన్ని అనుమతించడానికి ప్రభుత్వం సిద్ధంగా లేదని యనమల అనడంతో స్పీకర్ ఆ వాదననే సమర్థించారు. దీంతో అఖిలప్రియ ప్రసంగం మధ్యలోనే ఆగిపోయింది.
 

మరిన్ని వార్తలు