కేటాయింపు బారెడు.. వ్యయం మూరెడు

10 Mar, 2018 03:26 IST|Sakshi

సాక్షి, అమరావతి: పేదలు, రైతులు, పారిశ్రామిక రంగాలకు చెందిన ఆస్తుల కల్పన వ్యయంలో భారీగా కోతలు పెట్టిన రాష్ట్ర ప్రభుత్వం.. మరోవైపు కమీషన్లు దండుకునే సాగునీటి రంగ వ్యయాన్ని మాత్రం భారీగా పెంచేసింది. అంతే కాకుండా గ్రామీణాభివృద్ధి, సంక్షేమం, యువత, వైద్య రంగాల కేటాయింపుల్లోనూ కోతలు విధించింది. 2017–18 ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌ కేటాయింపులు, సవరించిన అంచనాల్లో ఈ విషయం వెల్లడైంది. బడ్జెట్‌ కేటాయింపులకు, వాస్తవ వ్యయానికి పొంతన లేని విషయం దీంతో స్పష్టమైంది. ప్రధానంగా క్యాపిటల్‌ వ్యయంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమానికి సంబంధించి కేటాయింపులను సవరించిన అంచనాల్లో భారీగా తగ్గించేసింది.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం క్యాపిటల్‌ పద్దులో ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల సంక్షేమానికి సంబంధించిన ఆస్తుల కల్పన కోసం 1,126.92 కోట్ల రూపాయలను  కేటాయించగా.. సవరించిన అంచనాల్లో రూ.742 కోట్లకే పరిమితం చేశారు. అలాగే రైతులకు సంబంధించి వ్యవసాయ అనుబంధ రంగాలకు క్యాపిటల్‌ పద్దులో రూ.300.53 కోట్లు కేటాయించగా.. సవరించిన అంచనాల్లో రూ.226.47 కోట్లకు కుదించారు. పారిశ్రామిక రంగానికి క్యాపిటల్‌ పద్దులో రూ.383.01 కోట్లు కేటాయించగా.. సవరించిన అంచనాల్లో రూ.71.01 కోట్లకే పరిమితం చేశారు. అలాగే రవాణా రంగంలో సవరించిన అంచనాల్లోనూ రూ.200 కోట్లకు పైగా కోత పెట్టారు. ఇతర రంగాలకు క్యాపిటల్‌ పద్దులో రూ.818 కోట్లను కోత పెట్టారు.

క్యాపిటల్, రెవెన్యూ పద్దులు కలిపి సంక్షేమ రంగానికి సవరించిన అంచనాల్లో రూ.652 కోట్లు కోత విధించారు. అలాగే క్యాపిటల్, రెవెన్యూ పద్దుల్లో కలిపి పట్టణాభివృద్ధి రంగానికి సవరించిన అంచనాల్లో కేటాయింపులను బాగా తగ్గించేశారు. గ్రామీణాభివృద్ధి, ఇంధన, పరిశ్రమలు, రవాణా, సాధారణ విద్య, యువజన, క్రీడలు, సాంకేతిక విద్య, వైద్య, కుటుంబ సంక్షేమం తదితర రంగాల కేటాయింపుల్లోనూ సవరించిన అంచనాల్లో కోతలు విధించారు. మరోపక్క సాగునీటి పనుల అంచనాలతో పాటు బడ్జెట్‌ కేటాయింపులను కూడా భారీగా పెంచేశారు. ప్రభుత్వ పెద్దలకు కమీషన్ల రూపంలో ఈ రంగం నుంచి భారీగా ప్రయోజనం కలుగుతున్నందునే ఈ రంగానికి కేటాయింపులు, సవరించిన అంచనాల్లో రూ.2వేల కోట్ల మేర పెంచేశారని, మిగతా రంగాల నుంచి కమీషన్లు రానందునే ఆ రంగాల్లో కోతలు విధించారని అధికార వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి.

మరిన్ని వార్తలు