ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ మంజూరు జీవో జారీ

27 Oct, 2013 00:41 IST|Sakshi

జూలై నుంచి 8.56 శాతం అదనంగా వర్తింపు
 సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు జూలై నుంచి వర్తించేలా 8.56 శాతం కరువు భత్యాన్ని మంజూరు చేస్తూ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫైలుపై సీఎం శనివారం సంతకం చేయడంతో.. ఆర్థిక శాఖ జీవో కూడా జారీ చేసింది. ఈ పెంపుతో ఉద్యోగుల కరువు భత్యం 54.784 శాతం నుంచి 63.344 శాతానికి పెరిగింది. పెంచిన కరువు భత్యాన్ని అక్టోబర్ నుంచి నగదు రూపంలో.. అంటే నవంబర్ 1 నుంచి వేతనాలతో కలిపి చెల్లిస్తారు. జూలై నుంచి సెప్టెంబర్ వరకు చెల్లించాల్సిన డీఏ బకాయిని ఉద్యోగుల సాధారణ భవిష్య నిధికి జమ చేస్తారు.
 
  ప్రభుత్వ ఉద్యోగులతో పాటు జిల్లా పరిషత్, మండల పరిషత్, గ్రామ పంచాయతీ, మున్సిపాలిటీ, మున్సిపల్ కార్పొరేషన్, వ్యవసాయ మార్కెట్ కమిటీలు, జిల్లా గ్రంథాలయ సమితి ఉద్యోగులతో పాటు పెన్షనర్లకు ఈ కరువు భత్యం పెంపు వర్తిస్తుంది. ఈ పెంపు వల్ల నెలకు రూ. 199.16 కోట్ల చొప్పున ఖజానాపై ఏడాదికి రూ. 2,396.22 కోట్ల భారం పడనుంది. అయితే, మంత్రివర్గ సమావేశం ఆమోదంతో సంబంధం లేకుం డా కరువు భత్యం మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేయాలని సీఎం ఆదేశించడంతో.. ఆర్థిక శాఖ జీవో జారీ చేసింది. భవిష్యత్‌లో జరిగే మంత్రివర్గ సమావేశంలో దీనిపై ఆ మోదం పొందనున్నారు. పార్ట్ టైం అసిస్టెంట్లు, గ్రామ రెవెన్యూ సహాయకులకు జూలై నుంచి నెలకు రూ. వంద చొప్పున వేతనం పెంచుతున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు