అవినీతి అంతానికే రివర్స్‌

21 Aug, 2019 03:52 IST|Sakshi

రద్దు చేసిన కాంట్రాక్టు ఒప్పందం ప్రకారమే మిగిలిన పనుల అంచనా విలువ ఖరారు

కొత్త కాంట్రాక్టర్‌ను ఎంపిక చేసి నవంబర్‌ 1 నుంచే పనులు ప్రారంభం

2021 నాటికి పోలవరాన్ని పూర్తి చేసి ప్రజలకు ఫలాలు అందించాలని నిర్ణయం 

పీపీఏ సీఈవో ఆర్కే జైన్‌కు జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌ దాస్‌ లేఖ

సాక్షి, అమరావతి : పోలవరం ప్రాజెక్టు పనులను ప్రక్షాళన చేసి అవినీతిని నిర్మూలించేందుకే రివర్స్‌ టెండర్‌ నోటిఫికేషన్‌ జారీ చేశామని పోలవరం ప్రాజెక్టు అథారిటీ(పీపీఏ)కి రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. 2021 నాటికి ప్రాజెక్టును పూర్తి చేసి ఆ ఫలాలను ప్రజలకు ముందుగానే అందించడం కోసం మిగిలిన పనులను పారదర్శకంగా కొత్త కాంట్రాక్టు సంస్థకు అప్పగించడానికే రివర్స్‌ టెండర్‌ నిర్వహిస్తున్నామని తెలిపింది. ప్రస్తుతం రద్దు చేసిన కాంట్రాక్టు ఒప్పందం విలువ ఆధారంగా మిగిలిన పనుల విలువను ఖరారు చేసి దాన్నే అంతర్గత అంచనా విలువ (ఐబీఎం)గా నిర్ణయించి, రివర్స్‌ టెండర్‌ నిర్వహిస్తుండటం వల్ల అదనపు భారం పడదని తేల్చి చెప్పింది. టెండర్లపై ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తామని, ఈ ప్రక్రియ పూర్తయ్యే వరకూ వేచి చూడాలని కోరింది.

గోదావరికి వరదల వల్ల నవంబర్‌ వరకు ప్రాజెక్టు పనులు చేసేందుకు ఆస్కారం లేదని, సెప్టెంబరులోగా కొత్త కాంట్రాక్టర్‌ను ఖరారు చేసి నవంబర్‌ 1 నుంచి పనులు ప్రారంభిస్తామని, దీనివల్ల ఎక్కడా జాప్యం జరగదని పేర్కొంది. ఈ మేరకు రాష్ట్ర జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌ దాస్‌ సోమవారం పీపీఏ సీఈవో ఆర్కే జైన్‌కు లేఖ రాశారు. పోలవరం హెడ్‌వర్క్స్‌లో కాంట్రాక్టు ఒప్పందాలను ముందస్తుగా రద్దు చేయడం, మిగిలిన పనులకు రివర్స్‌ టెండర్‌ నిర్వహించడాన్ని నిలుపుదల చేయాలని కోరుతూ ఈనెల 16న ఆర్‌కే జైన్‌ రాసిన లేఖకు సమాధానంగా ఆదిత్యనాథ్‌దాస్‌ ఈ లేఖ రాశారు. అందులో పేర్కొన్న అంశాలు ఇవీ.. 

ఎన్నిసార్లు నోటీసులిచ్చినా...
‘‘పునర్విభజన చట్టం సెక్షన్‌ 90 ప్రకారం పోలవరాన్ని కేంద్ర ప్రభుత్వం జాతీయ ప్రాజెక్టుగా గుర్తించింది. ప్రాజెక్టును 2021 నాటికి పూర్తి చేయాలని కేంద్రం, ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వాలు నిర్ణయించాయి. వాస్తవంగా పోలవరం హెడ్‌వర్క్స్‌ను 2013 మార్చి 2న ట్రాన్స్‌ట్రాయ్‌–జేఎస్‌సీ–ఈసీ–యూఈఎస్‌(జేవీ)కి అప్పగిస్తూ (ఈపీసీ ఒప్పందం నెం:1, 2012–13) నాటి రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. దీని ప్రకారం 2018 మార్చి 1 నాటికి పనులు పూర్తి కావాల్సి ఉన్నా కాంట్రాక్టు సంస్థ విఫలమైంది. దీనిపై ఎన్నిసార్లు నోటీసులిచ్చినా ఫలితం లేదు.

అప్పటి నిర్ణయం మేరకే..
పోలవరం హెడ్‌వర్క్స్‌లో కొంత భాగం పనులను 60 సీ కింద తొలగించి వాటికి 2016–17 ధరలను వర్తింప చేస్తూ 2017 నవంబర్‌ 27న గత ప్రభుత్వం టెండర్‌ నోటిఫికేషన్‌ జారీ చేసింది. దీనిపై 2018 జనవరి 11న విజయవాడలో నిర్వహించిన పీపీఏ 7వ సమావేశంలో చర్చ కూడా జరిగింది. పనులను వేగంగా పూర్తి చేయడానికి ప్రస్తుత కాంట్రాక్టు ఒప్పంద విలువ ప్రకారం ఇతర కాంట్రాక్టర్లకు అప్పగించే వెసులుబాటు రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుందని ఆ సమావేశంలో పీపీఏ పేర్కొంది. ఆ తర్వాత ట్రాన్స్‌ట్రాయ్‌ నుంచి మిగిలిన పనులను 60 సీ కింద మూడు విడతలుగా విడదీసిన పనులను నవయుగకు, నాలుగో విడత పనులను బీకెమ్‌కు గత ప్రభుత్వం అప్పగించింది.

ఈ నేపథ్యంలో ఇంజనీరింగ్‌ పనులను అధ్యయనం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది జూన్‌ 14న నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. పోలవరంలో ఈపీసీ కాంట్రాక్టు ఒప్పందాన్ని రద్దు చేసుకోకుండా ఎల్‌ఎస్‌–ఓపెన్‌ విధానంలో నవయుగ, బీకెమ్‌లకు నామినేషన్‌ పద్ధతిలో పనులు అప్పగించడాన్ని  నిపుణుల కమిటీ తప్పుబట్టింది. ఇది నిబంధనలకు విరుద్ధమని తేల్చిచెప్పింది. రెండేళ్లలోగా ప్రాజెక్టు పూర్తి చేయాలంటే హెడ్‌వర్క్స్‌లో మిగిలిన పనులు, జలవిద్యుదుత్పత్తి కేంద్రం పనులకు ఒకే ప్యాకేజీ కింద రివర్స్‌ టెండర్‌ నిర్వహించి ఒకే సంస్థకు అప్పగించాలని సూచించింది. కుడి, ఎడమ కాలువ పనులను 60–సీ కింద విడదీసి నామినేషన్‌పై అప్పగిస్తూ చేసుకున్న ఒప్పందాలను కూడా రద్దు చేసి మిగిలిన పనులకు రివర్స్‌ టెండర్‌ నిర్వహించాలని కమిటీ పేర్కొంది. నిపుణుల కమిటీ సిఫార్సుల మేరకే నవయుగ, బీకెమ్‌లకు నోటీసులిచ్చాం. పారదర్శకంగా రివర్స్‌ టెండర్‌ నిర్వహణకు ఈనెల 16న మార్గదర్శకాలు జారీ చేశాం.

అదనపు భారం పడదు.. జాప్యం జరగదు
పోలవరం హెడ్‌వర్క్స్‌లో నవయుగ, బీకెమ్‌లతో కుదుర్చుకున్న ఒప్పందాలను ఈనెల 12న రద్దు చేశాం. ఇదే అంశాన్ని ఈనెల 13న హైదరాబాద్‌లో నిర్వహించిన పీపీఏ 10వ సమావేశంలో వివరించాం. కేంద్ర ప్రభుత్వం అభిప్రాయం తీసుకునే వరకు కాంట్రాక్టు ఒప్పందాలను ముందస్తుగా రద్దు చేయడం, మిగిలిన పనులకు రివర్స్‌ టెండర్‌ నిర్వహించడాన్ని నిలుపుదల చేయాలని సూచిస్తూ పీపీఏ సీఈవో ఈనెల 16న లేఖ రాశారు. గోదావరిలో అక్టోబర్‌ నాటికి వరదలు తగ్గుముఖం పడతాయి.

నవంబర్‌ 1 నుంచి పనులు ప్రారంభించి జూన్‌ వరకు శరవేగంగా చేయడం ద్వారా 2021 నాటికి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయాలని నిర్ణయించాం. అందుకే కొత్త కాంట్రాక్టర్‌ను ఎంపిక చేయడానికి ఈనెల 12న రివర్స్‌ టెండర్‌ నోటిఫికేషన్‌ జారీ చేశాం. రాష్ట్ర ప్రజలకు పోలవరం ఫలాలను సత్వరమే అందించాల్సిన అవసరం ఉంది. అందుకే కొత్త కాంట్రాక్టర్‌ ఎంపిక కోసం రివర్స్‌ టెండర్‌ నోటిఫికేషన్‌ జారీ చేశాం. రద్దు చేసిన ఒప్పంద విలువ ప్రకారం మిగిలిన పనుల అంచనా విలువను లెక్క కట్టి దాన్నే ఐబీఎంగా నిర్ణయించి రివర్స్‌ టెండర్‌ నిర్వహిస్తున్నాం. దీనివల్ల అదనపు భారం పడదు. నవంబర్‌ 1 నుంచి కొత్త కాంట్రాక్టర్‌తో పనులు ప్రారంభిస్తాం. ఇక పనుల్లో జాప్యం అన్న ప్రసక్తే ఉత్పన్నం కాదు’’  

మరిన్ని వార్తలు