‘పోలవరం’ లెక్కలు చెప్పాల్సిందే

24 Jan, 2019 03:14 IST|Sakshi

భూసేకరణ, సహాయ, పునరావాస ప్యాకేజీల వివరాలు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వానికి పీపీఏ లేఖ

వాటి ఆధారంగా క్షేత్ర స్థాయిలో తనిఖీలు చేస్తామని స్పష్టీకరణ

పోలవరం కుడి కాలువ భూసేకరణలో అక్రమాలపై పక్కా ఆధారాలు సేకరించిన పీపీఏ

పీపీఏ లేఖతో ఆందోళనలో రాష్ట్ర ప్రభుత్వం

ఎలాంటి వివరాలు ఇవ్వొద్దంటూ అధికారులపై ప్రభుత్వ పెద్దల ఒత్తిడి 

సాక్షి, అమరావతి: పోలవరం ప్రాజెక్టు భూసేకరణ, సహాయ, పునరావాస ప్యాకేజీ అమలులో అక్రమాలను నిగ్గుతేల్చేందుకు పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ) సిద్ధమైంది. ఇప్పటివరకూ పోలవరం జలాశయం.. కుడి, ఎడమ కాలువల పనుల కోసం సేకరించిన భూమి సర్వే నెంబర్లు, యజమాని పేరు, చెల్లించిన పరిహారం వివరాలు ఇవ్వాలని పీపీఏ సభ్య కార్యదర్శి డాక్టర్‌ ఆర్కే గుప్తా రాష్ట్ర ప్రభుత్వానికి, పోలవరం భూసేకరణ విభాగం స్పెషల్‌ కలెక్టర్‌ సీహెచ్‌ భానుప్రసాద్‌కు లేఖ రాశారు. ఇప్పటివరకూ పునరావాసం కల్పించిన నిర్వాసితులు, వ్యక్తిగతంగా వారికి పంపిణీ చేసిన పరిహారం, పునరావాస కాలనీల నిర్మాణం, మౌలిక సదుపాయాల కల్పన వంటి వాటికి చేసిన ఖర్చుల వివరాలు ఇవ్వాలని కోరారు. వివరాలు ఇస్తే అక్రమాలు గుట్టంతా రట్టు అవుతుందని ప్రభుత్వ పెద్దలు ఆందోళన చెందుతున్నారు. పీపీఏకు ఎలాంటి వివరాలు ఇవ్వొద్దంటూ తమపై ప్రభుత్వ పెద్దలు ఒత్తిడి చేస్తున్నారని పోలవరం భూసేకరణ విభాగం అధికారులు చెబుతుండటం గమనార్హం.

పోలవరం ప్రాజెక్టు అంచనా వ్యయం 2010–11 ధరల ప్రకారం.. రూ.16,010.45 కోట్లు. ఇందులో భూసేకరణ, సహాయ, పునరావాస ప్యాకేజీ వ్యయం.. రూ.2,934.42 కోట్లు. 2013–14 ధరల ప్రకారం.. ప్రాజెక్టు అంచనా వ్యయాన్ని రూ.57,940.86 కోట్లకు పెంచుతూ ఆగస్టు 17, 2017న రాష్ట్ర ప్రభుత్వం పీపీఏ ద్వారా కేంద్రానికి ప్రతిపాదనలు పంపింది. ఇందులో భూసేకరణ, సహాయ, పునరావాస ప్యాకేజీ వ్యయం.. రూ.33,225.74 కోట్లుగా రాష్ట్ర ప్రభుత్వం లెక్కగట్టింది. భూసేకరణ చట్టం 2013 ప్రకారం.. సేకరించిన భూమికి పరిహారం చెల్లించినా, నిర్వాసితులకు సహాయ, పునరావాస ప్యాకేజీ అమలు చేసినా ఇంత వ్యయం చేయాల్సిన అవసరం ఉండదని ఆదిలోనే పీపీఏ స్పష్టం చేసింది. పోలవరం ప్రాజెక్టు పనుల తరహాలోనే భూసేకరణ, సహాయ, పునరావాస ప్యాకేజీల అంచనా వ్యయాన్ని భారీ ఎత్తున పెంచేసి కమీషన్‌లు పంచుకోవడానికి ప్రభుత్వ పెద్దలు ప్రణాళిక రచించినట్లు గుర్తించింది.

కుడి కాలువ అక్రమాలతో ఆరంభం
టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాల్లో నాలుగు మండలాల్లోని టీడీపీ నేతలు, సానుభూతిపరులైన రైతులకు ఎకరానికి గరిష్టంగా రూ.62 లక్షల చొప్పున పరిహారం పంపిణీ చేసింది. 2013 భూసేకరణ చట్టం ప్రకారం లెక్కగట్టినా ఎకరానికి రూ.20 లక్షలు నుంచి రూ.25 లక్షలకు మించి పరిహారం ఇవ్వడానికి అవకాశం లేదని అధికారవర్గాలు అప్పట్లోనే వెల్లడించాయి. మొత్తం రూ.700 కోట్లను టీడీపీ నేతలు, సానుభూతిపరులకు పరిహారంగా పంపిణీ చేశారు. ఈ వ్యవహారంలో భారీగా ముడుపులు చేతులు మారినట్లు అధికారవర్గాలు చెబుతున్నాయి. పోలవరం జలాశయంలో ముంపునకు గురయ్యే భూమిని 2009కి ముందే సేకరించినా.. సేకరించనట్లు చూపి బినామీ పేర్లతో పరిహారాన్ని టీడీపీ నేతలు కాజేశారు. గిరిజనులకు భూమికి బదులుగా భూమిని పంపిణీ చేసేందుకు జరిపిన భూసేకరణలోనూ, పునరావాస కాలనీల నిర్మాణానికి చేసిన భూసేకరణలోనూ భారీ ఎత్తున అక్రమాలకు పాల్పడి వందలాది కోట్ల రూపాయలను టీడీపీ నేతలు దోచుకున్నారు.

వివరాలు ఇవ్వొద్దని ఒత్తిళ్లు
పోలవరం జలాశయంలో ముంపునకు గురయ్యే భూమి, కుడి, ఎడమ కాలువల తవ్వకానికి అవసరమైన భూమి వెరసి 1,66,423.27 ఎకరాల భూమిని సేకరించాలి. ఇప్పటివరకూ 1,10,787 ఎకరాలను ప్రభుత్వం సేకరించింది. భూసేకరణకు రూ.5,398.59 కోట్లను ఖర్చు చేసింది. పోలవరం జలాశయంలోముంపునకు గురయ్యే గ్రామాల్లోని 1,05,601 నిర్వాసిత కుటుంబాలకు పునరావాసం కల్పించాలి. ఇందులో 3,922 కుటుంబాలకు మాత్రమే ఇప్పటివరకూ పునరావాసం కల్పించారు. నిర్వాసితులయ్యే గిరిజనులకు భూమికి బదులుగా భూమి ఇచ్చేందుకు పది వేల ఎకరాలను సేకరించారు. సహాయ, పునరావాస ప్యాకేజీ కింద రూ.802 కోట్లను ఖర్చు చేశారు. మిగిలిన 55,636 ఎకరాల భూమి సేకరణకు రూ.7,208.89 కోట్లు, 1,01,679 మందికి పునరావాసం కల్పించడానికి రూ.19,817 కోట్లు అవసరమని ప్రభుత్వం లెక్కలు చెబుతోంది.

ఈ నేపథ్యంలో ఇప్పటివరకూ భూసేకరణకు, సహాయ, పునరావాస ప్యాకేజీ అమలుకు చేసిన వ్యయంతోపాటు ఇంకా సేకరించాల్సిన భూమి, పునరావాసం కల్పించాల్సిన నిర్వాసితుల వివరాలు ఇవ్వాలని పీపీఏ కోరింది. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే వివరాల ఆధారంగా క్షేత్ర స్థాయిలో తనిఖీలు చేయించి అక్రమాల గుట్టును రట్టు చేయాలని నిర్ణయించింది. ఇప్పటికే కుడి కాలువ భూసేకరణలో అక్రమాలపై పక్కాగా ఆధారాలు సేకరించిన పీపీఏ.. జలాశయం, ఎడమ కాలువ భూసేకరణ వ్యవహారంపై దృష్టి పెట్టడంతో ప్రభుత్వ పెద్దలు ఆందోళన చెందుతున్నారు. అంచనా వ్యయాన్ని రూ.57,940.86 కోట్లకు పెంచుతూ పంపిన ప్రతిపాదనలు మినహా.. పీపీఏకు ఎలాంటి వివరాలు ఇవ్వొద్దంటూ ప్రభుత్వ పెద్దలు తీవ్ర ఒత్తిడి తెస్తున్నారని భూసేకరణ విభాగంలో కీలక అధికారి తెలిపారు.

మరిన్ని వార్తలు