ప్రణాళిక ముందా? పనులు ముందా?

3 Jul, 2018 02:24 IST|Sakshi

సాగునీటి ప్రాజెక్టుల పనుల్లో రాష్ట్ర ప్రభుత్వ అవగాహన రాహిత్యం

డీపీఆర్‌ లేకుండానే ప్రాజెక్టులకు పరిపాలన అనుమతి మంజూరు

ఎంపిక చేసిన కాంట్రాక్టర్లకు టెండర్ల ద్వారా పనుల అప్పగింత 

అంచనా వ్యయాన్ని పెంచేయడం ద్వారా కమీషన్లు మింగేస్తున్న ముఖ్యనేత

చింతలపూడి ఎత్తిపోతల పనుల్లో మరో బాగోతం

సాక్షి, అమరావతి: సాగునీటి ప్రాజెక్టుల పనుల్లో రాష్ట్ర ప్రభుత్వ అవగాహనా రాహిత్యానికి మరో నిదర్శనమిది. చింతలపూడి ఎత్తిపోతల పథకం విస్తరణ పనులను 13 నెలల క్రితమే కాంట్రాక్టర్లకు అప్పగించింది. 18 నెలల్లోగా పనులు పూర్తి చేయాలంటూ కాంట్రాక్టర్లతో ఒప్పందం చేసుకుంది. పనులు అప్పగించిన 13 నెలల తర్వాత వాటిలో భాగమైన జల్లేరు జలాశయం ముంపు ప్రాంతాన్ని గుర్తించేందుకు సర్వే పనులకు గత నెల 27న టెండర్లు పిలిచింది. సర్వే నివేదిక ఇవ్వడానికి 3 నెలల గడువు విధించింది. అంటే ఈలోగా ఎత్తిపోతల పనులను అప్పగిస్తూ కాంట్రాక్టర్లతో చేసుకున్న ఒప్పందం గడువు ముగుస్తుంది. ఈ నేపథ్యంలో గడువు పొడగించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ధరల సర్దుబాటు కింద కాంట్రాక్టర్లకు అదనపు బిల్లులు ఇవ్వడంతోపాటు పనుల వ్యయాన్ని పెంచేయడానికి ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. 

గోదావరి నదికి వరద వచ్చే 90 రోజుల్లో పశ్చిమ గోదావరి జిల్లా రౌతులగూడెం వద్ద నుంచి రోజుకు 56 క్యూసెక్కుల చొప్పున.. 15.50 టీఎంసీలను పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాల్లో 2 లక్షల ఎకరాలకు సాగునీరు, 6.65 లక్షల మందికి తాగునీరు అందించాలన్న లక్ష్యంతో రూ.1,701 కోట్ల వ్యయంతో 2008 అక్టోబర్‌ 24న చింతలపూడి ఎత్తిపోతల పథకాన్ని దివంగత సీఎం వైఎస్‌ రాజశేఖరరెడ్డి చేపట్టారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చింతలపూడి ఎత్తిపోతలను విస్తరించాలని నిర్ణయించారు. రోజుకు అదనంగా 138.52 క్యూసెక్కుల చొప్పున 90 రోజుల్లో 38 టీఎంసీలను తరలించాలని నిర్ణయించారు. దాంతో చింతలపూడి ఎత్తిపోతల అంచనా వ్యయాన్ని రూ.4,909.80 కోట్లకు పెంచుతూ 2016 సెప్టెంబరు 3న ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తాజాగా చేపట్టిన విస్తరణ పనులను రెండు ప్యాకేజీలుగా విభజించి గతేడాది జూన్‌లో రూ.2,282 కోట్ల చొప్పున ఇద్దరు కాంట్రాక్టర్లకు అప్పగించింది. 

సమగ్ర ప్రాజెక్టు నివేదిక లేకుండానే: చింతలపూడి ఎత్తిపోతల పథకంలో భాగంగా గతంలో జల్లేరు రిజర్వాయర్‌ను 8 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించాలని ప్రతిపాదించారు. కానీ. విస్తరణ పనుల్లో భాగంగా సామర్థ్యాన్ని 20 టీఎంసీలకు పెంచాలని నిర్ణయించారు. విస్తరణ పనులు చేపట్టడానికి ఎలాంటి సమగ్ర ప్రాజెక్టు నివేదిక(డీపీఆర్‌) రూపొందించలేదు. డీపీఆర్‌ లేకుండానే పరిపాలన అనుమతి ఇవ్వడమే కాకుండా టెండర్లు పిలిచేసి, అనుకూలురైన కాంట్రాక్టర్లకు అప్పగించి ముఖ్యనేత, మరో కీలక మంత్రి కమీషన్లు వసూలు చేసుకున్నారు. ఒప్పందం ప్రకారం పనులను 18 నెలల్లోగా పూర్తి చేయాలి. ఇప్పటికే 13 నెలలు పూర్తయ్యాయి. అయినా జల్లేరు రిజర్వాయర్‌ పనులు ఇంకా ప్రారంభమే కాలేదు.

నీటినిల్వ సామర్థ్యం పెంచడం వల్ల రిజర్వాయర్‌లో ముంపునకు గురయ్యే భూములపై స్పష్టత లేకపోవడమే అందుకు కారణం. ముంపు ప్రాంతాన్ని గుర్తించడానికి గత నెల 27న ప్రభుత్వం టెండర్‌ నోటిఫికేషన్‌ జారీ చేసింది. టెండర్ల ప్రక్రియ పూర్తయి, సర్వే నివేదిక రావడానికి కనీసం 5 నెలల సమయం పడుతుంది. అంటే అప్పటికి కాంట్రాక్టు ఒప్పందం గడువు పూర్తవుతుంది. దాంతో కాంట్రాక్టు ఒప్పందం గడువును పొడగించడంతోపాటు ధరల సర్దుబాటు కింద అదనపు నిధులు ఇవ్వడం, అంచనా వ్యయాన్ని భారీగా పెంచేయడం ద్వారా కాంట్రాక్టర్‌కు ప్రయోజనం చేకూర్చి మళ్లీ కమీషన్లు రాబట్టుకోవాలన్నది ముఖ్యనేత ఎత్తుగడ. మొదట్లోనే డీపీఆర్‌ను పక్కాగా రూపొందించి ఉంటే.. ఈ పథకం సకాలంలో పూర్తయ్యేది. సర్కార్‌ నిర్వాకం వల్ల ఐదారేళ్లయిన పూర్తయ్యే అవకాశం కనిపించడం లేదు. 

ఆర్థిక శాఖ అభ్యంతరాలు బేఖాతర్‌: జల వనరుల శాఖ ఇంజనీర్‌–ఇన్‌–చీఫ్‌కు తెలియకుండానే ఇటీవల గోదావరి–పెన్నా నదుల అనుసంధానం తొలి దశను రూ.6,020.15 కోట్లతో చేపట్టేందుకు ఆర్థిక శాఖ అనుమతి కోసం ముఖ్యనేత ప్రతిపాదనలు పంపించారు. క్షేత్రస్థాయిలో చేపట్టే పనులకు, అంచనా వ్యయానికి భారీ వ్యత్యాసం ఉండడంపై ఆశ్చర్యపోయిన ఆర్థిక శాఖ– అత్యంత ప్రాధాన్య ప్రాజెక్టుగా చేపట్టడానికి నిధులు మంజూరు చేయాలన్న సర్కార్‌ ప్రతిపాదనపై అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇది అత్యంత ప్రధానమైన ప్రాజెక్టు అయితే 2018–19 బడ్జెట్‌లో ఒక్క పైసా కూడా ఎందుకు కేటాయించలేదని ప్రశ్నించింది.

కేవలం ప్రతిపాదనల ఆధారంగా నిధులు మంజూరు చేస్తే.. తక్షణమే టెండర్లు పిలిచి పనులను కాంట్రాక్టర్లకు అప్పగిస్తారని.. సర్వే, భూసేకరణలో జాప్యం చోటుచేసుకుంటే అంచనా వ్యయం పెరుగుతుందని స్పష్టం చేసింది. తొలుత సర్వే పనులు, 60% భూసేకరణ పూర్తి చేశాక ప్రాజెక్టు పనులు చేపడితే సకాలంలో పూర్తయ్యే అవకాశం ఉంటుందని పేర్కొంది. సర్వే, భూసేకరణకు కావాలంటే అనుమతి ఇస్తామని తేల్చిచెబుతూ ప్రతిపాదనలను వెనక్కి పంపింది. కానీ, ముఖ్యనేత ఆ ఫైల్‌పై సంతకం చేయడంతో గోదావరి–పెన్నా తొలి దశకు గత నెల 13న జలవనరుల శాఖ పరిపాలన అనుమతి ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పనులకు ఈ నెలలోనే టెండర్ల ప్రక్రియను పూర్తి చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.  

మరిన్ని వార్తలు