జగన్‌ దీక్షతో కేంద్ర ప్రభుత్వంలో చలనం

3 May, 2017 14:24 IST|Sakshi
క్వింటాల్‌ మిర్చికి రూ.5వేలు మద్దతు ధర

న్యూఢిల్లీ:  రైతుల సమస్యలు, పంటకు గిట్టుబాటు ధరలు కల్పించాలంటూ ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి చేసిన రైతుదీక్షకు కేంద్ర ప్రభుత్వంలో చలనం వచ్చింది. క్వింటా మిర్చికి కేంద్ర ప్రభుత్వం రూ.5వేలు మద్దతు ధర ప్రకటించింది. తెలుగు రాష్ట్రాల్లో మిర్చికి మార్కెట్‌ ఇంటర్‌వెన్షన్‌ స్కీమ్‌ అమలు చేయాలని నిర్ణయించింది. క్వింటా మిర్చి ధర రూ.5వేలుగా నిర్ణయించి, ఓవర్‌ హెడ్‌ ఛార్జెస్‌ కింద రూ.1250 అదనంగా చెల్లించనుంది. పంటను రాష్ట్ర ప్రభుత్వ ఏజెన్సీల ద్వారా కొనుగోలు చేయాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది.

తాజా నిర్ణయంతో ఆంధ్రప్రదేశ్‌లో 88,300 మెట్రిక్‌ టన్నులు, తెలంగాణలో 33,700 మెట్రిక్‌ టన్నుల మిర్చి కొనుగోలు చేయనుంది. మే 2 నుంచి 31 వరకూ చేసే కొనుగోళ్లుకు ఈ తాజా నిర్ణయం వర్తించనుంది. ఈ విషయాన్ని కేంద్ర మంత్రులు రాధా మోహన్‌ సింగ్‌, వెంకయ్య నాయుడు వెల్లడించారు.  అయితే కొనుగోలు కేంద్రాలు ఎక్కడ ఉండాలనేది ఆయా రాష్ట్రలు ప్రభుత్వాలు నిర్ణయిస్తాయని, ఏజెన్సీల ద్వారా  కొనుగోలు చేసిన మిర్చికి నష్టం వాటిల్లితే 50-50 శాతం భరించాలని తెలిపారు.

కాగా  మద్దతు ధర, గిట్టుబాటు ధరలపై చంద్రబాబు నాయుడు ప్రభుత్వ నిర్లక్ష్యం, రుణమాఫీ మోసానికి నిరసనగా, రైతులకు మద్దతు పలుకుతూ సోమ, మంగళ వారాల్లో రెండు రోజుల పాటు గుంటూరు నల్లపాడు రోడ్డులోని మిర్చియార్డు సమీపంలో వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి నిరాహారదీక్ష చేసిన విషయం తెలిసిందే.

మరిన్ని వార్తలు