శిల్పకళ అద్భుతం

13 Jun, 2014 03:14 IST|Sakshi
శిల్పకళ అద్భుతం

 హిందూపురం అర్బన్/లేపాక్షి : లేపాక్షి ఆలయంలోని శిల్పకళా నైపుణ్యం అద్భుతమని రాష్ర్ట గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ ప్రశంసలు కురిపించారు. ప్రసిద్ధ పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చెందడానికి ఇక్కడి శిల్పకళా నైపుణ్యం, ఆలయ చరిత్రపై విస్తృత ప్రచారం చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. గురువారం ఆయన లేపాక్షి విరుపాక్షేశ్వరస్వామి ఆలయాన్ని సందర్శించారు.
 
 ప్రాకారాలు, నాలుగు వైపులున్న ద్వారాలు, ఆలయ విశిష్టత తెలిపే శాసనాలు, గార, ఇటుక, కోడిగుడ్డు మిశ్రమంతో నిర్మించిన పైకప్పు, వినాయకుడి విగ్రహం, ఏడు శిరసుల నాగేంద్రుడు, అక్కమ్మ దేవతలు, శ్రీకాళహస్తి మహత్యంకు సంబంధించిన సాలే పురుగు, ఏనుగు, పాము శిల్పాలు తిలకించారు. విరుపణ్ణ గోడకు వేసిన కళ్లు, అర్ధంతరంగా ఆగిపోయిన కల్యాణమంటపం, లతా మంటపంలోని వివిధ రకాల డిజైన్లను ఆసక్తిగా గమనించారు. అనంతరం సీతమ్మ పాదం, శివలింగాలు, నాట్యమంటపం, పైకప్పులో భూకైలాస్, మననీతి కథ, గోడలకున్న భక్తశిరియాళ, కిరాతార్జునీయం బొమ్మలను తిలకించారు. అంతరిక్ష స్తంభం, వటపత్రసాయి చిత్రాలు చూశారు. స్థానిక పురావస్తు శాఖ అటెండర్ తెలుగులో ఆలయ విశిష్టతను వివరించగా హైదరాబాద్ నుంచి వచ్చిన పురావస్తు శాఖ సూపరింటెండెంట్ బాబ్జిరావు ఆంగ్లంలో గవర్నర్‌కు అనువదించారు. అనంతరం వీరభద్రస్వామి, దుర్గాదేవి, రఘనాథస్వామి, పాపనాశేశ్వర స్వాములకు విశేష పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆలయంలో శిల్ప కళ అబ్బురపరుస్తోందన్నారు. టూర్ గైడ్ల సంఖ్య పెరగాలన్నారు.
 
 ఈ ప్రాంత అభివృద్ధి కోసం తనవంతుగా ప్రభుత్వానికి సిఫార్సు చేస్తానని చెప్పారు. ఆలయంలో వినాయకుడి విగ్రహం చోరీ కేసు గురించి విలేకరులు ప్రస్తావించగా.. అది దేవుడే చూసుకుంటాడన్నారు. పెనుకొండలో పర్యాటక అభివృద్ధి జరగడం లేదని, కొండపై గవర్నర్ అతిథి గృహ నిర్మాణం తేలలేదని గవర్నర్ దృష్టికి తేగా.. పనులు జరుగుతున్నాయి కదా అని అన్నారు. అనంతరం లేపాక్షి ఆలయం నుంచి ప్రధాన రహదారిలో ఉన్న నంది విగ్రహాన్ని దర్శించుకుని కిరికెర అతిథి గృహానికి వెళ్లిపోయారు.
 
 అంతకు ముందు ఆలయంలో గవర్నర్‌కు కలెక్టర్ లోకేష్‌కుమార్, ఎస్పీ సెంథిల్‌కుమార్‌తోపాటు దేవాదాయశాఖ అధికారులు ఘనంగా స్వాగతం పలికారు. జాయింట్‌కలెక్టర్ సత్యనారాయణ గవర్నర్‌ను సత్కరించి, పట్టువస్త్రాలు అందజేశారు. వేదపండితులు ఆశీర్వచనాలు పలికారు. దేవాదాయ శాఖ ఏసీ మల్లికార్జున విరుపాక్షేశ్వరస్వామి చిత్రపటాన్ని గవర్నర్‌కు అందజేశారు.
 గవర్నర్‌కు ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి, మడకశిర ఎమ్మెల్యే వీరన్నతో పాటు ఆలయ కమిటి చైర్మన్ సుబ్రమణ్యం, కమిటీ సభ్యులు, గ్రామ సర్పంచ్ జయప్ప, జెడ్పీటీసీ సభ్యుడు ఆదినారాయణరెడ్డి, ఎంపీపీ అభ్యర్థి హనోక్ పుష్పగుచ్ఛాలు అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు.  
 
 అభివృద్ధికి సిఫార్సు చేయండి
 లేపాక్షి దేవాలయాన్ని అభివృద్ధి చేయడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సిఫార్సు చేయాలని రాష్ట్ర గవర్నర్ నరసింహన్‌కు లేపాక్షి దేవాలయ జాయింట్ యాక్షన్ కమిటీ (జేఏసీ) సభ్యులు రామాంజనేయులు, రాంప్రసాద్, కేశవరెడ్డి తదితరులు వినతి పత్రాన్ని అందజేశారు. వినతిపత్రంలో కింది అంశాలున్నాయి.
 
 లేపాక్షిలో టీటీడీ ఆధ్వర్యంలో కల్యాణ మంటపం ఏర్పాటు చేయాలి.
  ఆలయానికి తూర్పు వైపు స్థలంలో పార్కు అభివృద్ధి చేయాలి.
 ఆలయం వెనుక వున్న మాజీ రాష్ర్టపతి వి.వి.గిరి బీటీ రోడ్డును అభివృద్ధి చేయాలి.
 ఆలయానికి సరిపడే జనరేటర్‌ను సమకూర్చాలి.
 
 విరుపణ్ణ మంటపం స్థలంలో మరుగుదొడ్లు, విశ్రాంతి భవనం నిర్మించాలి.
లేపాక్షి హ్యాండిక్రాప్ట్ అండ్ సిల్క్ ఎంపోరియం, ఆలయం వెనుక ఆరెకరాల స్థలంలో చిన్నపిల్లల పార్కు అభివృద్ధి చేయాలి.
 
  లేపాక్షి -బింగిపల్లి రోడ్డులో జటాయువు పక్షి విగ్రహం ఏర్పాటు చేయాలి.
 నాట్యమంటపం, మ్యూజియం ఏర్పాటు చేయాలి.
 

మరిన్ని వార్తలు