శ్రీశైలం భద్రత గాలికి!  

24 Apr, 2019 04:05 IST|Sakshi

2009లో జలాశయానికి పోటెత్తిన వరద

రికార్డు స్థాయిలో 25.50 లక్షల క్యూసెక్కుల ప్రవాహంతో పూర్తిగా దెబ్బతిన్న ఫ్లంజ్‌ పూల్‌

మరమ్మతులతోపాటు స్పిల్‌ వే సామర్థ్యాన్ని 30 లక్షల క్యూసెక్కులకు పెంచాలన్న ఎన్‌సీడీఎస్‌ 

10 – 12 లక్షల క్యూసెక్కుల వరద వచ్చినా ముప్పు తప్పదంటున్న అధికారులు

సాక్షి, అమరావతి: శ్రీశైలం జలాశయం భద్రతను రాష్ట్ర ప్రభుత్వం గాలికి వదిలేసిందా? 2009 తరహాలో కృష్ణమ్మ పోటెత్తితే శ్రీశైలం జలాశయానికి పెనుముప్పు తప్పదా? కమీషన్లు రావనే నేషనల్‌ కమిటీ ఆన్‌ డ్యామ్‌ సేఫ్టీ (ఎన్‌సీడీఎస్‌) ఇచ్చిన నివేదికను టీడీపీ సర్కారు బుట్టదాఖలు చేసిందా..? అనే ప్రశ్నలకు అవుననే సమాధానం చెబుతున్నాయి రాష్ట్ర జలవనరుల శాఖ వర్గాలు.. 

మరమ్మతుపై మొద్దు నిద్ర
2009లో వచ్చిన భారీ వరదలకు పూర్తిగా దెబ్బతిన్న శ్రీశైలం జలాశయం ప్లంజ్‌ పూల్‌కు ఇప్పటికీ మరమ్మతులు చేయకపోవడాన్ని అధికారవర్గాలు తప్పుబడుతున్నాయి. అప్పటి తరహాలో 25.5 లక్షల క్యూసెక్కుల వరద వస్తే జలాశయం భద్రతకు పెనుముప్పు తప్పదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. శ్రీశైలం గరిష్ట నీటి మట్టం (ఎఫ్‌ఆర్‌ఎల్‌) 885 అడుగులు కాగా నీటి నిల్వ సామర్థ్యం 215.87 టీఎంసీలు. కృష్ణా నదికి ప్రతి వెయ్యేళ్లకు ఒకసారి గరిష్టంగా 20.20 లక్షల క్యూసెక్కుల వరద వస్తుందని లెక్క కట్టిన నిపుణులు 19.95 లక్షల క్యూసెక్కుల వరదను దిగువకు విడుదల చేసేలా శ్రీశైలం జలాశయం స్పిల్‌వే(కాంక్రీట్‌ ఆనకట్ట)ను నిర్మించారు.

జలాశయం నిర్మించినప్పటి నుంచి 2009 అక్టోబర్‌ 2 వరకూ కృష్ణా నదికి భారీ వరద ప్రవాహం వచ్చిన దాఖలాలు లేవు. కానీ ఎగువన కురిసిన భారీ వర్షాల వల్ల 2009లో అక్టోబర్‌ 2 నుంచి 6వ తేదీల మధ్య గరిష్టంగా 25.50 లక్షల క్యూసెక్కుల ప్రవాహం వచ్చింది. శ్రీశైలం స్పిల్‌ వే నుంచి దిగువకు విడుదల చేసే వరద ప్రవాహం కంటే ఇది 5.55 లక్షల క్యూసెక్కులు అధికం కావడం గమనార్హం. భారీ వరద ధాటికి శ్రీశైలం జలాశయం ప్లంజ్‌ పూల్‌ 4వ బ్లాక్‌ నుంచి 16వ బ్లాక్‌ వరకూ పూర్తిగా దెబ్బతింది. ప్లంజ్‌ పూల్‌లో బ్లాక్‌ల మధ్య పెద్దగొయ్యి ఏర్పడటంతో లీకేజీ రూపంలో భారీగా నీరు దిగువకు వెళుతోంది. బ్లాక్‌ల మధ్య ప్లంజ్‌ పూల్‌కు మరమ్మతులు చేయకుంటే స్పిల్‌ వేకు పెనుముప్పు తప్పదని 2009లో జలవనరుల శాఖ అధికారులు సర్కార్‌కు నివేదిక ఇచ్చారు. దీనిపై ఓ ఉన్నత స్థాయి కమిటీని నియమించిన ప్రభుత్వం అంతటితో సరిపుచ్చింది.

ఎన్‌సీడీఎస్‌ నివేదిక బుట్టదాఖలు..
విభజన అనంతరం టీడీపీ అధికారంలోకి వచ్చాక కేంద్ర జలసంఘం(సీడబ్ల్యూసీ) మాజీ ఛైర్మన్‌ ఏబీ పాండ్య అధ్యక్షతన కేంద్రం నియమించిన ఎన్‌సీడీఎస్‌ శ్రీశైలం జలాశయాన్ని 2014లో పరిశీలించింది. ప్లంజ్‌ పూల్‌కు తక్షణమే మరమ్మతులు చేయాలని, స్పిల్‌ వే నుంచి దిగువకు వరద జలాలను విడుదల చేసే సామర్థ్యాన్ని 19.95 లక్షల క్యూసెక్కుల నుంచి 30 లక్షల క్యూసెక్కులకు పెంచాలని సర్కార్‌కు నివేదిక ఇచ్చింది. నది సహజ ప్రవాహ దిశలో ప్లంజ్‌ పూల్‌ వద్ద గొయ్యి ఏర్పడిన నేపథ్యంలో.. విశాఖలోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఓషనోగ్రఫీ(ఎన్‌ఐవో)తో బాత్‌మెట్రిక్‌ సర్వే చేయించాలని సూచించింది. ప్లంజ్‌ పూల్‌ ఏర్పడిన గొయ్యి నుంచి లీకేజీ అవుతున్న అంతర్గత ప్రవాహ ఉద్ధృతిని అంచనా వేసేందుకు గోవాలోని ఎన్‌ఐవోతో సర్వే చేయించాలని పేర్కొంది. అయితే ప్లంజ్‌ పూల్‌ మరమ్మతుల పనుల్లో భారీగా కమీషన్‌లు రావనే ఉద్దేశంతో ప్రభుత్వ పెద్దలు దీన్ని పట్టించుకోలేదు. బాత్‌మెట్రిక్‌ సర్వే పనులను మాత్రం తప్పనిసరై ఎన్‌ఐవోకు అప్పగించారు. స్పిల్‌ వే సామర్థ్యాన్ని పెంచే అంశంపై కనీసం సమీక్ష నిర్వహించిన దాఖలాలు కూడా లేవు.

వాతావరణశాఖ అంచనాలతో డ్యాం భద్రతపై ఆందోళన
శ్రీశైలం జలాశయం నిర్మించక ముందు కృష్ణా నదికి 1903లో గరిష్టంగా 10.60 లక్షల క్యూసెక్కుల వరద ప్రవాహం వచ్చింది. 1998లో శ్రీశైలం జలాశయంలోకి 8.90 లక్షల క్యూసెక్కుల వరద వచ్చింది. అప్పట్లో స్పిల్‌ వే 12వ గేటు మొరాయించడంతో కుడి గట్టు విద్యుదుత్పత్తి కేంద్రంలోకి వరద జలాలు చేరి భారీ నష్టం వాటిల్లింది. 2009 అక్టోబర్‌లో రికార్డు స్థాయిలో 25.50 లక్షల క్యూసెక్కుల వరద ప్రవాహం వచ్చింది. కృష్ణా పరీవాహక ప్రాంతంలో వర్షపాతం, అటవీ విస్తీర్ణం తగ్గిపోవడాన్ని పరిగణనలోకి తీసుకున్న ఎన్‌సీడీఎస్‌.. భారీ వర్షాలు కురిస్తే 30 లక్షల క్యూసెక్కుల వరద శ్రీశైలంలోకి వచ్చే అవకాశం ఉందని అంచనా వేసింది. మరోవైపు ఈ ఏడాది భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ అంచనాల నేపథ్యంలో శ్రీశైలం జలాశయం భద్రత సవాల్‌గా మారనుందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. 10 – 12 లక్షల క్యూసెక్కుల వరద వచ్చినా ముప్పు తప్పదనే ఆందోళన వ్యక్తమవుతోంది.

మరిన్ని వార్తలు