జీఎస్టీ ఆదాయానికి గండి

18 Aug, 2019 04:14 IST|Sakshi

పడిపోయిన ఆటోమొబైల్‌ అమ్మకాలు, తగ్గిన స్టీల్, సిమెంట్, ఎరువుల ధరలే కారణం

కనీస నెలవారీ నిర్దేశిత రక్షిత ఆదాయాన్ని చేరుకోని వైనం

దీంతో రూ.516 కోట్ల నష్టపరిహారం కోరుతున్న రాష్ట్రం

సాక్షి, అమరావతి: ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థ మందగమనంలో నడుస్తుండటంతో ఆ ప్రభావం మన రాష్ట్ర జీఎస్టీ ఆదాయంపై కూడా పడింది. గత నాలుగు నెలల్లో రెండు నెలలు కనీస నెలవారీ రక్షిత ఆదాయాన్ని రాష్ట్రం పొందలేకపోయింది. ఈ ఆర్థిక సంవత్సరం (2019–20) ప్రతి నెలా కనీస నిర్దేశిత రక్షిత ఆదాయాన్ని రూ.1,892.99 కోట్లుగా నిర్ణయించారు. దీని కంటే ఎంత తక్కువ వస్తే అంత నష్టాన్ని కేంద్ర ప్రభుత్వంభర్తీ చేస్తుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ప్రారంభ నెల ఏప్రిల్‌లో ఆదాయ వృద్ధి బాగున్నా మరుసటి నెలల్లో ఆదాయం తగ్గింది. మే, జూన్‌ నెలలు నిర్దేశిత రక్షిత ఆదాయాన్ని అందుకోకపోవడంతో ఈ రెండు నెలలకు కలిపి రూ.516.6 కోట్ల నష్టపరిహారాన్ని కేంద్రం నుంచి కోరినట్లు రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ అధికారులు వెల్లడించారు.

2018–19లో ఏప్రిల్, మే, జూన్, జూలైల్లో రూ.6,896.56 కోట్ల ఆదాయం వస్తే అది ఈ ఏడాది కేవలం 6.51 శాతం వృద్ధితో రూ.7,345.69 కోట్లకు మాత్రమే పరిమితమైంది. ఆటోమొబైల్‌ అమ్మకాలు భారీగా క్షీణించడం, ఉక్కు రేట్లు 10 నుంచి 15 శాతం తగ్గడం, సిమెంట్‌ బస్తాకు రూ.20 వరకు తగ్గడంతో ఆదాయం తగ్గిందని అధికారులు అంటున్నారు. ఇదే సమయంలో రుతుపవనాలు సకాలంలో రాకపోవడంతో ఎరువుల అమ్మకాలు కూడా పడిపోయాయి. జూలైలో ఆదాయం నిర్దేశిత లక్ష్యానికి మించి రూ.1,962.77 కోట్లు వచ్చినా ఆగస్టుకు సంబంధించి ఇప్పటివరకు వస్తున్న గణాంకాలు అంత ఆశాజనకంగా లేవంటున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే ఈ ఏడాది ఆదాయంలో రెండంకెల వృద్ధిని నమోదు చేయడం కూడా కష్టమేనంటున్నారు. నిర్దేశిత రక్షిత ఆదాయం ప్రకారం చూసుకున్నా ఈ ఏడాది కనీసం రూ.22,715.88 కోట్లు రావాల్సి ఉందని, కానీ ప్రస్తుత గణాంకాలను బట్టి చూస్తే ఈ మొత్తాన్ని దాటడం సాధ్యం కాకపోవచ్చుంటున్నారు.

మరిన్ని వార్తలు