గవర్నర్‌కు రాష్ట్ర ఐటీ మంత్రి ఘన స్వాగతం

25 Aug, 2019 08:24 IST|Sakshi
స్వాగతం పలుకుతున్న మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి 

సాక్షి, నెల్లూరు: ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడికి స్వాగతం పలికేందుకు గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ శనివారం తొలిసారిగా నెల్లూరు జిల్లాకు వచ్చారు. ఉదయం 11.35కు ప్రత్యేక హెలికాప్టర్‌లో ఆయన నెల్లూరులోని పోలీస్‌ కవాతు మైదానానికి చేరుకున్నారు. హెలిప్యాడ్‌ వద్ద గవర్నర్‌కు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి, గుంటూరు రేంజ్‌ ఐజీ వినీత్‌ బ్రిజ్‌లాల్, కలెక్టర్‌ శేషగిరిబాబు, విక్రమ సింహపురి వర్సిటీ వీసీ, ఎస్పీ ఐశ్వర్య రస్తోగి పుష్పగుచ్ఛాలిచ్చి ఘన స్వాగతం పలికారు. అనంతరం గవర్నర్‌ రోడ్డుమార్గన ఆర్‌ అండ్‌ బీ అతిథిగృహానికి చేరుకొని ఉపరాష్ట్రపతి కోసం వేచిచూశారు. మధ్యాహ్నం 12.55 గంటలకు ఉపరాష్ట్రపతి పర్యటన రద్దయిందని అధికారులు ప్రకటించారు. ఈ క్రమంలో 1.30కు గవర్నర్‌ వీఎస్‌యూలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్‌కు చేరుకొని ప్రత్యేక హెలికాప్టర్‌లో విజయవాడ పయనమయ్యారు.

వీఎస్‌యూ స్నాతకోత్సవం రద్దు
వెంకటాచలం: నెల్లూరులోని కస్తూర్బా కళాక్షేత్రంలో ఆదివారం జరగాల్సిన విక్రమ సింహపురి యూనివర్సిటీ (వీఎస్‌యూ) స్నాతకోత్సవ వేడుకలను రద్దు చేస్తున్నామని రిజిస్ట్రార్‌ అందె ప్రసాద్‌ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. కేంద్ర మాజీ మంత్రి అరుణ్‌ జైట్లీ మృతితో ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడి పర్యటన రద్దు కావడంతో స్నాతకోత్సవం వాయిదా పడిందని చెప్పారు. తదుపరి ఎప్పుడు నిర్వహించేది త్వరలోనే తెలియజేస్తామన్నారు.

మరిన్ని వార్తలు