పటిష్టంగా కేంద్ర ప్యాకేజీ అమలు

19 May, 2020 04:45 IST|Sakshi

సీఎస్‌ నీలం సాహ్ని ఆదేశం 

కేంద్ర ఆర్థిక ప్యాకేజీ అమలుపై రాష్ట్రస్థాయి కమిటీ భేటీ 

సాక్షి, అమరావతి: కేంద్ర ప్రభుత్వం ఆత్మనిర్భర్‌ భారత్‌ అభియాన్‌ పథకం కింద ప్రకటించిన ప్యాకేజీని పటిష్టంగా అమలుచేయడం ద్వారా సమాజంలోని పేదలు సహా ప్రతి ఒక్కరికీ లబ్ధి చేకూరేలా చర్యలు తీసుకోవాల్సిన ఆవశ్యకత ఉందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని చెప్పారు. కోవిడ్‌–19 నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఆర్థిక ప్యాకేజీ అమలుపై రాష్ట్రస్థాయి కమిటీ ప్రాథమిక సమావేశం సోమవారం జరిగింది. విజయవాడలోని తన క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ సమావేశానికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా సీఎస్‌ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలుచేస్తున్న నవరత్నాలు కార్యక్రమానికి ప్రాధాన్యత ఇస్తూనే కేంద్ర ప్రభుత్వ ప్యాకేజీ అమలుకూ ప్రాధాన్యత ఇవ్వాలన్నారు.

ఆ దిశగా సంబంధిత శాఖలు కార్యాచరణ ప్రణాళికలు సిద్ధంచేసి అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.  కేంద్రం ప్రకటించిన ఆర్థిక ఉద్దీపన ప్యాకేజీతో ఏయే శాఖకు ఎంతమేరకు నిధులు సమకూరుతాయో అంచనా వేసి ఆ ప్రకారం వివిధ పథకాల ద్వారా ప్రజలందరికీ లబ్ధిచేకూర్చేందుకు చర్యలు చేపట్టాలని సీఎస్‌ నీలం సాహ్ని ఆయా శాఖల ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శులను ఆదేశించారు. ఈ సమావేశంలో  ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్‌ఎస్‌ రావత్, ప్రత్యేక కార్యదర్శి కె. సత్యనారాయణ, ఎస్‌ఎల్‌బీసీ  కన్వీనర్‌ నాంచారయ్య తదితరులు పాల్గొన్నారు.

కరోనాపై విస్తృత అవగాహన కల్పించాలి
కరోనాపై విస్తృత ప్రచారం కల్పించి ప్రజల్లో ఉన్న భయాందోళనలను పోగొట్టాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలంసాహ్ని అన్ని జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు. సోమవారం సీఎస్‌ విజయవాడ క్యాంపు కార్యాలయం నుంచి కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు.  వైరస్‌ వ్యాప్తి చెందకుండా భౌతిక దూరం పాటించడం, మాస్క్‌ ధరించడం వంటి తప్పనిసరిగా పాటించాల్సిన 10 అంశాల్లో పెద్ద ఎత్తున ప్రచారం చేపట్టి ప్రజలకు అవగాహన కలిగించాలని ఆదేశించారు.  

మరిన్ని వార్తలు