ప్రతి నియోజకవర్గానికి రూ.10 కోట్లు ఇవ్వాలి : పెద్దిరెడ్డి

4 Oct, 2019 13:38 IST|Sakshi

రాష్ట్రస్థాయి డ్వామా పీడీల సమావేశం

హాజరైన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

ఉపాధి హామీ పనులపై సమీక్ష

సాక్షి, అమరావతి : ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులపై అధికారులు వెంటనే స్పందించాలని పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆదేశించారు. తాడేపల్లిలో పంచాయతీరాజ్‌ కమిషనర్‌ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన రాష్ట్రస్థాయి జిల్లా నీటి యాజమాన్య సంస్థ(డ్వామా) పీడీల సమావేశానికి మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో పంచాయతీరాజ్‌ ప్రిన్సిపల్‌ కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, కమిషనర్‌ గిరిజా శంకర్‌తోపాటు13 జిల్లాల డ్వామా ప్రాజెక్ట్‌ డైరెక్టర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉపాధి హామీ పనుల గురించి చర్చించారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ.. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో ఉన్నత లక్ష్యాలను సాధించాలని, గతేడాది కంటే కనీసం 20 శాతం అధికంగా పనిచేయాలని సూచించారు. ప్రగతిపై ప్రతి నెల ప్రిన్సిపల్ సెక్రటరీ, కమిషనర్ల ఆధ్వర్యంలో సమీక్షలు నిర్వహించాలని, ప్రతి నియోజకవర్గానికి రూ.10 కోట్లు మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం(నరేగ) కింద ఇవ్వాలని కలెక్టర్లకు మంత్రి పెద్దిరెడ్డి ఆదేశాలు జారీ చేశారు.

డ్రైనేజీ, మురుగునీటి శుద్ది వంటి కార్యక్రమాలు చేపట్టి, ప్రాధాన్యత క్రమంలో గ్రామస్థాయిలో ప్రతిపాదిత పనులు చేయాలని ఆయన పేర్కొన్నారు. గ్రామ సచివాలయాలు, అసంపూర్తిగా ఉన్న అంగన్‌వాడీలు, స్కూళ్లలో వసతులపై దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చెప్పినట్లు ''నాడు-నేడు'' అనే విధంగా స్కూళ్లను ఆధునీకరించాలని అన్నారు. 40 వేలకు పైగా వున్న పాఠశాలలకు ప్రహారీ, మరుగుదొడ్ల నిర్మాణానికి ప్రతిపాదనలు పంపాలని అంతర్గత రహదారులు, హార్టీకల్చర్‌, మత్య్స పెంపకం వంటివి ప్రోత్సహించాలని సూచించారు. 11వేలకు పైగా వున్న గ్రామ సచివాలయాలకు ఉపాధి హామీని వర్తింపజేయాలని... అవసరైన చోట్ల కొత్త భవనాలు నిర్మించాలని.. ప్రస్తుతం ఉన్న వాటికి అదనపు గదుల నిర్మాణాలు చేపట్టాలని ఆదేశించారు. కేంద్రం నుంచి నిధులు మరింత రావాలంటే, నరేగ పురోగతిలో ముందుండాలని మంత్రి సూచించారు.

అదే విధంగా ఫీల్డ్ అసిస్టెంట్‌లపై ఫిర్యాదులు వస్తే వెంటనే వారిపై చర్యలు తీసుకోవాలని.. అలాగే  మొక్కల సంరక్షణ, ప్లాంటేషన్‌లపై దృష్టి సారించాలని, ట్రీగార్డుల కోసం అన్ని జిల్లాల నుంచి కొటేషన్లు తెప్పించుకుని తక్కువ రేటును నిర్ణయించాలని అన్నారు. చిత్తూరు జిల్లాలో కూలీలు వలసలు వెళ్లకుండా చూడాలని ఆదేశించారు. ఏజెన్సీ ప్రాంతాల్లో గిరి సేవ పథకం కింద గ్రామ సచివాలయాలు నిర్మించాలని, వెంటనే వాటికి టెండర్లు పిలవాలని సూచించారు. 'ఉద్దానం' వంటి ప్రాంతంలో వెంటనే నరేగ కింద ప్లాంటేషన్‌ చేపట్టాలని, ప్రభుత్వం అందించే పక్కా గృహాలకు 90 రోజుల ఉపాధి పని దినాలను సద్వినియోగం చేయాలని పేర్కొన్నారు. నరేగ కింద ఎంపీలు ప్రతిపాదించే పనులకు ఎంపీ నిధులు కూడా తీసుకోవాలని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు.

మరిన్ని వార్తలు