27 నుంచి రాష్ట్ర స్దాయి పైకా పోటీలు

22 Dec, 2015 17:59 IST|Sakshi

నరసరావుపేటరూరల్: నరసారావుపేట పట్టణంలోని స్టేడియం మరో రాష్ట్ర స్దాయి పోటీలకు అతిథ్యమివ్వబోతుంది. రాష్ట్ర స్దాయి రాజీవ్‌గాంధీ ఖేల్ అభియాన్ గ్రామీణ క్రీడా పోటీలు (బాలురు, బాలికలు) ఈనెల 27, 28, 29తేదీల్లో ఇక్కడ నిర్వహించనున్నారు. గ్రూప్ వన్‌లోని అథ్లెటిక్స్, తైక్వాండొ, వాలీబాల్ పోటీలు ఇక్కడ జరగనున్నాయి. 13 జిల్లాలకు చెందిన 1200మంది క్రీడాకారులు ఈ పోటీల్లో పాల్గోననున్నారు. జిల్లా క్రీడాసాధికారక సంస్ద అధికారులు ఈ పోటీల ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. మంగళవారం స్టేడియాన్ని ఇన్‌చార్జ్ డిఎస్‌డివొ పి.రామకృష్ణ, వెంకటేశ్వరరావులు పరిశీలించారు. వాలీబాల్ కోర్టులు రెండు ఇప్పటికే సిద్దంగా ఉన్నాయి.

తైక్వాండొ పోటీలకు ఇండోర్ స్టేడియాన్ని ఉపయోగించనున్నారు. అధ్లెటిక్స్ పోటీల నిర్వహణకు సంబంధించి స్టేడియంలో కొన్ని సమస్యలు ఉన్నాయి. శతాబ్ది ఉత్సవాల సందర్బంగా రన్నింగ్ ట్రాక్ దెబ్బతింది. ఇప్పటి వరకు దీనికి మరమ్మత్తులు పూర్తికాలేదు. సమయం తక్కువుగా ఉన్నందున ట్రాక్ ఏర్పాటును యుద్ద ప్రాతిపదికన చేపడుతున్నట్టు డిఎస్‌డివో తెలిపారు. ట్రాక్‌కు ట్యాంకర్లతో వాటరింగ్ చేసే పనులు మొదలుపెట్టామని చెప్పారు. గుంటూరు నుండి గ్రౌండ్‌మెన్స్‌ను రప్పించిడం జరిగిందని రెండు, మూడు రోజుల్లో అన్ని సిద్ధం చేస్తామని తెలిపారు.

మరిన్ని వార్తలు